breaking news
Mk Azhagiri
-
నేను కరుణానిధిని కాను.. కానీ...
‘‘నేను కరుణానిధిని కాను. కానీ నా తండ్రిలా మారేందుకు ప్రయత్నించే దమ్ము, ధైర్యం నాకున్నాయి’’ ఇదీ.. డీఎంకే అధిపతి స్టాలిన్ ఉద్వేగ పూరితంగా చేసిన తొలి ప్రసంగం. ఇదే ప్రసంగం... ఎనిమిదేళ్లుగా విజయదాహంతో పరితపిస్తున్న డీఎంకేని ఆయన గెలుపు తీరాలకు చేర్చేలా చేసింది. కరుణానిధి స్థానంలో డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టినప్పడు ఎం.కె.స్టాలిన్ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలడా? అన్న రాజకీయ వర్గాల గుసగుసలకు స్వస్తిపలుకుతూ... పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొనడానికి స్టాలిన్‌కి 2019 సార్వత్రిక ఎన్నికలు మంచి అవకాశాన్నిచ్చాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకొని విజయదుంధుభి మోగించి, తమిళ ప్రజల్లో కలైంజర్ కరుణానిధికి తగ్గ వారసుడన్న ముద్ర వేయటంలో స్టాలిన్ కృతకృత్యులయ్యారు. నిజానికి ప్రారంభంలో స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి సైతం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో సోదరులిద్దరినీ విభజించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ తమిళనాట అడుగుపెట్టే ప్రయత్నాలు జోరుగానే చేసింది. ఇదంతా చూసి... అళగిరితో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకొని ద్రవిడ భూమిలో పాదం మోపాలన్న బీజేపీ ప్రయత్నాన్ని స్టాలిన్ చిత్తుచేయగలిగారు. జయలలిత, కరుణానిధి లేని తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను అత్యంత సమర్థవంతంగా భర్తీ చేసిన స్టాలిన్ అతి కొద్దికాలంలోనే తమిళ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. మోదీ గాలికి వ్యతిరేకంగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అతికొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఒక్క లోక్‌సభ సీటు మినహా తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నిటికి అన్నింటినీ కైవసం చేసుకుని, డీఎంకే తన రాజకీయప్రస్థానాన్ని సుస్థిరపరుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం డీఎంకే విజయం సాధిస్తుందని ఆకాంక్షించినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ గెలవడం డీఎంకే ఉత్సాహాన్ని కొంత నీరుగార్చింది. తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న స్టాలిన్ దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి తమిళనాట చరిత్ర సృష్టించగలిగారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ పార్లమెంటులో డీఎంకే ఎంపీలు అనుసరించిన వామపక్ష అనుకూల వైఖరి, రాజకీయవర్గాల్లో స్టాలిన్‌పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అది రుజువైంది.. ఒకసారి డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక స్టాలిన్ తనని తాను సమర్థవంతంగా రుజువు చేసుకున్నారని స్టాలిన్ చిరకాల సహచరుడు, రాజ్యసభలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్‌కీ అతని తండ్రి కరుణానిధికీ మధ్య ఉన్న విభేదాల విషయాన్ని చాలా మంది ప్రస్తావనకు తెస్తున్నారు. అయితే ఏ ఇద్దరూ ఒకేరకంగా ఉండరనీ, కశ్మీర్ విషయంలో స్టాలిన్ తీసుకున్న బీజేపీ వ్యతిరేక విధానం, కశ్మీర్లో అరెస్టు చేసిన రాజకీయ నాయకులను విడుదల చేయాలంటూ డీఎంకే ఎంపీలు ఢిల్లీలో నిరసనకు దిగడం స్టాలిన్‌కీ, కరుణానిధికీ ఉన్న సారూప్యతకు అద్దం పడుతోందనీ, సరిగ్గా కరుణానిధి ఇలాగే ఉండేవారని ఆయన చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోలేదా? ఏఐడీఎంకేలోని లోపాలను స్టాలిన్ వాడుకోలేకపోయారన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. అయితే శత్రువు బలహీనతలను వాడుకొని, వారిని దెబ్బతీసే మనస్తత్వం ఆయనది కాదని కొందరి భావన. 2016లో జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే లో విభేదాలను ఆయన నేర్పుగా ఉపయోగించుకొని ఉండాల్సిందన్న అభిప్రాయం వారిలో ఉంది. అలాగే దాదాపు 34 ఏళ్ళ పాటు డీఎంకే యువజన నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించిన స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి డీఎంకే యువజన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పడం పట్ల సైతం కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల విజయోత్సాహాన్ని చేబూని, నాయకుడిగా తనని తాను నిలబెట్టుకుంటూనే, రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థానాన్ని సుస్థిరపరుచుకునే వైపు స్టాలిన్ అడుగులు వేస్తున్నారు. దినకరన్, నటుడు కమల్‌హాసన్, డీఎంకేకి పెద్ద ప్రమాదకరం కాదని గత ఎన్నికలు రుజువు చేశాయి. రాబోయే ఎన్నికల్లో సైతం డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే పోటీ ఉండనుంది. అయితే 2021 ఎన్నికల్లో రజనీకాంత్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. (చదవండి: వారసుడి ప్రజాయాత్ర) -
భయం ఎందుకో!
