breaking news
posts not fill
-
అంగన్వాడీ.. అంతా ఖాళీ
– ఐసీడీఎస్‌లో భర్తీకాని పోస్టులు – పథకాల అమలులో కొరవడిన పర్యవేక్షణ – క్షేత్రస్థాయిలో అక్రమాలకు తావిస్తున్న వైనం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీల కొరత పట్టిపీడిస్తోంది. అంగన్వాడీల్లో కీలక బాధ్యతలు చూసే హెల్పర్ పోస్టులు 271 ఖాళీగా ఉండడంతో కేంద్రాల్లో చిన్నారుల ఆలనా, పాలనా చూసే వారు కరువ్యయారు. మరోవైపు పర్యవేక్షణ చేసే అధికారులు లేకపోవడం అక్రమాలకు తావిస్తోంది. ఇదే సమయంలో అంగన్ వాడీల్లో అమలు కావాల్సిన పథకాలు పడకేస్తున్నాయి. అనంతపురం టౌన్ : జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, వీటి పరిధిలో 5,126 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 4,286 మెయిన్ సెంటర్లు , 840 మినీ కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరేళ్లలోపు చిన్నారులు 3,02,498 మంది చిన్నారులు, 74 వేల మందికి పైగా గర్భిణులు, బాలింతలు ఉన్నారు. ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు అనుబంధ పౌష్టికాహారం, పిల్లలను పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో పౌష్టికాహారంతో పాటు విద్యపై ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏటా వీటి నిర్వహణకు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం ఆశించినంగా ఉండడం లేదు. జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి 20 పోస్టులు, హెల్పర్లకు సంబంధించి 271, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూపర్‘విజన్’ ఏదీ? ఐసీడీఎస్‌లో పీడీ, ఏపీడీ, సీడీపీఓలు, ఏసీడీపీఓలు, సూపర్వైజర్లు కీలకంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు వీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నా, పరిస్థితిని చక్కదిద్దాలి. కానీ జిల్లాలో మాత్రం సూపర్వైజర్ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఇతర ప్రాజెక్టుల్లోని వారికే ఇన్‌చార్జ్‌లుగా ఇవ్వడంతో వారు సరిగా పర్యవేక్షించలేకపోతున్నారు. కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్న పరిస్థితి. 17 ప్రాజెక్టుల్లోనూ గ్రేడ్–1 సూపర్వైజర్ పోస్టులు 56, గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులు 50 ఖాళీగా ఉన్నాయి. పథకాల అమలులో అక్రమాలు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజు 200 మి.లీ పాలు, ఉడకబెట్టిన ఒక గుడ్డు, రోజు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె, 50 గ్రాముల కూరగాయాలతో కలిపి ఒక పూట భోజనం కేంద్రం వద్దే అందిస్తారు. 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు రోజుకు ఒక గుడ్డు, ఒక నెలలో 16 గుడ్లు ఇంటికి అందిస్తారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు రోజుకు ఒక కోడిగుడ్డు, 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనె, 25 గ్రాముల కూరగాయలతో కూడిన భోజనం పెడతారు. ఇవన్నీ చాలా ప్రాంతాల్లో సక్రమంగా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సిబ్బంది కొరత నేపథ్యంలో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారు పర్యవేక్షించడం లేదు. కొందరు ఇదే అదునుగా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోస్టుల భర్తీ మా చేతుల్లో లేదు : జుబేదాబేగం, ఐసీడీఎస్ పీడీ కొన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీటిని త్వరలోనే భర్తీ చేస్తాం. సూపర్వైజర్ పోస్టులను ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుంది. అది మా చేతుల్లో లేదు. ఇక్కడి ఖాళీల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు : -
ఇంకెన్నడో?
– క్షయ నివారణ సొసైటీలో భర్తీకి నోచుకోని పోస్టులు – ఏడాది క్రితం నోటిఫికేషన్ ఇచ్చినా ఫలితం శూన్యం – అదిగో..ఇదిగో అంటూ ఊరిస్తున్న అధికారులు – ఎడతెగని జాప్యంపై అభ్యర్థుల్లో ఆందోళన వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్ జాబితా సిద్ధం చేసే వరకు అన్ని ప్రక్రియలు ముగిసినా ఎందుకనో జాబితాను మాత్రం విడుదల చేయడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. - అనంతపురం మెడికల్ జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయం పరిధిలో 20 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 20 పోస్టులకు 464 దరఖాస్తులు వచ్చాయి. ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎనిమిది మంది, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పోస్టుకు 45, టీబీ కౌన్సిలర్ పోస్టుకు 42, టీబీ స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టుకు 58 దరఖాస్తులు వచ్చాయి. 11 సీనియర్ టీబీ సూపర్వైజర్ పోస్టులకు 138, రెండు టీబీ హెల్త్ విజిటర్ పోస్టులకు 62, రెండు ల్యాబ్ టెక్నీషియన్లకు 93, ఒక అకౌంటెంట్ పోస్టుకు 18 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేశాక మెరిట్æ జాబితాను డీఎంహెచ్ఓ, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంది. జాబితా విడుదలలో నిర్లక్ష్యం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దరఖాస్తుల్ని పరిశీలించి జనరల్ మెరిట్ లిస్ట్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే విడుదలలో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తున్నారు. దీంతో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు అభ్యర్థులు గ్రీవెన్స్‌కు సైతం వెళ్తున్నారు. మరికొందరు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీటీసీఓ డాక్టర్ సుధీర్‌బాబును కలుస్తున్నారు. అయితే వారి నుంచి సరైన స్పందన మాత్రం రావడం లేదు. జాబితా విడుదలలో జాప్యంపై గతంలోనే జేసీ–2 ఖాజామొహిద్దీన్ సైతం ఆరా తీశారు. వారం రోజుల్లో జాబితా తెస్తామని చెప్పిన అధికారులు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి మూడేళ్ల క్రితం ఇదే శాఖలో విడుదలైన నోటిఫికేషన్ రద్దయింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్షయ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. కనీసం పోస్టులు భర్తీ అయితే కొద్ది మేరకైనా సేవలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచన చేస్తే అటు రోగులకు.. ఇటు నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జాబితా విడుదల మెరిట్ జాబితాను సిద్ధం చేశాం. ఇప్పటికే జేసీ–2 ఖాజామొహిద్దీన్ పరిశీలించారు. కొన్ని సూచనలు చేయగా కరెక్షన్ చేశాం. అంతలోనే ఆయన సెలవులో వెళ్లడం.. ఎన్నికల కోడ్ రావడంతో జాప్యం జరిగింది. రెండు, మూడ్రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ రావెల సుధీర్‌బాబు, జిల్లా క్షయ నివారణ అధికారి, అనంతపురం