breaking news
MDMK leader vaigo
-
డీఎంకేలో విలీనం చేద్దాం..!
సాక్షి, చైన్నె: ఎండీఎంకేలో మళ్లీ అంతర్గత కుమ్ములాటలు మరోమారి తెరపైకి వచ్చాయి. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ దురైస్వామి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు రాసిన లేఖ తీవ్ర చర్చకు దారి తీసింది. ఎండీఎంకేను డీఎంకేలోకి విలీనం చేద్దాం.. అని అందులో పేర్కొనడం కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చినట్లయ్యింది. వివరాలు.. డీఎంకేలో చీలిక కారణంగా ఒకప్పుడు ఎండీఎంకే ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైగో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీలో అంతర్గత సమరం సాగుతోంది. ఇందుకు కారణం తన వారసుడు దురై వైగోను రాజకీయ తెర పైకి వైగో తీసుకు రావడమే. తన కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయల్లోకి రారు అని, ఎండీఎంకే కార్యకర్తలు తన ఆస్తి అని.. గతంలో తాను చేసిన ప్రకటనను వైగో విస్మరించడం అనేక మంది సీనియర్ నేతలకు మింగుడు పడ లేదు. వారసుడి రాకతో అనేక మంది ముఖ్య నేతలు వైగోకు బై ..బై చెబుతూ బయటకు వెళ్లారు. వచ్చి రాగానే వారసుడికి పార్టీ కార్యాలయ నిర్వాహక కార్యదర్శి పదవిని వైగో కట్టబెట్టడం అనేక మంది సీనియర్లకు ఇష్టం లేదు. అయినా, సర్దుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో మారు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం శనివారం తెర మీదకు వచ్చింది. ఈ సారి ఏకంగా వైగోకు వ్యతిరేకంగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ దురైస్వామి గళం విప్పడం చర్చకు దారి తీసింది. వైగోకు లేఖాస్త్రం.. పార్టీ ప్రిసీడియం చైర్మన్ తిరుప్పూర్ దురైస్వామి ప్రధాన కార్యదర్శి వైగోకు శనివారం రాసిన లేఖ కేడర్‌లో గందరగోళం, చర్చను రేపింది. ఇప్పటికే తాను వైగోకు ఐదు సార్లు లేఖ రాశానని, ఇంత వరకు ఏ ఒక్కదానికి సమాధానం లేదని దురై స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో దురై వైగోకు పెద్దపీట వేసే విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది కేడర్‌కు చేస్తున్న ద్రోహం, మోసం కాదా..? అని ప్రశ్నించారు. ఇలా వ్యవహరించడం కన్నా, పార్టీని మాతృ సంస్థ డీఎంకేలో విలీనం చేద్దాం అని పిలుపు నిచ్చే విధంగా లేఖలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదే సమయంలో తిరుప్పూర్ వేదికగా ఎండీఎంకే నేతలతో దురైస్వామి సమావేశం కావడం చర్చకు దారి తీసింది. ఆయన ఎలాంటి నిర్ణయంతో తీసుకుంటారనే చర్చ మొదలైంది. వైగో తీరును దుయ్యబట్టే విధంగా లేఖలో వ్యాఖ్యలను పొందుపరిచిన దురై స్వామి, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలలో ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో దురై వైగో స్పందిస్తూ, పార్టీలో గందరగోళ పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీనియర్లకు గుర్తింపు, ప్రాధాన్యత, గౌరవాన్ని ఇస్తున్నామని వివరించారు. దురై స్వామి పార్టీ ప్రధాన కార్యదర్శి వైగోకు రాసిన లేఖ గురించి కేడర్ పట్టించుకోవద్దు అని సూచించారు. -
ఎండీఎంకే x డీఎంకే
సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగోకు వ్యతిరేకంగా తిరువారూర్‌లో నిరసన జ్వాల రగిలింది. దుడ్డుకర్రలకు నల్ల జెండాలు చుట్టి డీఎంకే వర్గాలు నిరసనకు దిగారు. డీఎంకే వర్గాలు తన మీద దాడికి యత్నించాయన్న వైగో ఆరోపణలతో కరుణానిధి దిష్టిబొమ్మల, చిత్రాలను దగ్ధం చేసే పనిలో ఎండీఎంకే వర్గాలు పడ్డాయి. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత బయలు దేరడంతో వైగోకు భద్రత పెంచారు. ఎండీఎంకే నేత, ప్రజా సంక్షేమ కూటమి కన్వీనర్ వైగో డీఎంకేను టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు సంధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కోవిల్ పట్టి రేసు నుంచి తప్పుకుంటూ ఓ కొత్త ఆరోపణ గుప్పించారు. ఆ నియోజకవర్గంలో కుల ఘర్షణకు డీఎంకే కుట్ర చేసినట్టుగా విరుచుకు పడ్డారు. తదుపరి డీఎంకేకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధినేత కరుణానిధి ఎన్నికల బరిలోఉన్న తిరువారూర్‌లో వైగో తీరును అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం రాత్రి మైలాడుతురై నుంచి తిరువారూర్ వైపుగా వస్తున్న వైగోను అడ్డుకునేందుకు డీఎంకే వర్గాలు సిద్ధం అయ్యాయి. వైగో గో బ్యాక్ అంటూ నినదిస్తూ చేతిలో దుడ్డుకర్రలకు నల్ల జెండాలు చుట్టి మరి నిరసన తెలియజేశారు. దీంతో వైగో ఆక్రోశంతో ఊగిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. భద్రత నడుమ తిరువారూర్ బస్టాండ్ వద్దకు చేరుకున్న వైగో తన మీద దాడికి డీఎంకే కుట్ర చేసిందని, వారి నుంచి తప్పించుకు వచ్చేలోపు సమయం పట్టిందని ఆరోపించారు. డీఎంకేలో ఓటమి భయం బయలు దేరిందని, అందుకే తనను టార్గెట్ చేసి ఉన్నారని తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైగో ఆవేశ పూరిత ప్రసంగం నేపథ్యంలో అక్కడున్న ఎండీఎంకే వర్గాలు వీరంగం సృష్టించారు. కరుణానిధి దిష్టిబొమ్మల్ని, చిత్ర పటాల్ని దగ్ధం చేయడంతో డీఎంకే వర్గాలు అడ్డుకునేందుకు పరుగులు తీశారు. డీఎంకే, ఎండీఎంకే వర్గాల మధ్య వివాదం రాజుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైగో వెళ్లి పోవడంతో ఇరు వర్గాల్ని బుజ్జగించిన పోలీసులు, మరలా ఉద్రిక్తత చోటు చేసుకోకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే, వైగోను టార్గెట్ చేసి దాడులకు డీఎంకే వ్యూహ రచన చేసి ఉన్నదని ప్రజా సంక్షేమ కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి. డీఎంకే ఓటమి భయంతో తనను అడ్డుకునే యత్నం చేస్తున్నదంటూ ఆదివారం ఉదయం చిదంబరంలో జరిగిన రోడ్ షోలో ఆగ్రహం వ్యక్తం చేసిన వైగో, సహనం కోల్పోయి తన పార్టీకి చెందిన నాయకులపై శివాలెత్తడం గమనార్హం.