breaking news
Namboodiri Brahmins
-
శబరిమలలో భక్తుల రద్దీ
శబరిమల: మండల మకర విళక్కు పూజల కోసం ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు శబరిమల ఆలయానికి తరలివచ్చారు. వార్షిక మకర విళక్కు పూజల కోసం అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరచిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గర్భగుడిని దేవాలయ ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి తెరచి, నెయ్యాభిషేకం, మహా గణపతి హోమం సహా పలు ప్రత్యేక పూజలు జరిపారు. కేరళ దేవాదాయ మంత్రి కే సురేంద్రన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు, బోర్డు సభ్యులు, దేవాదాయ కమిషనర్ ఎం హర్షన్ తదితరులు ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వార్షిక మండల పూజల నిమిత్తం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆదివారం భక్తులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో, గుడికి వెళ్లే మార్గాల్లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్సై/ఏఎస్సైలు, 1400 మంది కాన్‌స్టేబుళ్లను భక్తుల భద్రత కోసం సన్నిధానం వద్ద విధుల్లో ఉంచారు. 2018 తీర్పుపై స్టే ఉన్నట్లే! మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అమల్లో ఉన్నట్లే భావించాలని కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్ ఆదివారం వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పునకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. ‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వంగా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. కానీ ఇక్కడో సమస్య ఉంది. 2018లో ఇచ్చిన తీర్పుపై తాజాగా ఈ నవంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్టే ఇచ్చారా? లేదా? అన్నది కీలక ప్రశ్న. స్టే ఇస్తున్నట్లు తీర్పులో ప్రకటించలేదు. కానీ వాస్తవానికి స్టే ఇచ్చినట్లే భావించాల్సి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రచారం కోసం ఆలయానికి రావాలనుకునే మహిళలను ప్రోత్సహించబోమని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
దళితుల... కాళ్లకు మొక్కే వేడుక
శుద్ధ సంప్రదాయవాదులైన నంబూద్రి బ్రాహ్మణులు సైతం దళిత థెయ్యాలను ఆరాధించడం, వాళ్లకు మొక్కడం కోసం గంటలపాటు క్యూలో వేచి ఉండడం ఈ వేడుకలోని ఒక విశేషం. దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు? స్వర్గలోకంలో. స్త్రీలలో. ఇంకా... కేరళలో! (‘గాడ్స్ ఓన్ కంట్రీ అంటుంటారు కదా). దేవుడు విహరించే ఈ రాష్ర్టంలోనే ‘థెయ్యం’ కూడా ఉంది. థెయ్యం అంటే దెయ్యం అనుకునేరు. ‘దైవం’ కాలక్రమంలో అక్కడ ‘థెయ్యం’గా మారిపోయింది. థెయ్యం అంటే దైవనృత్యం. (దైవం+ఆట్టం). ఉత్తర కేరళ, కేరళ సరిహద్దు ప్రాంతాలలోని దాదాపు వెయ్యి ఆలయాలలో ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు థెయ్యం ఉత్సవాలు జరుగుతాయి. ఇటీవలే ముగిశాయి. థెయ్యం దళితుల వేడుక. అంతా ఒక చోట చేరతారు. డప్పులు వాయిస్తూ పాటలతో, నృత్యాలతో దేవుళ్లను, దేవతల్ని స్తుతిస్తారు. వీరిలో కొందరిని దేవుడు ఆవహిస్తాడు. అప్పుడు వారేం చెబితే అది జరుగుతుందని ఓ నమ్మకం. బడుగు వర్గాలపై అగ్రవర్ణాల వారి క్రౌర్యాన్ని కథలు కథలుగా చెప్పడం, పాటలు పాటలుగా వినిపించడం థెయ్యం పండుగలోని ప్రధాన కథాంశం. ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. బ్రిటిష్ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ తన ‘నైన్ లివ్స్’ పుస్తకంలో థెయ్యం కళాకారుల గురించి చెబుతూ, ‘‘ఈ సీజన్లో మనుషులు పార్ట్‌టైమ్ దేవుళ్లుగా అవతరిస్తారు’’ అని రాశారు. అంతేకాదు, థెయ్యం ఉత్సవాల కళాకారులుగా మారేందుకు ఉద్యోగాలు వదులుకున్నవారూ ఉన్నారు! వీళ్లు నిష్ఠగా ఉంటారు. ఆ నాలుగు నెలలు మాంసం, మద్యం ముట్టరు. స్త్రీకి దూరంగా ఉంటారు. మన అయ్యప్పలు పాటించే కఠినమైన నియమాలన్నీ వీరూ పాటిస్తారు. దేశంలోని మిగతా ప్రాంతాల వారికి థెయ్యం ఉత్సవం వింతగా కనిపిస్తుంది. కొంత భయం కూడా వేస్తుంది. దేవుడు పూనినట్లు వారు ఊగుతున్నప్పుడు, నేపథ్యంగా వినిపించే సంగీతం హృదయస్పందనలను వేగవంతం చేస్తుంది. పైగా పూనకాలు, భయానక నృత్యాలు రాత్రిపూట మాత్రమే జరుగుతాయి. స్త్రీలు వీటిని చూడడం నిషిద్ధం! వీధుల్లో ‘థెయ్యం’ ఊరేగుతుంటే పిల్లలున్నవారు తలుపులు వేసుకుంటారు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నవారు, దేవుడిని వరాలు అడగదలచుకున్నవారు, దేవుడికి మొక్కులు తీర్చుకోవాలనుకున్నవారు ‘థెయ్యం’ పూనిన కళాకారులతో సంభాషిస్తారు. వారితో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్లే. వారికి ఏదైనా చెల్లించుకుంటే, దేవుడికి చెల్లించుకున్నట్లే. కరడుగట్టిన సంప్రదాయవాదులైన నంబూద్రి బ్రాహ్మణులు సైతం ‘దళిత థెయ్యాల’ను ఆరాధించడం, వాళ్లకు మొక్కడం కోసం గంటలపాటు క్యూలో వేచి ఉండడం ఇంకో విశేషం. ఏటా కనీసం ఇరవై మంది యువ ఫొటోగ్రాఫర్లు పనిగట్టుకుని కేరళ వచ్చి థెయ్యం ఫొటోలను తీసుకుని వెళుతుంటారు. ఈ ఏడాది అలా వచ్చి వెళ్లిన వారందరి ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం కోసం స్థానిక ఫొటోగ్రాఫర్ షాజీ ముల్లూక్కరన్ ఆహ్వానాలు పంపారు. కన్నూర్ దగ్గరి షాజీ స్వగ్రామమైన నారికోడ్లో త్వరలోనే ఈ ప్రదర్శన జరగబోతోంది