హైదరాబాద్‌లో గాడ్జెట్ ఎక్స్పో
కొలువుదీరనున్న 300 బ్రాండ్లు
♦ 1,000కిపైగా ఉపకరణాల ప్రదర్శన
♦ సెప్టెంబర్ 18 నుంచి 21 వరకూ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మరో ప్రసిద్ధ కార్యక్రమానికి హైదరాబాద్ రెడీ అవుతోంది. హైటెక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు ఇండియా గాడ్జెట్ ఎక్స్పో-2015 జరుగనుంది. 1,000కిపైగా ఉపకరణాలు ఎక్స్‌పోలో కొలువుదీరనున్నాయి. కొన్ని ఉపకరణాలను భారత్‌లో తొలిసారిగా ప్రదర్శించేందుకు కంపెనీలు సిద్ధం అయ్యాయి. కార్యక్రమం జరిగే నాలుగు రోజులపాటు సాయంత్రం 5 గంటలకు 5 ఉత్పత్తులను ఆవిష్కరించనున్నారు. చైనా, కొరియా, తైవాన్, జపాన్తోసహా 12 దేశాలకు చెందిన 300లకుపైగా బ్రాండ్లు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. లక్షకుపైగా సందర్శకులు వస్తారని అంచనా. ఎన్డీటీవీ గాడ్జెట్ గురూ అవార్డుల కార్యక్రమం కూడా ఇదే సందర్భంగా జరుగనుంది. 2014లో గాడ్జెట్ ఎక్స్పో హైటెక్స్‌లో జరిగింది.
ఎక్స్పో వేదికగా..: గాడ్జెట్ ఎక్స్‌పోకు ఏటా హైదరాబాద్ వేదిక కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమ వివరాలను వెల్లడించేందుకు గురువారం ఏర్పాటైన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘లాస్ వెగాస్‌లో జరిగే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో స్థాయికి రానున్న రోజుల్లో గాడ్జెట్ ఎక్స్పోను తీసుకెళ్తాం. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఎక్స్‌పోలో పాల్గొన్న కంపెనీలకు తెలియజేస్తాం. ఇక్కడ ప్లాంట్లు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఇప్పటికే సెల్కాన్ ప్లాంటు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వంతో జూలై 6న మైక్రోమ్యాక్స్ ఒప్పందం చేసుకుంటోంది. తైవాన్ కంపెనీ ఒకటి వస్తోంది’ అని మంత్రి వెల్లడించారు.
రైతులకు ఫ్యాబ్లెట్స్..
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాగు తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా రైతులకు ఫ్యాబ్లెట్స్ (స్మార్ట్‌ఫోన్) ఇవ్వనున్నామని తారక రామారావు తెలిపారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కంటెంట్‌ను సమకూర్చారని వివరించారు. సహకార సంఘాల ద్వారా వీటిని రైతులకు చేరుస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చైనాలో 10 లక్షల మంది ఉంటే భారత్‌లో కేవలం ఒక లక్ష మంది మాత్రమే ఉన్నారని చెప్పారు.
నేటి నుంచి ప్రారంభమవుతున్న డిజిటల్ తెలంగాణ వారోత్సవాలో భాగంగా జూలై 6న పలు కంపెనీలతో అయిదు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. మీసేవను విస్తృతం చేస్తున్నామని, రానున్న రోజుల్లో విద్యార్థులు ఆన్లైన్లో బస్ పాస్‌లు పొందుతారని అన్నారు.