మృత్యు గని
- గుంటూరు జిల్లా ఫిరంగిపురం క్వారీలో ఘోర ప్రమాదం
- కొండరాళ్లు జారిపడి ఆరుగురు కూలీలు సజీవ సమాధి
సాక్షి, గుంటూరు: రెక్కాడితేగాని డొక్కాడని ఆరుగురు నిరుపేద కూలీలను కొండరాళ్లు చిదిమేశాయి. క్వారీలో పనిచేస్తున్న ఆరుగురు రాళ్ల కింద సజీవ సమాధి అయ్యారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో శనివారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురంలో కార్మెల్ మాత కొండ దిగువన రెండెకరాల క్వారీలో రాళ్లు తవ్వుకునేందుకు గడ్డం రాంబాబు అనే వ్యక్తి మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు పొందాడు. క్వారీలో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. అప్పటికే కొండ పై భాగంలో మైనింగ్ చేయడంతో బండరాళ్లు విడివిడిగా ఉన్నాయి. వాటిని తొలగించకుండానే శనివారం ఉదయం క్వారీలో బ్లాస్టింగ్ చేసేందుకు 8 మంది కూలీలను పంపారు. వీరంతా కొండ మధ్యభాగంలో తాళ్ల సాయంతో వేలాడుతూ జిలెటిన్ స్టిక్స్ అమర్చేందుకు రంధ్రాలు చేస్తున్నారు.
ఈ సమయంలో కొండ పైనున్న బండరాళ్లు వారిపై పడ్డాయి. ఆరుగురు కూలీలు రాళ్ల కింద నలిగి మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన మండెం సాయిరాం అనే కూలీ గుంటూరు జీజీహెచ్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ప్రమాదం నుంచి దుర్గం చిన్నరాజులు అనే కూలీ క్షేమంగా బయటపడ్డాడు. మృతుల్లో ఫిరంగిపురానికి చెందిన తెనాలి చిన్నబాలశౌరి, బోరుగడ్డ నాగరాజు, పెరికల రాయప్ప, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీప దొనబండకు చెందిన దుర్గం ఆంజనేయులు, శాంతుల వీరయ్య, పెరుమాళ్ శరవణ ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, దహన సంస్కారాలకు మరో రూ.5 వేలు ప్రకటించారు.
విచారణకు ఆదేశం : క్వారీ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.
గని ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం క్వారీలో బండరాళ్లు జారిపడి ఆరుగురు కూలీలు మృతి చెందడం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించి, ఆదుకోవాలని కోరారు.