breaking news
Mixed agriculture
-
గో ఆధారిత వ్యవసాయం అత్యద్భుతం
కడ్తాల్ మండలం చల్లంపల్లి గ్రామానికి చెందిన చల్లా పవన్‌రెడ్డి అనే రైతు గో ఆధారిత వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశవాళీ పాడి ఆవులతో శ్రేష్టమైన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివి, మెడికల్ ఇన్‌ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ డీలర్‌గా ఏడేళ్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళానాడు రాష్ట్రాలలో వ్యాపారం నిర్వహించారు. వ్యాపార పనుల నిమిత్తం ఆయా రాష్ట్రాలకు తరుచూ వెళుతుండటం, హోటళ్లలో భోజనం చేస్తుండటం జరిగేది. అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా లివర్ సంబంధిత జబ్బు రావడంతో షాక్‌కు గురయ్యారు. జబ్బుకు కారణం విషతుల్యమైన ఆçహారం తీసుకోవడమే కారణమని తెలిసింది. దీంతో వ్యాపారానికి స్వస్తి చెప్పారు. తనలా మరొకరు ఇలా విషతుల్య ఆహార పదార్థాల బారిన పడకూడదని నిర్ణయించారు. వెంటనే స్వగ్రామమైన చల్లంపల్లికి చేరుకుని తనకున్న వ్యవసాయ పొలంలో సేంద్రియ పంటలను పండిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాక్షి, కడ్తాల్: మూడు ఆవులతో గో ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టాడు రైతు పవన్‌రెడ్డి. గ్రామంలో తమకు గల 11 ఎకరాల పొలంలో మూడు బోరు బావులను తవ్వించారు. ఎందులోనూ సరిపడా నీరు పడలేదు. అదే సమయంలో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడరిటీ సంస్థకు చెందిన రామ్మోహన్ సాంకేతిక తోడ్పాటుతో పొలంలో వర్షం నీరు చేరుకునే చోటును గుర్తించి, అక్కడ బోరును వేయించి, బోరు చుట్టూ ఇంకుడు గుంతను తవ్వించారు. దీంతో బోరులో కొద్దిపాటి నీరు వచ్చింది. మిగతా మూడు బోరులు ఎండిపోకుండా బోరు చుట్టూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. క్రమంగా గో ఆ«ధారిత సాగును విస్తరించారు. 20 దేశవాళీ రకం గిర్, సాహివాల్, తార్పాకర్, రెడ్‌సింధి, హర్యనాభీ తదితర అవులను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుండి తీసుకువచ్చారు. దేశావాళీ ఆవులను పోషిస్తూ, వాటి పేడ జీవామృతం, ఘనా జీవామృతం, అజోల్లా పెంపకంతో తన భూమిని సారవంతంగా మార్చుకుంటున్నారు. అలాగే ఆరోగ్యదాయకమైన పాలను, ఆహార పదార్థాల ఉత్పత్తికి కృషి చేస్తున్నారు. ఐదు ఎకరాలలో మామిడి తోటతో పాటు అంతర పంటగా కూరగాయాల సాగు, రెండు ఎకరాలల్లో వరి సాగు చేయడం, ఎకరా పొలంలో పచ్చిగడ్డి సాగు చేస్తున్నారు. నిత్యం వంద లీటర్ల పాల ఉత్పత్తి పొలంలో షెడ్డును నిర్మించి 20 దేశ వాళీ రకం ఆవులను పోషిస్తున్నారు. ఒక్కో ఆవు ధర రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. ఆవులకు ఆహారంగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి, నిల్వ చేసి, సైలేజ్ గడ్డిని తయారు చేసి, ఆహారంగా అందిస్తున్నారు. అలాగే అజోల్లా గడ్డిని అందిస్తున్నారు. ప్రత్యేకంగా గానుగ నుంచి తీసిన పల్లి చెక్కను సైతం దాణాలో కలుపుతున్నారు. ఒక్కో ఆవు రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తున్నాయి. మొత్తం ఆవులన్నీ 100 నుంచి 120 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. అలాగే గో మూత్రం వృథా కాకుండా ప్రత్యేకంగా ఒక ట్యాంకును ఏర్పాటు చేశారు. గో మూత్రాన్ని లీటరు రూ.25 చొప్పన విక్రయిస్తున్నారు. అదే విధంగా పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. జీవామృతంతో అధిక దిగుబడులు.. ఆవుల పేడ, గో మూత్రం, బెల్లం, పప్పుల పిండి, పుట్టమట్టిని కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనిని నేరుగా ట్యాంకు నుంచి పంట పోలాలకు పైపులైను ద్వారా అందిస్తున్నారు. పంటకు సమృద్ధిగా పోషకాలు అందడంతో వరి పంట దిగుబడులు అధికంగా రావడం మొదలయ్యాయి. ఎకరా వరి ధాన్యం ఉత్పత్తి 40 బస్తాలకు పైగా వస్తోంది. వరిపంటకు జీవామృతం, అజోల్లా