breaking news
ng ranga agriculture university
-
వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి ఇచ్చింది. దేశంలోనే తొలిసారి వర్సిటీకి లైసెన్సు జారీచేస్తూ డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జితేందర్ లౌరా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రమైన సెంటర్ ఫర్ అప్సర ద్వారా సంప్రదాయ, వ్యవసాయ డ్రోన్లపై రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజుల శిక్షణ ఇచ్చేందుకు 2032 వరకు అనుమతి లభించింది. దేశంలో సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు రంగంలో 34 డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాలకు డీజీసీఏ అనుమతి ఉంది. ఈ కేంద్రాల్లో ఐదుకిలోల బరువున్న సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల పాటు కన్వెన్షనల్ రిమోట్ పైలెట్ కోర్సు (సీఆర్పీసీ) కింద శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే డ్రోన్లు 25 కిలోలకుపైగా బరువుంటాయి. వీటిపై శిక్షణ పొందాలంటే ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఉండాలి. కనీసం 12 రోజులు పడుతుంది. డీజీసీఐ మార్గదర్శకాలకనుగుణంగా గుంటూరు లాంలో సెంటర్ ఫర్ అప్సర పేరిట ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 2020లో వ్యవసాయ డ్రోన్ల పరిశోధన సంస్థకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం దేశంలోనే తొలిసారి 12 రోజుల శిక్షణకు ప్రత్యేకంగా పాఠ్యప్రణాళికను సైతం రూపొందించింది. 10 ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, చెరకు, మొక్కజొన్న జొన్న, మినుము, కంది, శనగ, వేరుశనగ సాగులో డ్రోన్ల వినియోగంపై ప్రామాణికాలను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గడిచిన ఖరీఫ్‌లో 30 వేల ఎకరాల్లో వ్యవసాయ డ్రోన్ల వినియోగం ద్వారా సత్ఫలితాలను సాధించారు. అంతేకాదు.. సెంటర్ ఫర్ అప్సర ద్వారా 75 మంది వ్యవసాయ డిప్లమో విద్యార్థులకు అంతర్గతంగా శిక్షణ ఇచ్చి వ్యవసాయ డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దారు. వ్యవసాయ అనుబంధ అవసరాలకు తగినట్టుగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా 16 డ్రోన్లను రూపొందించి వివిధ పరిశోధనల్లో వినియోగిస్తున్నారు. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం రూపొందించిన పాఠ్యప్రణాళికతో పాటు పైలెట్ శిక్షణకు అనుమతి కోరుతూ వర్సిటీ ప్రతిపాదనలు పంపింది. దీంతో ఈ నెల 3, 4 తేదీల్లో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ జితేందర్ లౌరా నేతృత్వంలోని బృందం లాంలోని సెంటర్ ఫర్ అప్సరను సందర్శించింది. అక్కడ మౌలిక సదుపాయాలతోపాటు పైలెట్ చీఫ్ ట్రైనర్ డాక్టర్ ఎ.సాంబయ్య నేతృత్వంలో శిక్షణ ఇస్తున్న అధ్యాపక బృందం నైపుణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. సెంటర్ ఫర్ అప్సరకు లైసెన్సు జారీచేస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మూడు వర్సిటీలకు మాత్రమే డ్రోన్ పైలెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి ఉంది. అయితే వ్యవసాయ డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చే తొలి అవకాశం ఎన్జీరంగా వర్సిటీకే దక్కింది. సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల శిక్షణ పొందినవారికి కొనసాగింపుగా వ్యవసాయ డ్రోన్లపై మరో ఏడురోజులు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీచేసే అవకాశం కల్పించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆర్బీకేలోను డ్రోన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక డ్రోన్ విప్లవం వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు డీజీసీఏ అనుమతినివ్వడం.. రాష్ట్రంలో డ్రోన్ విప్లవానికి నాంది పలికింది. ఇదొక చరిత్రాత్మక పురోగతిగా భావించవచ్చు. దేశంలోనే తొలి వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు.. తొలి శిక్షణ కేంద్రం కూడా మనదే కావడం గర్వంగా ఉంది. 2032 వరకు అనుమతి ఇవ్వడంతో డ్రోన్ రంగంలో వేలాదిమంది గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది. – డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ రాష్ట్రానికి దక్కిన గౌరవం వ్యవసాయ డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం ఎంపికచేసిన రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
నంద్యాలలో వ్యవసాయ స్టుడియో
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు రాజారెడ్డి బుక్కరాయసముద్రం: కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.13 కోట్లతో వ్యవసాయ స్డూడియో నిర్మించనున్నట్లు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు రాజారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని రేకులకుంట ఆచార్య ఎన్జీ రంగా పరిశోధనా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాలలో స్టుడియో ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన సమాచారం చానల్లో ప్రసారం చేస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, చర్చా కార్యక్రమాలు, రైతుల విజయగాథలు ప్రసారం చేస్తామన్నారు. వ్యవసాయ సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఫార్మర్ కస్టమర్ కేర్ : 18004250430, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్: 18004252960కు రైతులు ఫోన్ చేయవచ్చన్నారు. ఉప వృత్తుల తయారీకి సంబంధించి మిషనరీల కోసం కేవీకేలకు రూ.3.50 కోట్లు నిధులు కేటాయించామన్నారు. -
గర్వంగా బతికేది రైతే
– భవిష్యత్తులో ఉద్యాన పంటలకే ప్రాధాన్యత – 2020 నాటికి మహానందిలో అన్ని సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు – దేశంలో ఏపీ వ్యవసాయ విశ్వ విద్యాలయం నెంబర్ వ¯Œ – ఆంగ్రో ద్వారా 410 వంగడాల సృష్టి మహానంది: గర్వంగా చెప్పుకుని బతికేస్తున్న వృత్తులో రైతన్నది ప్రథమస్థానమని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు డైరెక్టర్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానంది వ్యవసాయ కళాశాలలో రజతోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంబీఏ చదివిన వారు సైతం తమ ఉద్యోగాలను వదిలి స్వగ్రామాలకు వస్తూ రైతులుగా మారుతుండటం రైతు గొప్పతనానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యానపంటలకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తంగెడంచలో సీడ్‌హబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ అనుభవాలకు తోడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుని మరింత ఆర్థికాభివృద్ది సాధించాలన్నారు. నంద్యాల పరిశోధనలు కీర్తివంతంగా ఉన్నాయన్నారు. కర్నూలు, నంద్యాల సోనాకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందన్నారు. దేశంలోనే నెంబర్ 1: భారతదేశంలోని 72 వ్యవసాయ కళాశాలల్లో మన రాష్ట్రమే ఉన్నత స్థానంలో ఉందని, 825 మంది అధ్యాపకులతో భారతదేశంలో నెంబరువన్‌గా ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ టి.రమేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన సదస్సులో మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం ఐదు వ్యవసాయ కళాశాలలు, రెండు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు ఫుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ కళాశాలలు, 39 పరిశోధనా స్థానాలు, ఆరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, ఒక గృహ విజ్ఞాన కళాశాల, 13 ఏరువాక కేంద్రాలు, 13 కృషి విజ్ఞాన కేంద్రాలు కలిగి విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 10,700 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అన్ని పంటలలో కలిపి 410 రకాల నూతన వంగడాలను సృష్టించినట్లు తెలిపారు. ప్రస్తుతం మహానందిలో ప్లాంట్ బ్రీడింగ్ మరియు అగ్రానమీ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టామన్నారు. 2020 నాటికి మహానంది కళాశాలలో అన్ని సబ్జెక్టుల్లో పీజీ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. కార్యక్రమంలో విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ వి.దామోదరనాయుడు, మేకల లక్ష్మినారాయణ, విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు, డీప్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ వీరరాఘవయ్య, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురవయ్య తదితరులు పాల్గొన్నారు.