'నా భర్తను సీఎం టార్గెట్ చేశారు'
పాట్నా: తన భర్తను బిహార్ సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా చేసుకున్నారని ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ భార్య హీనా షహబ్ ఆరోపించారు. 2000 సంవత్సరంలో తన ముఖ్యమంత్రి పదవి పోవడానికి తన భర్తే కారణమన్న కోపంతో ఆయనను నితీశ్ లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు. అప్పట్లో ఆర్జేడీ కంటే కొన్ని సీట్లు ఎక్కువగా గిలిచిన ఎన్డీఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. నితీశ్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో ఏడు రోజుల తర్వాత నితీశ్ పదవి కోల్పోయారు. కాంగ్రెస్ తో ఆర్జేడీ చేతులు కలిపి రబ్రీదేవి నేతృత్వంలో ఏర్పాటు చేసింది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని తన భర్తను నితీశ్ రాజకీయంగా వేధిస్తున్నారని హీనా ఆరోపించారు. షహబుద్దీన్ బెయిల్ రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఆర్జేడీ, జేడీ(యూ) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నితీశ్ కుమార్ పై ఆమె నేరుగా విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి హీనా ఓడిపోయారు. కాగా, హీనా ఆరోపణలను జేడీ(యూ) అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తోసిపుచ్చారు.