breaking news
Notified area committees
-
నిరాశ్రయులపై నిర్లక్ష్యమొద్దు
న్యూఢిల్లీ: ఇళ్లులేని పట్టణ నిరుపేదల పట్ల నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు కేంద్రానికి చురకలంటించింది. శీతాకాలం రాబోతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరికీ ఇళ్లు కనీస అవసరమని పేర్కొంది. పట్టణ నిరాశ్రయుల బాగోగులు చూసే పౌర కమిటీల సభ్యుల పేర్లను ఇంకా ప్రకటించని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై రూ.1–5 లక్షల మధ్య జరిమానా విధించింది. నిరుపేదలకు వసతి కల్పనపై కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ దాఖలుచేసిన పత్రాల్లోని వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 22నే తాము ఆదేశాలు జారీచేసినా ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పౌర కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో విఫలమైన హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, గోవా, మిజోరం, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, చండీగఢ్లపై రూ.1 లక్ష చొప్పున, హరియాణాపై రూ.5 లక్షల జరిమానా విధించింది. వరదలతో దెబ్బతిన్న కేరళ, ఉత్తరాఖండ్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. మూడు వారాల్లోగా జరిమానాను సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్ద జమచేయాలని సూచించింది. ‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాలు అవసరమైన చర్యలు తీసుకునేంత వరకు జరిమానా విధించడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. శీతాకాలం రాబోతోంది. ఈ పరిస్థితుల్లో ఇళ్లు లేని నిరుపేదలను అలా వదిలేయకూడదు. గృహకల్పనపై కేంద్రం భారీ ప్రణాళికలు రూపొందించుకున్నా, అవి సరిగా అమలుకావడం లేదు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. పౌర కమిటీల సభ్యుల పేర్లను ప్రకటిస్తూ రెండు వారాల్లోగా నోటిఫికేషన్ జారీ చేయాలని జరిమానా విధించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. విపత్తు నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి విపత్తు నిర్వహణకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అధిక ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెబ్సైట్లో కేవలం 9 రాష్ట్రాలే తమ ప్రాంతీయ భాషల్లో ప్రణాళికలు, నివేదికలను పొందుపరిచాయని పేర్కొంది. ‘ కేరళలోని భారీ వరదలను ఎలా మరచిపోగలం. కానీ కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నాయి. విపత్తు ప్రణాళికల్ని అనువదించేందుకు ఇంత సమ యం ఎందుకు తీసుకుంటున్నాయి?’ అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మూడు నెలల్లో అన్ని రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రణాళికల్ని అందుబాటులోకి తెస్తాయని నాదకర్ణి బదులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై స్టే ఇవ్వలేం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ పార్లమెంట్ చేసిన సవరణలపై స్టే విధించలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ సవరణలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆరువారాల్లోగా బదులివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. పార్లమెంట్ తన అధికార పరిధిని దాటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(వేధింపుల నిరోధక) చట్టంలో సవరణలు చేసిందని, వాటిని రద్దుచేయాలని పిటిషన్‌దారులు కోరారు. నిందితుల అరెస్ట్‌కు సంబంధించి కొన్ని రక్షణలు చేరుస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసింది. కోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ పాత నిబంధనలు పునరుద్ధరించే బిల్లును ఆగస్టు 9న పార్లమెంట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ చేసిన సవరణలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణకు చేపట్టింది. పిటిషన్ల తదుపరి విచారణ జరిగే వరకైనా, పార్లమెంట్ పునరుద్ధరించిన నిబంధనలపై స్టే విధించాలన్న పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది పృథ్విరాజ్ చౌహాన్ విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. ‘ స్టే ఎందుకు? పార్లమెంట్ ఆమోదం తెలపడం వల్ల ఇప్పుడవి చట్టబద్ధమయ్యాయి. లోపాలు సరిదిద్దకుండా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసిందన్న సంగతి మాకూ తెలుసు’ అని ధర్మాసనం తెలిపింది. ‘మూకహింస’ ఆదేశాలు పాటిస్తోంది 11 రాష్ట్రాలే మూక హింస, గోరక్షణ పేరిట జరుగుతున్న దాడుల కట్టడికి తాము జారీచేసిన ఆదేశాలకు కట్టుబడి ఉంటున్నామని కేవలం 11 రాష్ట్రాలే నివేదికలు సమర్పించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలిచ్చేందుకు వారం రోజుల గడువిచ్చింది. ఇందులోనూ విఫలమైతే సంబంధిత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. జూలై 20న రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ పాడిరైతును కొందరు కొట్టి చంపిన ఉదంతంలో అధికారులు కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. వారంలోగా నివేదిక సమర్పించాలనిరాజస్తాన్ను ఆదేశించింది. -
