ఎక్కడ బాబూ సీఎం ‘శాఖ’..!?
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ యూరప్ పర్యటనకు వెళుతూ ఆయన వద్దనున్న శాఖల బాధ్యతలు ఎవరికి అప్పగించారో స్పష్టంగా తెలియరాలేదు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలతో పాటు కాంగ్రెస్ మంత్రుల్లో గందరగోళం నెలకొంది. చవాన్ వద్ద నగరాభివృద్ధి, గృహ నిర్మాణ, న్యాయ శాఖ, సామాన్య పరిపాలన విభాగం తదితర శాఖలున్నాయి.
పర్యటనకు వెళుతూ ఈ శాఖల బాధ్యతలు అధికారికంగా అప్పగించకున్నప్పటికీ ఆయన తిరిగి వచ్చేంతవరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండవచ్చని మంత్రులు భావిస్తున్నారు. యూరప్‌లో జరిగే ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సదస్సులో పాల్గొనేందుకు చవాన్ సోమవారం అర్ధరాత్రి ముంబై నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటన ఐదు రోజులు ఉంటుందని మంత్రాలయ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సదస్సులో ఉద్యోగ, ఆర్థిక పెట్టుబడులపై చర్చలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో తన బాధ్యతలను ఉపముఖ్యమంత్రికి అప్పగిస్తారు. లేదా కనీసం తన వద్దనున్న శాఖలు తమ పార్టీకి చెందిన ఇతర మంత్రులకు అప్పగిస్తారు. కాని పృథ్వీరాజ్ చవాన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కే కాదు కనీసం తమ పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా అప్పగించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా పర్యటన షెడ్యూలు ఖరారు కాగానే తన వద్దనున్న శాఖలు ఎవరికి అప్పగించాలనే దానిపై చర్చలు జరుపుతారు.
తర్వాత బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నారనేది అధికారికంగా ఒక ప్రకటన జారీ చేస్తారు. దీంతో వివిధ పనుల నిమిత్తం మంత్రాలయకు వచ్చే సామాన్య ప్రజలు ప్రకటనలో పొందుపర్చిన విధంగా ఆయా మంత్రుల దగ్గరకు వెళతారు. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ఐదు రోజులపాటు చవాన్ వద్ద ఉన్న శాఖలను ఎవరు చూడాలనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా పనుల నిమిత్తం వచ్చిన ప్రజలను ఎవరి వద్దకు పంపించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కదలికలేని పోలీసుల బదిలీ ఫైల్ ..
ఇదిలాఉండగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ఇంతవరకు పోలీసు అధికారుల బదిలీల అంశం ఊసే ఎత్తడం లేదు. ఆయన యూరప్ పర్యటన ముగించుకుని తిరిగి ముంబైకి ఈ నెలాఖరులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ నెలలో కూడా పోలీసుల బదిలీలు జరిగే సూచనలు కనిపించడం లేదు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఏమైనా బదిలీలు ఉంటే ఫిబ్రవరి 15 తేదీ లోగా ప్రక్రియ పూర్తచేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫత్వా జారీ చేసింది.
దీనిని బట్టి ఆ తర్వాత ఎప్పుడైనా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే సూచనలున్నాయి. లోక్‌సభ ఎన్నికల తంతు పూర్తికాగానే శాసనసభ ఎన్నికలు దగ్గరపడతాయి. మళ్లీ బదిలీల ప్రక్రియ ముందుకు కదిలే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి, వచ్చే నెల 15 లోపే పోలీస్ శాఖలో బదిలీల పర్వాన్ని పూర్తిచేస్తే కొంతవరకు ఊరట లభిస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.