breaking news
paster killed
-
పాస్టరమ్మను హతమార్చిన టీడీపీ కార్యకర్తలు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): చర్చి ముందు మద్యం సేవించవద్దని చెప్పిన ఓ పాస్టరమ్మపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చారు. బందరు మండలం బొర్రపోతుపాలెంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామానికి చెందిన శెట్టి విజయ్కర్, ధనలక్ష్మీ అలియాస్ సుజిని(46) కుటుంబ సభ్యులు అదే గ్రామంలో చర్చి నిర్వహిస్తూ ఉంటారు. ఆదివారం ‘ఈస్టర్ పండుగ పర్వదినం’ కావడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా ఇంటికి రావడంతో ఉదయం, మధ్యాహ్నమంతా దేవుని మందిరంలో సంతోషంగా గడిపారు. ఇంటి నిండా చుట్టాలు ఉండడంతో తాము నిద్రపోయేందుకు స్థలం సరిపోదని భావించిన ఆ దంపతులిద్దరూ తమ మనవళ్లు, మనవరాళ్లను తీసుకుని వారు నిర్వహిస్తున్న చర్చి వద్దకు వెళ్లారు. అదే సమయంలో మట్టా మోషే, మట్టా తిమ్మరాజు అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు చర్చి ఎదుట ఉన్న బల్ల మీద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీంతో ఆమె వారిని వారించింది. వారు ఒక్కసారిగా ఆమెపై తిట్లపురాణం మొదలుపెట్టి గొడవకు దిగారు. ఇంతలో ఆ పక్కనే ఉన్న మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మట్టా లక్ష్మయ్య, మట్టా చింతయ్య వారికి వత్తాసు పలుకుతూ వచ్చి విచక్షణారహితంగా పాస్టరమ్మపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. బందరు ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న బందరు రూరల్ సీఐ కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాస్టర్ హత్య: భూ వివాదామే కారణం..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో జరిగిన పాస్టర్ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును మాదాపూర్ పోలీసులు చేధించారు. అనంతపురంలో చర్చి నిర్వహిస్తున్న పాస్టర్ సత్యనారాయణ ఈ నెల 22న కొండాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు భూ వివాదమే కారణమైనట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మీడియా సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం...పాస్టర్ సత్యనారాయణకు మియాపూర్ హఫీజ్ పెట్ లో 300 గజాల స్థలం ఉంది. దీనిని హఫీజ్‌పేటకు చెందిన జమిల్ కబ్జా చేయడానికి ప్రయత్నించగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో జమిల్‌పై మూడు నెలల క్రితం సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై జమిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సత్యనారాయణరెడ్డిపై కక్ష పెంచుకున్న జమిల్ తన స్నేహితులతో కలిసి సత్యనారాయణను శుక్రవారం (నవంబర్ 22) హతమార్చాడు. కాగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. -
మన్యంలో కలకలం
ఇన్ఫార్మర్ నెపంతో పాస్టర్ హత్య చింతూరు: అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్న మావోయిస్టులు రెండోరోజే ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని హతమార్చి మన్యంలో కలకలం సృష్టించారు. చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ వుయికా మారయ్య(35)ను మావోయిస్టులు శుక్రవారం అర్థరాత్రి గొంతుకోసి హతమార్చారు. దాంతో మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగస్టు 3 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాల్లో మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో అని అందరిలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారు ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నందునే తాము హత్యలకు పాల్పడుతున్నట్టు మావోయిస్టులు పేర్కొంటున్నారు. గతేడాది ఏప్రిల్ 25వ తేదీన చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని అల్లివాగు గ్రామానికి చెందిన వలస గిరిజనుడు పొడియం నడుగును మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చారు. అదే నెలలో ఎటపాక మండలం కామన్‌తోగు గ్రామానికి చెందిన మడివి జోగయ్య, సోయం చుక్కయ్యలను హతమార్చారు. మే 4వ తేదీన చింతూరు మండలం బుర్కనకోగ గ్రామానికి చెందిన కుంజా బ్రహ్మయ్య, కుంజా సీతారామయ్య అనే అన్నదమ్ములను మావోయిస్టులు హతమార్చారు. 2014లో చింతూరు మండలం దొంగల జగ్గారం, నర్శింగపేట, అల్లిగూడెం, తుమ్మల గ్రామాలకు చెందిన పలువురిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చారు. అలాగే గతేడాది చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన సుమారు 50 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత క్షేమంగా విడిచిపెట్టారు. ఇదే క్రమంలో గతేడాది ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ కన్నయ్య కొడుకు ఇసాక్‌తో పాటు కొంతమంది పాస్టర్లను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మారయ్య లక్ష్మీపురం చర్చి పాస్టర్ కన్నయ్య సోదరుడే. రంగంలోకి ఖమ్మం జిల్లా కమిటీ? విలీన మండలాల్లో గతేడాది వరకు మావోయిస్టు శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా పనిచేసేది. గతేడాది డిసెంబర్లో కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కమిటీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఈ కమిటీకి కొత్త కార్యదర్శిని నియమించారని పలుపేర్లు వినబడినప్పటికీ పోలీసులు దానిని ధృవీకరించలేదు. ఇటీవల వరుసగా మందుపాతర్ల సంఘటనలు, ప్రస్తుతం మారయ్య హత్య నేపధ్యంలో విలీన మండలాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఖమ్మం జిల్లా కమిటీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సంఘటన స్థలంలో లభ్యమైన లేఖలో ఇదే కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరు వుండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. పద్ధతి మారకుంటే ఇదేగతి చింతూరు మండలంలోని పేగ, అల్లిగూడెం గ్రామాలకు చెందిన చాలామంది పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని మారయ్య మృతదేహం వద్ద మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి పేరుతో ఉంచిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. వారు తమ పద్ధతిని మార్చుకోకుంటే ఇదేగతి పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. పేగ గ్రామానికి చెందిన 17 మంది, అల్లిగూడెం గ్రామానికి చెందిన 14 మంది, వినాయకపురం గ్రామానికి చెందిన ఐదుగురి పేర్లను ఆ లేఖలో పేర్కొన్నారు. లక్ష్మీపురం చర్చి పాస్టర్ కన్నయ్య అక్రమ పద్ధతుల్లో ఆస్తులు కూడగట్టాడని, అతనిని పలుమార్లు హెచ్చరించినా వినకుండా తమనుంచి తప్పించుకు తిరుగుతున్నాడని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. అతని బాటలోనే అతని సోదరుడు మారయ్య కూడా నడుస్తుండడంతో అతనిని కూడా హెచ్చరించామన్నారు. అయినప్పటికీ అతని తీరు మారక పోవడంతో ప్రజాకోర్టులో శిక్షించినట్టు లేఖలో పేర్కొన్నారు.