ముల్లై వేందన్ను శాశ్వతంగా తొలగించిన వాళ్లు...కేపీ రామలింగం విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారో? అని డీఎంకే అధిష్టానాన్ని ఆ పార్టీ బహిష్కృత నేత ఎంకే అళగిరి ప్రశ్నించారు. కేపీ రామలింగం అంటే అంత భయం ఎందుకో అని ఎద్దేవా చేశారు. ఇక, తనకు బానిస బతుకు నుంచి విముక్తి లభించినట్టుందని ముల్లై వేందన్ పేర్కొన్నారు. సాక్షి, చెన్నై : డీఎంకే నుంచి మాజీ మంత్రి, ధర్మపురి నేత ముల్లై వేందన్ను శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. అళగిరి మద్దతుదారుడైన ముల్లై వేందన్ను తొలగించి, మరో మద్దతుదారుడు కేపీ రామలింగం విషయంలో డీఎంకే అధిష్టానం వెనకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ ఆదివారం అళగిరి మీడియాతో మాట్లాడారు. కేపీ అంటే భయమా ముల్లై వేందన్ చేసిన వ్యాఖ్యల్నే కేపి రామలింగం కూడా చేశారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ముల్లై వేందన్ను మాత్రం పార్టీ నుంచి ఎందుకు శాశ్వతంగా తొలగించాల్సి వచ్చిందోనని ప్రశ్నించారు. ముల్లై వేందన్ను తొలగించిన వాళ్లకు కేపీ రామలింగం విషయంలో భయం ఎందుకో అని ఎద్దేవా చేశారు. ఆయన ఎంపీగా ఉన్న దృష్ట్యా, ఎక్కడ పార్టీ ఇరకాటంలో పడుతుందోనన్న బెంగతోనే ఆయనపై చర్య తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. ముల్లై వేందన్కు ఓ న్యాయం కేపీ రామలింగంకు మరో న్యాయయా? అన్ని ప్రశ్నించారు. కేపీని పార్టీ నుంచి సాగనంపిన పక్షంలో తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయం డీఎంకేను వెంటాడుతోందని, అందుకే భయ పడుతున్నారని హేళన చేశారు. డీఎంకేలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ వర్గాల్నే గందరగోళంలోకి నెట్టి వేశాయని వివరించారు. ఆ పార్టీలో జరుగుతున్న కొన్ని సంఘనలు చూస్తే, నవ్వా లో, ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు ఏదో ఒక రోజు తప్పకుండా బయటకు వచ్చి తీరుతాయని, అందుకు తగ్గ భారీ మూల్యాన్ని పార్టీ చెల్లించుకోవడం తథ్యమని హెచ్చరించారు. విముక్తి బహిష్కృత నేత ముల్లై వేందన్ ధర్మపురిలో మీడియాతో మాట్లాడుతూ, బానిస బతుకు నుంచి తనకు విముక్తి లభించిందన్నారు. పార్టీలో స్టాలిన్ అరాచకాలకు అనేక మంది నాయకులు బలవుతున్నారని మండి పడ్డారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి చమటోడ్చిన వాళ్లను అణగదొక్కడమే లక్ష్యంగా స్టాలిన్ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. తనకు పార్టీలో పదవి ఇచ్చారేగానీ, ఏ నిర్ణయాన్నీ తీసుకోని రీతిలో ఇన్నాళ్లు చేతులు కట్టి పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కలు కత్తిరించి ఎగర మంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితిని, బానిస బతుకును అనుభవించానన్నారు. ఇప్పుడు తనకు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు తాను ఎక్కడికైనా వెళ్లొచ్చని, జిల్లాలో తన సత్తాను చాటుకునే విధంగా ముందుకు దూసుకెళ్లే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. పార్టీ కోసం తాను 14 ఏళ్లుగా చేసిన సేవలను స్టాలిన్ ఐదేళ్లల్లో సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణగిరి జిల్లా తళి పరిసరాల్లో డీఎంకే పతనానికి ప్రధాన కారకుడు స్టాలిన్ అని ఆరోపించారు. తనను శాశ్వతంగా బహిష్కరించి, మరి కొందరికి ఊరట ఇచ్చే క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మిగిలిన వాళ్లపై తప్పుడు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారని, అలాంటప్పుడు ఆ ఫిర్యాదులు చేసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.