breaking news
problematic areas
-
సద్దుమణగని సయ్యద్‌పల్లి
సాక్షి, పరిగి: చిన్నపాటి గొడవలు, అక్కడక్కడ చోటుచేసుకుంటున్న చెదురుమదురు సంఘటనలపై.. దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పెద్ద నేరాలకు దారితీస్తోంది. బాధితులు ఫిర్యాదు చేసిన సమయంలో చిన్నపాటి గొడవలుగా భావిస్తున్న పోలీసులు.. పరిస్థితులు చేయి దాటేవరకూ పట్టించుకోవడం లేదు. పోలీసుల డైరీలోని కొన్ని నేరాలను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. ఆరు నెలల క్రితం పరిగి మండలం సల్తాన్పూర్లో టీఆర్ఎస్ నేత హత్యకు గురికావడం, దోమ మండంలో జంట హత్యల ఉదంతాలను ప్రజలు ఇంకా మర్చి పోలేదు.. ఈ రెండు ఘటనలు ముందస్తు హెచ్చరికల తర్వాత జరిగినవే. స్థానిక పరిస్థితులను అంచనా వేడయంలో పోలీసులు విఫలం కావడం వల్లే ఈ హత్యలు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయా గ్రామాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికీ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో సమస్యాత్మక గ్రామమైన.. పరిగి మండలం సయ్యద్‌పల్లిలో చోటుచేసుకున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కారు తగలబెట్టి.. చంపుతామని రాతలు... గత జూన్ 4వ తేదీ రాత్రి సయ్యద్‌పల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అప్పటి ఎంపీటీసీ సభ్యురాలి కుమారుడు అయిన తైలం వెంకటయ్య ఇంటి ఎదుట పార్క్ చేసిన కారును పెట్రోల్ పోసి తగెలబెట్టారు. మరుసటి రోజు స్థానిక ఎమ్మెల్యేతోపాటు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. కారును తగులబ్టెన ఘటన జరిగిన వారంలోపే అదే టీఆర్ఎస్ నాయకుడు వెంకటయ్యకు హెచ్చరికలు పంపారు. ఇప్పుడు కారు మాత్రమే తగలబెట్టాం.. త్వరలో వెంకటయ్యను చంపేస్తామంటూ గోడలు, విద్యుత్ స్తంభాలు, శిలాఫలకాలపై పెయింటింగ్‌తో రాశారు. మూడు నెలలు దాటినా ..... అతి సమస్యాత్మక గ్రామాల జాబితాలో ముందు వరుసలో ఉండే సయ్యద్‌పల్లిలో ఈ ఘటనలు జరిగి సరిగ్గా మూడు నెలలు దాటింది. బాధితులు, గ్రామస్తులు అనేక సార్లు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. అనుమానితుల పేర్లను సైతం అందజేశారు. ఎస్ఐ, సీఐ మొదలుకుని డీఐజీ, ఐజీల వరకు వెళ్లి విజ్ఞప్తులు చేశారు. కేసు దర్యాప్తులో పురోగతి కనిపించకపోవటంతో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దర్యాప్తు చేస్తున్నాం సయ్యద్‌పల్లిలో చోటు చేసుకున్న కారు దగ్ధంతో పాట టీఆర్ఎస్ నాయకుడిని చంపుతామని బెదిరించిన ఘటనలో కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఆధారాలు లేకుండా అరెస్టు చేయలేం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటాం. – రవీంద్రారెడ్డి, డీఎస్పీ, పరిగి -
ఎన్నికల భద్రత కట్టుదిట్టం
సాక్షి, ముంబై: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించేందుకు నగర పోలీసు యంత్రాంగం ఇప్పటినుంచి సన్నద్ధమవుతోంది. నేర చరిత్ర ఉన్నవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటికి సంబంధించిన జాబితా రూపొందించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎన్నికల సమయంలో అడ్డంకులు సృష్టించే అసాంఘిక శక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలో ఓ సమావేశం ఏర్పాటుచేసి చర్చించనున్నారు. నగరంలో ఎక్కడెక్కడ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి.., అత్యంత సమస్యాత్మక నియోజక వర్గాలెన్ని ఉన్నాయనే విషయాలు ఆరా తీస్తున్నారు. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో, ఏ పోలింగ్ కేంద్రం వద్ద అల్లర్లు జరిగాయి..? బోగస్ ఓటింగ్ ఎక్కడ జరిగింది..? డబ్బుల పంపిణీ ఎక్కడ జరిగింది...? వంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ ప్రకారం వచ్చే నెలలో మూడు విడతల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అదనపు భద్రత దళాలను సమకూర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానిక పోలీసు స్టేషన్ల అధికారులు తమ పరిధిలో నేర చరిత్రగల వ్యక్తులకు నోటీసులు జారీచేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అల్లర్లు సృష్టించవద్దని, పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని హెచ్చరించారు. నగరంలోని న్యాయమూర్తులు మొదలుకుని రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు తదితర వీఐపీలకు కల్పించిన భద్రతపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, జెడ్, జెడ్ ప్లస్, వై స్థాయి భద్రత నగరంలో అనేకమంది ప్రముఖులకు ఉన్నాయి. వీరికి ఎంతమేర భద్రత అవసరం అనేదానిపై కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని తర్వాతే కేంద్రం నుంచి క్విక్ రెస్పాన్స్ టీ, సీఆర్పీ తదితర అదనపు బలగాలు దిగుమతి చేసుకోవాలా లేక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎస్ఆర్పీ, ఇతర పోలీసు బలగాలనే వినియోగించుకోవాలా అనే దానిపై స్పష్టత వస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.