breaking news
Mmtc-pamp
-
రూ. 1కే డిజిటల్ సిల్వర్
న్యూఢిల్లీ: ఎంఎంటీసీ–పీఏఎంపీ సంస్థ తాజాగా డిజిటల్ సిల్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అత్యంత తక్కువగా రూ. 1కి కూడా కొనుక్కోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కావాలంటే ఈ వెండిని తమ కంపెనీకి చెందిన డిజిటల్ వాల్ట్‌లో భద్రపర్చుకుని, తర్వాత విక్రయించుకోవచ్చని పేర్కొంది. డిజిటల్ రూపంలో ఉన్నందున పారదర్శకత, 24/7 అందుబాటులో ఉండటం, కచ్చితమైన స్వచ్ఛత, అత్యంత తక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం, మేకింగ్ చార్జీలు లేకపోవడం వంటి అనేక సానుకూలాంశాలు ఉన్నాయని కంపెనీ ఎండీ వికాస్ సింగ్ చెప్పారు. ఇప్పటికే డిజిటల్ బంగారం విషయంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ, స్విట్జర్లాండ్‌కి చెందిన బులియన్ బ్రాండ్ పీఏఎంపీ కలిసి జాయింట్ వెంచర్‌గా ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. -
పసిడి దిగుమతులకు ఎంఎంటీసీ సమాయత్తం
సాక్షి, విశాఖపట్నం: బంగారం దిగుమతులకు మళ్లీ ఊపొస్తోంది. క్రమక్రమంగా దిగివస్తున్న ధరలతో, పడిపోయిన పుత్తడి వ్యాపారం మళ్లీ పుంజుకునే దిశగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తిరిగి దిగుమతులు ప్రారంభించడానికి సమాయత్తమవుతోంది. బంగారం బిస్కెట్లు, నాణేలను విరివిగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. బ్యాంకులు సైతం తిరిగి తమ బ్రాంచ్‌ల్లో నాణేల విక్రయానికి పావులు కదుపుతున్నాయి. మళీ వెలుగులు... బంగారం ధర ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండడంతో వ్యాపార వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మోడీ ఆధ్వర్యంలో కొలువుదీరిన కొత్త కేంద్రప్రభుత్వం కూడా పసిడి దిగుమతులపై క్రమేపీ ఆంక్షలు సడలించే అవకాశం ఉందన్న అంచనాలు బులియన్ మార్కెట్లో వున్నాయి. దాంతో విశాఖలోని మినరల్స్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) మళ్లీ పూర్వవైభవం సంపాదించాలని చూస్తోంది. గతేడాది వరకు ఈ సంస్థ ఎప్పటికప్పుడు అవసరాలకు సరిపడా బంగారాన్ని బిస్కెట్ల రూపంలో దిగుమతి చేసుకుని జ్యుయలరీ వ్యాపారులకు, వినియోగదారులకు రిటైల్ అవుట్లెట్ల ద్వారా విక్రయించేది. మూడునెలలకోసారి దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా పసిడి బిస్కెట్లను 500 గ్రాములు,100 గ్రాములు,అంతకంటే తక్కువ గ్రాముల రూపంలో దిగుమతి చేసుకుని 100 గ్రాములకు మించిన బిస్కెట్లను బులియన్ కార్పొరేషన్ల ద్వారా విక్రయాలకు అందుబాటులో ఉంచేది. ఈవిధంగా ఏటా విశాఖ ప్రాంతీయ కార్యాలయం 20 టన్నులకు పైగా దిగుమతులు చేసుకుని రూ.750 కోట్ల మేరకు విక్రయాలు జరిపేది. కాని గతేడాది దేశంలోకి పసిడి దిగుమతులు పెరిగిపోవడంతో విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై ఆంక్షలు విధించింది. పన్నులు కూడా పెంచేసింది. దీంతో విశాఖ ఎంఎంటీసీ దిగుమతులను విడతల వారీగా తగ్గించేసి ప్రస్తుతం పూర్తిగా నిలిపివేసింది. తన రిటైల్ అవుట్లెట్లలోనూ నాణేలు, బిస్కెట్లను దాదాపుగా విక్రయాలు ఆపేసింది. బంగారం విక్రయించే జ్యుయలరీ సంస్థలకు సైతం టాటా చెప్పేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనికితోడు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడతాయనే ప్రచారంతో ఎంఎంటీసీ విదేశీ పసిడి ఆర్డర్లను తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. ఈమేరకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్ దేశాలకు మళ్లీ బిస్కెట్లకు ఆర్డర్లు పంపించాలని భావిస్తోంది. తొలివిడతగా టన్ను నుంచి 2 టన్నుల వరకు వ్యాపారం చేయాలని యో చిస్తోంది. త్వరలోనే పైస్థాయిలో అనుమతులు తీసుకుని రంగంలోకి దిగాలని భావిస్తోంది. రిటైల్ కార్యాలయాల్లోనూ నాణేలను అందుబాటులోకి తేవడానికి నిర్ణయించింది. మరోపక్క బ్యాంకులు సైతం విశాఖలోని తమ బ్రాంచుల్లో ప్రభుత్వ అనుమతితో తిరిగి నాణేలు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.