breaking news
NRHM Ayush employees
-
అన్‌టైడ్‌లో కోత
భువనగిరి : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) ద్వారా పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు కేటాయిస్తున్న అన్‌టైడ్(తిరిగి చెల్లించని) నిధుల్లో కోతపడింది. ఈ నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలు సమర్పించడంలో వైద్యసిబ్బంది అలసత్వం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం కోత విధించింది. దీంతో వైద్యసేవలకు విఘాతం కలగనుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్సెంటర్లలో.. జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 565 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటిలో వసతుల కల్పన, అత్యవసర మందుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం ఎన్ఆర్హెచ్ఎం ద్వారా 2005 నుంచి అన్‌టైడ్ నిధులు (ఆస్పత్రిస్థాయిని బట్టి) విడుదల చేస్తోంది. ఈ నిధులతో ఆయా పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో సౌకర్యాలు కల్పించడమే గాక అత్యవసర మందులు కొనుగోలు చేసి మెరుగైన వైద్యసేవలు అందించేవారు. అలాగే సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శానిటేషన్ పనులు నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యం కాపాడేందుకు వైద్యశాఖ చర్యలు తీసుకునేది. ఎస్ఓఈ సమర్పించకపోవడంతో.. ఏటా విడుదలయ్యే అన్‌టైడ్ నిధులు, చేసిన ఖర్చుల వివరాలు పీహెచ్సీ, సబ్‌సెంటర్లు ఎన్ఆర్హెచ్ఎంకు సమర్చించాలి. కానీ జిల్లాలో ఉన్న 50శాతం పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్ఓఈ (విడుదలైన నిధులు, ఖర్చులు వివరాలు)సమర్పించలేదు. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధుల్లో కేంద్రప్రభుత్వం కోత విధించినట్టు అధికారులు తెలిపారు. ఇక ఈ నిధులు సరిపోక పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో సరైన వైద్యసేవలు అందే అవకాశం లేదు. అలాగే గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జిల్లా అధికారులు సకాలంలో స్పందించకపోతే ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నిధుల దుర్వినియోగమే కారణమా? పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు ఎన్ఆర్ హెచ్ఎం ద్వారా వస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా తప్పుడు నివేదికలను రూపొందించడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు రావడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. నిధుల వినియోగంలో సరైన నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. -
‘ఆయుష్’ తీరనుందా..?
- ఉద్యోగుల తొలగింపునకు ప్రయత్నాలు - కలెక్టర్ తొలగించమన్నారంటూ ఆయుష్ ఆర్డీడీకి ఇన్చార్జి డీఎంహెచ్‌వో లేఖ - ఆందోళనలో 81 మంది ఉద్యోగులు భీమవరం క్రైం : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆయుర్వేద, హోమియో, యునాని, ప్రకృతి వైద్య సేవలందించే ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 44 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న 81 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుష్ శాఖలో 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 5 గురు మాత్రమే ఉండటంతో సిబ్బంది ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేదనే ఉద్దేశ్యంతో వారిని తొలగించేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. జులై 1వ తేదీ నుంచి ఉద్యోగులను తొలగించాలని జిల్లా కలెక్టర్ తనకు లేఖ రాశారని ఇన్చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ కె.శంకరరావు ఆయుష్ శాఖ రీజినల్ డెప్యూటీ డెరైక్టర్(ఆర్డీడీ)కి లేఖ రాశారు. ఈ విషయం తెలిసిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. 2008 నుంచి తాము సేవలందిస్తున్నామని, ప్రస్తుతం ఏ జిల్లాలోనూ లేనివిధంగా తమను తొలగించాలను కోవడం దారుణమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను భర్తీచేసి ఆయుష్‌ను బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంపీ సీతారామలక్ష్మికి వినతి పత్రం ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమను ఇప్పుడు తొలగించడం దారుణమని, తమను కొనసాగిం చేలా చూడాలని ఆయుష్ ఉద్యోగులు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు జీఎన్బీ ప్రసాద్(పాలకోడేరు), సుజన(లంకలకోడేరు), కాంపౌండర్లు బి.రమేష్ వర్మ(పాలకోడేరు), ఎన్.ఆంజనేయులు(మంచిలి), సత్యనారాయణ(లంకలకోడేరు), స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ వి.హైమావతి(మంచిలి), చంద్రశేఖర్ ఉన్నారు. ఆయుష్ కమిషనర్ నుంచి ఆదేశాలు వస్తేనే తొలగిస్తాం ఆయుష్ ఉద్యోగులను తొలగించమని ఇన్చార్జి డీఎంహెచ్‌వో నుంచి లేఖ రావడం వాస్తవమేనని ఆయుష్ ఆర్డీడీ వి.వీరభద్రరావు వివరణ ఇచ్చారు. అయితే ఆయుష్ కమిషనర్ గాని, ఎన్ఆర్హెచ్ఎం డెరైక్టర్ గాని ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ శాఖలో 44 డిస్పెన్సరీలకు గానూ 5గురు మాత్రమే వైద్యులు ఉన్నారని, 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగినందున త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఆయుష్ ఉద్యోగుల తొలగింపు విషయమై ఇన్చార్జి డీఎంహెచ్‌వోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది.