గూగుల్ కంటే మెరుగైన సెర్చ్ఇంజన్
- 16 ఏళ్ల భారత సంతతి కుర్రాడి సరికొత్త ఆవిష్కరణ
ఎలాంటి పోటీ లేకుండా ఇంటర్నెట్ సెర్చ్ఇంజన్ దిగ్గజంగా దూసుకుపోతోన్న గుగుల్‌కు 16 ఏళ్ల భారత సంతతి యువకుడు గుబులు పుట్టిస్తున్నాడు. కెనడాలో నివసిస్తోన్న భారత సంతతి కుర్రాడు అన్మోల్ టుక్రేల్.. గూగుల్ కంటే మెరుగైన, 47 శాతం ఖచ్చితమైన సెర్చ్ఇంజన్ను రూపొందించాడు. అతడి ఆవిష్కారానికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి.
ఇంకా హైస్కూల్ కూడా పూర్తిచేయని అన్మోల్.. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా సరికొత్త సెర్చ్ ఇంజన్‌ను రూపొందించాడు. ఆ నమూనాను గూగుల్ సైన్స్ ఫెయిర్‌లోనూ ప్రదర్శించాడు. ' సంబంధిత చరిత్రను శోధించడం సాధారణంగా మనం గూగుల్‌లో చేస్తుంటాం కానీ నేను కనిపెట్టిన సెర్చ్ఇంజన్.. వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఉపయోగపడటమేకాక సామీప్యతను కూడా పెంచుతుంది' అని చెబుతున్న అన్మోల్ తన ఆవిష్కరణను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు.
న్యూయార్క్ టైమ్ ఏటా ప్రచురించే 'ఈ ఏటి ఆవిష్కరణ' ఆర్టికల్ కోసం అన్మోల్ ప్రాజెక్టును స్టడీ చేస్తున్నారు. కేవలం ఒక కంప్యూటర్ సహాయంతో పైథాన్ లాంగ్వేజిని అభివృద్ధి చేయడం ద్వారా అన్మోల్ ఈ కొత్త సెర్చ్ఇంజన్ను కనిపెట్టాడు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల్లో ఉన్నత పదవులను భారతీయులు అధిరోహించిన దరిమిలా అన్మోల్ టుక్రేల్ నూతన ఆవిష్కరణ ఎన్ని సంచలనాలు సృష్టింస్తుందో వేచిచూడాలి.