సాగుతో, చీడ పీడల సమస్య కూడా తలెత్తడంలేదు. వరితోపాటు టమాటా, వంకాయ, క్యాప్సికం, గోరుచిక్కుడు, మిర్చి, కొత్తిమీర, పుదీన, మెత్తికూర లాంటి ఆకుకూరలను పండిస్తున్నారు. మామిడి తోటకు, అంతర పంటలైన కూరగాయలకు కూడా జీవామృతాన్ని పైపులైను ద్వారా అందిస్తుండటంతో వాటి ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అలాగే నాటుకోళ్లను సైతం పెంచుతున్నారు. ఆదర్శంగా నిలుస్తూ.. పవన్‌కుమర్‌రెడ్డి గో పోషణతో పాటు, సాగులో చేస్తున్న శ్రమను, కృషిని గుర్తించి హైదరాబాద్ వెటర్నరీ యూనివర్శిటీ వారు దేశవాళీ పాడి పశువుల పునరుత్పత్తి, సంకరణ కోసం సాహివాల్ కోడెను అందజేశారు. పవన్‌రెడ్డి చేస్తున్న గో ఆధారిత వ్యవసాయాన్ని చూసి గ్రామంలో పలువురు ఆయనను ఆదర్శంగా తీసుకుని గో ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. పలువురికి ఉపాధి.. పాడిపోషణ, వ్యవసాయం చేయడానికి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుండగా, పాల విక్రయాలు, ధాన్యం, కూరగాయలు, ఆకుకూరలను నేరుగా వినియోగదారుల ఇంటికి వెళ్లి విక్రయించడానికి నలుగురు వ్యక్తులను నియమించుకుని ఉపాధి కల్పిస్తున్నారు. సాగు శ్రేష్టమైనది రసాయన ఎరువులతో పండించిన పంటలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజారోగ్యానికి, పర్యావరాణానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి గో ఆధారిత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. 20 దేశవాళీ ఆవులతో శ్రేష్టమైన పాలను ఉత్పత్తి చేయడంతో పాటు, నాణ్యమైన పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలను పండిస్తున్నాను. పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. గ్రామభారతి సభ్యుడిగా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యుడిగా, భారతీయ కిసాన్ సంఘం సభ్యుడిగా వ్యవసాయ రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నాను. – పవన్‌రెడ్డి, గో ఆధారిత వ్యవసాయ దారుడు, చల్లంపల్లి -
మిశ్రమ వ్యవసాయంతో లాభాలు
కళ్యాణదుర్గంరూరల్: రైతులు మిశ్రమ వ్యవసాయంతో అనేక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ జేడీ టీవీ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. మండలంలోని భట్టువానిపల్లి గ్రామంలో సోమవారం వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి జేడీఏ, కేవీకే సమన్వకర్త డాక్టర్ జాన్ సుధీర్, మహానంది అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, కేవీకే డాక్టర్ ప్రసాద్‌బాబు, ఆదినారాయణ, రేజష్, తిమ్మప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో రావీప్ విద్యార్థినులు పాల్గొన్నారు. అమడగూరు: పంటలకు రసాయనాల వాడకం ద్వారా తక్కువ ఖర్చులు వస్తాయని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్‌కుమార్ అన్నారు. గుండువారిపల్లి గ్రామంలో నాలుగు నెలల నుంచి వ్యవసాయ కళాశాలకు చెందిన 18 మంది రావె విద్యార్థులు చేపట్టిన శిక్షణలో భాగంగా సోమవారం గ్రామ సచివాలయంలో ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా హాజరైన సంపత్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, రసాయనాలను వినియోగించడం ద్వారా పంటలో కలుపు రాకుండా, రోగాలు సోకకుండా నివారించవచ్చన్నారు. అలాగే వేరుశనగలో వస్తున్న కొత్త వంగడాలైన కే–9, కే–6 ను సాగు చేయడం ద్వారా ఏకంగా 45 రోజుల పాటు నీటి సరఫరా లేకున్నా పంట తట్టుకుంటుందన్నారు.ఈసందర్భంగా ఆర్గానిక్ క్లస్టర్ సీఏ, సీఆర్పీలు కొన్ని రకాల కషాయాలను తయారు చేసి చూపించారు. అనంతరం సచివాలయంలో రావె విద్యార్థులు చేసిన వివిధ రకాల నమూనాలను, పోస్టర్లను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కవితారాణి, సర్పంచ్ శశికళ, కదిరి ఏడీఏ లక్ష్మినారాయణ, ఓడీచెరువు ఏఓ సత్యనారాయణ, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.