భారత్లోనే అతి పురాతన చర్చి
పరంపర
మన దేశంలో అతి పురాతనమైన చర్చి కేరళలోని త్రిసూర్ జిల్లా పాలయూర్లో ఉంది. సాక్షాత్తు క్రీస్తు పన్నెండు మంది ప్రత్యక్ష శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ ఇక్కడ ఈ చర్చిని కట్టించాడు. ఇది సెయింట్ థామస్ సైరో మలబార్ కేథలిక్ చర్చిగా ప్రసిద్ధి పొందింది. సెయింట్ థామస్ మన దేశంలో మరో ఆరు చర్చిలు కూడా నిర్మించాడు. క్రీస్తు మరణం తర్వాత కొన్నేళ్లకు సెయింట్ థామస్ సముద్రమార్గంలో కేరళ తీరానికి చేరుకున్నాడు. అప్పటికే కేరళలో ఉంటున్న యూదు వర్తకులను కలుసుకుని, క్రీస్తు సందేశాన్ని వినిపించాడు. క్రీస్తుశకం 52 సంవత్సరంలో పాలయూర్లో తొలి చర్చిని నిర్మించాడు
నిజానికి పాలయూర్లో అప్పటికి ఒక హిందూ ఆలయం ఉండేది. అక్కడి బ్రాహ్మణులు ఆలయం ఆలనా పాలనా వదిలేసి వలస వెళ్లిపోవడంతో, ఆ ఆలయానికే కొద్దిపాటి మార్పులు చేసి, ఈ చర్చిని నిర్మించారు. అందుకే దీని ప్రవేశద్వారం హిందూ దేవాలయాల మాదిరిగానే ఉంటుంది. ఈ చర్చి నిర్మాణంలో హిందూ, పర్షియన్ వాస్తురీతులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తొలుత ఈ చర్చి చిన్నగానే ఉండేది. పదిహేడో శతాబ్దిలో ఇక్కడకు వచ్చిన ఇటాలియన్ మతబోధకుడు ఒకరు స్థానికులను ఒప్పించి, టేకు కలపతో దీని నిర్మాణాన్ని విస్తరించాడు. టిప్పు సుల్తాన్ సేనలు కేరళపై దండెత్తినప్పుడు 18వ శతాబ్దిలో ఈ చర్చి ధ్వంసమైంది. తర్వాత కొన్నాళ్లకే దీనిని పునర్నిర్మించారు.