breaking news
Permanent Judicial Museum
-
అదనపు జడ్జీల పనితీరు మదింపునకు ఓకే
న్యూఢిల్లీ: అదనపు న్యాయమూర్తులను హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా నియమించేందుకు పనితీరు మదింపును చేపడతామని సుప్రీం కోర్టు కొలీజియం తెలిపింది. ఈ మేరకు గురువారం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హైకోర్టుల్లో అదనపు జడ్జీలు ఇచ్చిన తీర్పుల్ని ఆయా కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల కమిటీకి నివేదిస్తారని పేర్కొంది. ఈ కమిటీని సీజేఐ జస్టిస్ ఖేహర్ ఏర్పాటు చేస్తారంది. ఈ వివరాలను సుప్రీం తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ఇప్పటివరకు హైకోర్టుల్లో అదనపు జడ్జీల పనితీరును అంచనా వేసేందుకు ‘తీర్పుల మదింపు కమిటీలు’ ఉండేవి. వీటిని రద్దు చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ ఖేహర్ మార్చిలో ప్రకటించగా.. ఈ విషయమై పునరాలోచించాల్సిందిగా సుప్రీంను కేంద్రం కోరింది. దీంతో అత్యున్నత ధర్మాసనం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి నేపథ్యం లేని సామాన్యులైన తొలి తరం లాయర్లు కూడా సుప్రీం కోర్టు జడ్జీలుగా ఎంపికయ్యారని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. సుప్రీంలో జడ్జీల ఎంపికలో వివక్ష పాటిస్తున్నారంటూ సీనియర్ న్యాయవాది ఆర్పీ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యుయు లలిత్ల బెంచ్ తిరస్కరించింది. సుప్రీంలో కేవలం రెండే ఖాళీలు ఉన్నప్పుడు వంద మంది వ్యక్తుల నుంచి అత్యంత అర్హులైన ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఇలాంటి సమయంలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చని వెల్లడించింది. -
బొంబాయి హైకోర్టు ప్రాంగణంలో గాంధీ, జిన్నాల సర్టిఫికెట్లున్న మ్యూజియం
ముంబై: బొంబాయి హైకోర్టు ప్రాంగణంలో ‘పర్మనెంట్ జ్యుడీషియల్ మ్యూజియం’ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ మ్యూజియంలో జాతిపిత మహాత్మా గాంధీ, మొహమ్మద్ అలీ జిన్నాల బారిస్టర్ సర్టిఫికెట్లను ప్రదర్శనకు ఉంచారు. కోర్టు 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్షా పాల్గొన్నారు. మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఇక్కడి న్యాయమూర్తులు, న్యాయ కోవిధులతో భేటీ అయ్యారు. దక్షిణ ముంబైలోని చరిత్రాత్మక హైకోర్టు భవనం కింది అంతస్తులో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. నూట యాభై ఏళ్ల కోర్టు చరిత్రతో సంబంధం ఉన్న అనేక పురాతన వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్కాదర్ వల్లభ్ భాయ్ పటేల్, కేఎం మున్షీ, భారత ప్రథమ ప్రధాన న్యాయమూర్తి ఎంసీ ఛాఘ్లాల బారిస్టర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. పురాతన కాలం నాటి కొవ్వొత్తుల స్టాండ్లు, సిరా బుడ్డీలు, పేపర్ వెయిట్లు, బ్రిటీషు కాలంలో న్యాయమూర్తులు ధరించే విగ్గు తదితర కోర్టు సంబంధమైన పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. ఈప్రాంగణంలో మొదటి కోర్టు 1726 నుంచి 1798 మధ్య కాలంలో మేయర్ కోర్టుగా పని చేసింది. ఆ తరువాత అది రికార్డర్స్ కోర్టుగా 1824 వరకు కొనసాగింది. అనంతరం అది 1824 నుంచి 1862 వరకు బొంబాయి సుప్రీం కోర్టుగా పని చేసింది. 1862లో బొంబాయి హైకోర్టు ఆవిర్బవించింది.