కోర్టు కానిస్టేబుళ్లా.. మజాకా..!
కోదాడ : ఒకరి బలహీనతను మరొకరు చట్టబద్ధ ఆదాయంగా మార్చుకుంటున్నారు. చూడడానికి చిన్నదిగా ఉన్నా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో రోజు వేల రూపాయలను ఈ అక్రమార్కులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. తాము చేసిందే తప్పు కాబట్టి బాధితులు కూడా తమకు తెలిసి జరుగుతున్న ఈ దోపిడీపై నోరు విప్పడం లేదు. ఇక వీరు అడిగినంత ఇవ్వక పోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు వద్ద పడిగాపులు కాయాల్సిందే. దీంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చి అక్కడి నుంచి బయటపడుతుంటారు.
ఇక వీరు ఇపుడు మరింత రెచ్చిపోయి కోర్టుకు వచ్చే కేసులను తమకు అనుకూలమైన న్యాయవాదులకు అమ్ముకుంటూ మరింత సొమ్ము చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కోర్టు బయట జరుగుతుండడంతో ఎవ్వరు వీరిపై చర్యలు తీసుకోక పోవడంతో సంవత్సరాల తరబడి అదే పోస్టులో కదలకుండా పనిచేస్తున్నారు. హెడ్‌కానిస్టేబుల్ స్థాయి ఉన్న వారికే ఈ కోర్టు కానిస్టేబుల్ పనులు అప్పగించాలని గత ఎస్పీ చెప్పినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. దీంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
పిటీ కేసులే పెట్టుబడి...
చిన్న నేరాలు చేసి పోలీసులకి చిక్కిన వారిపై పోలీసులు పిటీ కేసు పెట్టి కోర్టులో హాజరుపరుస్తారు. నిందితులందరినీ కోర్టు కానిస్టేబుల్ ద్వారా కోర్టుకి పంపుతారు. న్యాయమూర్తి వీరికి వంద నుంచి రెండు వందల వరకు జరిమానా వేస్తారు. వీరందరి చేత కానిస్టేబుల్ కోర్టు దగ్గరుండిజరిమానాను అక్కడే కట్టిస్తారు. ఖర్చుల పేరుతో ఇక్కడే తమకు వేసే జరిమానాకు రెట్టింపు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆటోడ్రైవర్లు, పేకాట ఆడుతూ, మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు దొరికినవారే వీరికి ఆదాయ వ నరుగా మారిపోయారు. ఇలా జి ల్లా వ్యాప్తంగా ప్రతిస్టేషన్ నుంచి రోజుకు కోర్టుకు వచ్చే 10 నుంచి 20 కేసుల్లో వీరు రూ.6వేల వరకు వసూలు చేసుకుంటున్నారు. ఆదాయ వనరుగా మారిన ఈ కొలువులో చేరిన వారు సంవత్సరాల తరబడి అదే పోస్టులో కొనసాగుతున్నారు. స్టేషన్ మారిన పోస్టును మాత్రం వదులుకోవడం లేదని తోటి కానిస్టేబుళ్లే అంటున్నారు.
రాటుదేలారు..
నిందితులకు వేసే కోర్టు జరిమానాతో సరిపుచ్చుకోకుండా ఈ కానిస్టేబుళ్లు కొం దరు కేసులు అమ్ముకునే వ్యాపారం మొ దలు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా యాక్సిడెంట్లు అయినప్పుడు ప్రమాదం చేసిన వారు బయటి ప్రాంతాలకు చెందిన వారై ఉంటారు. వారికి స్థానిక కోర్టుల్లో న్యాయవాదులు గురించి అంతగా తెలియదు. దీంతో వీరు మధ్యవర్తుల అవతారం ఎత్తుతున్నారు.
పలాన న్యాయవాది అయితే నీకు తోందరగా బెయిల్ వస్తుందని, కేసు గెలుస్తారని చెప్పి తమకు అనుకూలమైన వారికి కేసులను అప్పగిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా వారి నుంచి భారీగా కమీషన్లు దండుకుంటున్నట్లు సమాచారం. ఇంకా కొన్ని కేసుల్లో జూనియర్ న్యాయవాదులకు కేసులు అప్పగించి బాధితుల వద్ద భారీగా వసూలు చేసి జూనియర్ న్యావాదులకు కొద్దోగొప్పో ఇచ్చి మిగతాది వీరు జేబులో వేసుకుంటున్నారని కొందరు సీనియర్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
అసలు ఎవరీ కోర్టు కానిస్టేబుళ్లు
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక కోర్టు కానిస్టేబుల్ ఉంటారు. ప్రతిస్టేషన్లో ఒక కానిస్టేబుల్‌కు కోర్టు పనులను మాత్రమే అప్పగిస్తారు. అందుకే అతన్ని కోర్టు కానిస్టేబుల్ అని పిలుస్తారు. స్టేషన్లో నమోదయ్యే కేసులకు సంబంధించిన వివరాలను కోర్టులో అప్పగించడం, వాయిదాలకు హాజరుకావడం, చార్జీషీట్లను అప్పగించడం, పిటీ కేసుల్లో నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం, జరిమానాలను కట్టించడం వీరి విధి.
పై ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఈ పోస్టు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. స్టేషన్ అధికారికి ఇష్టమైన వారు ఈ పోస్టులో సాధారణంగా కొనసాగుతారు. కొత్తవారు రాకుండా పాత వారు అడ్డుకుంటారు. కోర్టు వ్యవహారాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పాతవారినే కొనసాగించడంతో అవినీతి పెరిగి పోతుందని తరచూ వీరిని మార్చి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే ఈ దందాకు తెరపడుతుందని పలువురు న్యాయవాదులు, తోటి కానిస్టేబుళ్లే అంటున్నారు.
ఆస్తులు విడిపిస్తామని రూ.లక్షల్లో వసూలు
ఇటీవల కొందరు వ్యక్తులు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోదాడ ప్రాంతంలో పలువురి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. తరువాత నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారి ఆస్తులను పోలీసులు అటాచ్ చేశారు. బీనామీ పేర్లతో ఉన్న ఆస్తులను తాను విడుదల చేయిస్తానని కోదాడ సర్కిల్ పరిధిలో ఉన్న ఓ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ ఈ కేసులో ప్రధాన నిందితుడి వద్దకు వెళ్లి రూ.లక్షన్నర వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయం బయట పడడంతో సదరు కోర్టు కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లినట్లు సమాచారం.