ముంబై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శీతల్ మాత్రే
సాక్షి, ముంబై: ముంబై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శీతల్ మాత్రే నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ అధిష్టానం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ముంబై రీజియన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జనార్దన్ చాందూర్కర్ శుక్రవారం సాయంత్రం ఆజాద్మైదాన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ప్రస్తుతం ఆమె దహిసర్ కార్పొరేటర్‌గా ఉన్నారు.
ముంబై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జెనెట్ డిసోజా రాజీనామా చేయడంతో కొద్ది రోజుల నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. దాన్ని చేజిక్కించుకునేందుకు అనేక మంది పైరవీలు చేశారు. చివరకు ఆ పదవి శీతల్ మాత్రేను వరించింది. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముంబై రీజియన్‌లో పటిష్టమైన నాయకత్వాన్ని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ పదవి రేసులో శీతల్తోపాటు అంధేరీకి చెందిన మహిళ కార్పొరేటర్ జోత్స్నా దిఘే పేరు కూడా వినిపించింది. చివరకు శీతల్ మాత్రేను అదృష్టం వరించింది.