వైద్యం కోసం వెళ్తే.. నాపై ప్రయోగాలు: నిర్మాత
వైద్యం చేయించుకోడానికి వెళ్లిన తనపై ఔషధ ప్రయోగాలు చేశారంటూ సినీ నిర్మాత ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 'హార్మోన్స్' అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఎన్ఎస్ నాయక్ ఇటీవల వైద్యం కోసం జూబ్లీహిల్స్‌లోని మంథన్ డయాబెటిస్ సెంటర్‌కు వెళ్లారు.
అక్కడ వైద్యులు, సిబ్బంది ఔషధ ప్రయోగాలలో భాగంగా ఆయనపై ఓ ఇన్సులిన్ మందును ప్రయోగించారు. దాంతో తాను కోమాలోకి వెళ్లానని, వేరే ఆస్పత్రిలో చేరగా ఒకరోజు తర్వాత కోలుకున్నట్టు పేర్కొన్నారు. దీంతో నిర్మాత తొలుత ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ పోలీస్ కమిషనర్‌కు రిఫర్ చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి వాంగ్మూలం నమోదు చేశారు.