అక్కడ రాజ్యాంగమే మారిపోయింది
నోటిఫైడ్ ఏరియా కమిటీలు 74వ రాజ్యాంగ సవరణతోనే రద్దు అయినా రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం నోటిఫైడ్ ఏరియాగా గుర్తింపు పంచాయతీ.. మునిసిపాలిటీల్లో లేని ‘జీఎంఆర్’ ‘ఐలా’లోనూ లేదు.. పన్నులు ఎవరికీ చెల్లించకుండా సొంత కమిటీ ఒప్పందం ప్రకారం రోడ్లు వేయాల్సిన జీఎంఆర్.. తాజాగా నోటిఫైడ్ ఏరియా కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించడం గమనార్హం సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రాజ్యాంగమే మారిపోయింది. 74వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 243 (క్యూ)తో నోటిఫైడ్ ఏరియా కమిటీలు రద్దయ్యాయి. పరిశ్రమలు, పోర్టులు, విమానాశ్రయాలు ఏవైనా సరే.. అవి పంచాయతీ లేదా మునిసిపాలిటీ పరిధిలోకి రావాల్సిందే. లేదంటే స్థానిక పారిశ్రామిక ప్రాంత సంస్థ(ఐలా)లా ఉండాలి. కానీ, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇందుకు భిన్నంగా నోటిఫైడ్ ఏరియాగా గుర్తించారు. దీని వల్ల స్థానిక సంస్థలకు ఈ విమానాశ్రయంపై ఎలాంటి అధికారాలు ఉండవు. విమానాశ్రయ సంస్థదే ఇష్టారాజ్యం. నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు తదితర అంశాలు స్థానిక సంస్థల పరిధిలోకి రావు. రాజీవ్‌గాంధీ విమానాశ్రయ యాజమాన్యం నోటిఫైడ్ ఏరియాగా 1965 రాష్ట్ర మున్సిపల్ చట్టం 389 (ఏ) కింద ఉత్తర్వులు తెచ్చుకుంది. వాస్తవానికి 74వ రాజ్యాంగ సవరణ తర్వాత అందుకు అనుగుణంగా రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని ఏడాదిలోగా సవరించుకోవాలి. సవరించుకోని పక్షంలో రాష్ట్ర చట్టంలోని నిబంధనలు ఆటోమేటిక్‌గా తొలగుతాయి. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం నోటిఫైడ్ ఏరియాగా గుర్తించడానికి వీల్లేదని పురపాలక శాఖ అధికారి ప్రభుత్వానికి స్పష్టం చేసిన తర్వాత కూడా ఈ విమానాశ్రయానికి మరో మూడేళ్ల పాటు నోటిఫైడ్ ఏరియా కమిటీగా గుర్తింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చేలా పురపాలక శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 74వ రాజ్యాంగ సవ రణతో నోటిఫైడ్ ఏరియా కమిటీలుగా ఉన్న రామగుండం, మందమర్రి, పాల్వంచలను మునిసిపాలిటీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్తగా నోటిఫైడ్ ఏరియా కమిటీలను ఏర్పాటు చేయలేదు. కానీ జీఎంఆర్‌ను మాత్రం నోటిఫైడ్ ఏరియా కమిటీగా గుర్తించారు. అంతర్జాతీయ విమానాశ్రయం స్థానిక సంస్థ పరిధిలో ఉంటే ఆరేడు కోట్ల రూపాయలు మేరకు ఆస్తి పన్ను చెల్లించాల్సి వచ్చేదని ఓ అధికారి చెప్పారు. జీఎంఆర్ సంస్థ విమానాశ్రయంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా.. సొంత నిధుల నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య ఒక రహదారి కోసం రూ. పది కోట్లు నోటిఫైడ్ ఏరియా కమిటీ ఫండ్ నుంచి వినియోగించడంపై కమిటీలోని ప్రభుత్వ అధికారి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఆ నిధులను జీఎంఆర్ తిరిగి కమిటీకి జమ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో సరైన మౌలిక వసతులు కల్పించడం లేదన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను ఏర్పాటు చేసింది. ఆ విధంగా రాష్ట్రంలో దాదాపు 76 ఐలాలు ఉన్నాయి. ఈ ఐలాల్లో వసూలవుతున్న పన్నుల్లో 35% స్థానిక సంస్థకు (మునిసిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి) చెల్లిస్తూ.. మిగిలిన 65% నిధులను ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం వినియోగించుకుంటున్నాయి. జీఎంఆర్ విమానాశ్రయం నోటిఫైడ్ ఏరియాగా ఉండడంతో.. ఆ 35% నిధులు ఏ సంస్థకూ చెల్లించడం లేదు. నోటిఫైడ్ ఏరియా కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులు నలుగురు ఉన్నా.. ఒకరిద్దరు కూడా సమావేశాలకు వెళ్లడం లేదు. సమావేశం మినిట్స్ వస్తే.. వాటిపై సంతకాలు చేసి పంపిస్తున్నట్లు సమాచారం.