breaking news
Napoleon bonaparti
-
అపుడు రాజును బతికించిన ఐకానిక్ తుపాకీలు : ఇపుడు వేలంలో కోట్లు
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు. 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకున్నాడు. దీంతో అధికారాన్ని కోల్పోయిన నెపోలియన్ చాలా తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. ఈ కారణంతోనే ఏడాది 1814 ఏప్రిల్ 12 రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తొలుత తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలను కున్నాడు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించడంతో బతికిపోయాడు. ఆ తరువాత కూడా విషం తీసుకున్నాడు కానీ ఈ సారీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా ఇపుడు ఎందుకూ అంటే ఆ నాడు చక్రవర్తి తనను తాను చంపుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు (సుమారు రూ. 15.26 కోట్లు) అమ్ముడు పోవడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్‌లోని ఫోంటైన్‌బ్లూ ప్యాలెస్ పక్కన ఉన్న ఒసేనాట్ ఆక్షన్ హౌస్‌లో ఈ వేలాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఈ పిస్టల్స్‌ని జాతీయ సంపదగా ఉంచాలని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వాటి ఎగుమతిని నిషేధించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని అధికారిక పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ తిరిగి దక్కించుకునే అవకాశాలున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి 30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌ను ప్రకటిస్తే, దీన్ని తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. మరోవైపు ఫ్రాన్స్ నిబంధనల ప్రకారం దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి తెలిపారు.ఈ పిస్టల్స్ స్పెషాల్టీ ఏంటి? ఈ రెండు ఐకానిక్ తుపాకులను చక్రవర్తి నెపోలియన్ బొమ్మతో బంగారం, వెండితో తయారు చేశారు. ఈ పిస్టల్స్‌ను పారిస్ తుపాకీ తయారీదారు లూయిస్-మారిన్ గోసెట్ రూపొందించారు. 1814లో నెపోలియన్ అధికారాన్ని కోల్పోయాడు. వేలం హౌస్ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ సమాచారం ప్రకారం తీవ్ర నిరాశ, ఒత్తిడితో, ఈ తుపాకీలతోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన వద్ద పనిచేసే ముఖ్య ఆర్మీ అధికారి అర్మాండ్ డి కౌలైన్‌కోర్ట్ తుపాకీలోని పౌడర్‌ను తొలగించారు. దీంతో తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారట. -
పలచబడిన ఫ్రెంచ్ పరిమళం
ప్రపంచం ఇప్పటికీ మరులుగొనే ఫ్రెంచ్ విప్లవం (1789) తరువాత ఆ దేశం నెపోలియన్ బోనాపార్టి అనే సైనికుడిని పడి పడి ప్రేమించింది. ఆ మహా విప్లవానికి నాయకత్వం వహించిన రాబిస్పియర్ వంటి వారికి ఆ జాతి మరణశిక్ష విధించి, ఆ కుర్ర లెఫ్టినెంట్‌ను చక్రవర్తిగా వరించింది. ఇదొక చారిత్రక వైచిత్రి అనుకుంటే, నెపోలియన్ ప్రేమ గాథ అంతకు మించిన వైచిత్రి. యూరప్ అంతటా అప్రతిహత విజయాలు సాధించి మహా విజేతగా చరిత్రలో నిలిచిపోయిన నెపోలియన్, ప్రేమగాథ దగ్గర మాత్రం అపజయం పాలయ్యాడనే అనిపిస్తుంది. విప్లవంతో ఫ్రెంచ్ జాతీయులు గడగడలాడిపోతున్న కాలంలో, దేశం బయట నెపోలియన్ సాధించిన సైనిక విజయాలు దృష్టి మళ్లించాయి. విప్లవం తరువాత కలహాలతో కాపురం చేసిన రిపబ్లిక్ ప్రభుత్వాలకు కూడా ఇరవయ్యారేళ్ల నెపోలియన్ పెద్ద దిక్కులా కనిపించాడు. అందుకే వరస సైనిక విజయాలు సాధించిన నెపోలియన్ గౌరవార్ధం 1796లో ఓ రోజు పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ చక్రవర్తి పదహారో లూయీ, ఆయన భార్య మేరీ ఆంటోనెట్ నివాసం ఉన్న చరిత్రాత్మక వెర్సెయిల్స్ భవనంలోనే విందుకు వచ్చి కూర్చున్న నెపోలియన్ ఒడిలో తూలి పడిందొక 32 సంవత్సరాల మహిళ. ఆమె- జోసఫీన్ బ్యూహైర్నెస్. పారిస్ నగరంలోనే అందగత్తెగా ఆమెకు పేరుంది. ఆ సాయంత్రమే ఆమెను ప్రేమిస్తున్నట్టు నెపోలియన్ ప్రకటించాడు. రెండు వారాలకే- అంటే, ఆ సంవత్సరం మార్చి 9న పెళ్లి కూడా జరిగింది. నీలం, వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని అప్పుడే నెపోలియన్ ఆమె చేతికి తొడిగాడు(దీనిని ఏడాది క్రితం పారిస్‌లో వేలం వేశారు). చిత్రంగా ఆ రెండు జాతి రాళ్లు కంటి కొన నుంచి రాలుతున్న కన్నీటి చుక్క ఆకృతిలోనే ఉన్నాయి. పెళ్లి జరిగిన రెండో రోజునే నెపోలియన్ ఇటలీ దండయాత్రకు వెళ్లిపోయాడు. యుద్ధరంగం నుంచి భార్యకు కొన్ని నెలల పాటు అనేక ఉత్తరాలు రాశాడు నెపోలియన్. అందులో ఎక్కువ జోసఫీన్‌ను నెపోలియన్ ఎంత గాఢంగా ప్రేమించాడో చెబుతాయి. ఇటలీ తరువాత ఈజిప్ట్ దండయాత్ర జరిగింది. 1799లో సైనిక తిరుగుబాటు చేసి ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడు నెపోలియన్. 1802లో చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. మహారాణిగా జోసఫీన్‌ను ప్రకటించాడు. జోసఫీన్కు అప్పటికే ఇద్దరు పిల్లలు. మార్టినిక్యూ అనేచోట పూటతోటలు పెంచే వారి కుటుంబంలో పుట్టిందామె. ఆమె మహా సౌందర్యాన్ని చూసి పదమూడో ఏటనే అలెగ్జాండర్ డి బ్యూహైర్నెస్ అనే రాజసభ ప్రముఖుడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వదిలేశాడు. ఇంతలోనే ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. అలెగ్జాండర్ విప్లవానికి పూర్తి మద్దతునే ఇచ్చాడు. అయినా విప్లవకారులు నమ్మక, అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి భర్తకు దూరంగానే ఉన్నా జోసఫీన్‌ను కూడా విప్లవకారులు అరెస్టు చేశారు. ఇద్దరికీ మరణ దండన విధించారు. గిలెటెన్ ద్వారా శిక్ష అమలుకు అడ్డు లేకుండా ఆమె కురులను సయితం కత్తిరించి సిద్ధం చేశారు. మొదట అలెగ్జాండర్‌కు మరణ దండన అమలు జరిగిపోయింది. ఇక తన వంతు. అందుకు ఆమె ఎదురు చూస్తుండగా, ప్రభుత్వం కూలిపోయింది. ఆమె శిక్ష నుంచి తప్పించుకుంది. తరువాత ఒక రాజ వంశీకుడు ఆమెను వశం చేసుకున్నాడు. తరువాతే నెపోలియన్‌తో వివాహం. నెపోలియన్ దండయాత్రకు వెళ్లగానే ఆమె జోసఫీన్ వేరొకరితో సంబంధం పెట్టుకుందని రూఢీ అవడంతో నెపోలియన్ తన సోదరుడితో చెప్పి 1810లో విడాకులు సిద్ధం చేయించాడు. అయితే నెపోలియన్ జోసఫీన్‌ను ఎప్పటికీ మరచిపోలేదు. విడాకులు ఇచ్చినా దూరం చేసుకోలేదు. 1814లో జోసఫీన్ మరణించినపుడు కూడా నెపోలియన్ వెళ్లాడు. ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చి జోసఫీన్ పెంచిన గులాబీల తోటలో కొంచెం సేపు గడిపి వచ్చాడు. ట్రెఫాల్గర్, వాటర్లూ యుద్ధాలలో ఓటమి తరువాత ఇంగ్లండ్ నెపోలియన్‌ను సెయింట్ హెలినా ద్వీపంలో బంధించింది. అక్కడే అతడు చివరి దశలో తరుచు కొన్ని మాటలు అనేవాడట-ఫ్రాన్స్.... సైన్యం.... సైన్యాధిపతి... ఇంకోమాట- జోసఫీన్. అంటే 1821లో అక్కడే చనిపోయే వరకు ఆమెను నెపోలియన్ ప్రేమిస్తూనే ఉన్నాడు. ‘తొలి చూపులో ప్రేమ’ ఎంత నిజమో, ‘ప్రేమ గుడ్డిద’నడం కూడా అంతే నిజమని నెపోలియన్ గాథ చెబుతుంది. ఇదో కన్నీటి కథగానే మిగిలిపోతుందని విధి చెప్పదలిచిందా? ఏమో! కానీ నెపోలియన్ ఇచ్చిన పెళ్లి ఉంగరంలో రాళ్లు కన్నీటి బిందువులను పోలి ఉండడం నిజం వింతే. - డా॥గోపరాజు నారాయణరావు