ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీ లకం కానున్నట్లు ఆ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చేవెళ్ల లోక్‌సభ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి పురూరవ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశానుసారం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం యువజన కాంగ్రెస్ ఇప్పటికే సమాయత్తమైందని చెప్పారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంతో పాటు పరిధిలోని అన్ని ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. నేరచరిత లేని వాళ్లకు మాత్రమే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చే అంశంపై రాహుల్‌గాంధీ దృష్టి సారించారన్నారు. బూత్‌లెవెల్, సెక్టార్, మండల కో ఆర్డినేటర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నామన్నారు. వీరికి త్వరలోనే శిక్షణ తరగతులను కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇటీవల కార్తీక్‌రెడ్డి పాదయాత్రకు తాము సహకరించలేదన్నది వాస్తవం కాదన్నారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మాజీ హోంమంత్రి సబితారెడ్డి సహకారం కావాలని ఆమెను కోరానన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకులు పనిచేయడం లేదని అధిష్టానానికి తానెలాంటి ఫిర్యాదు చేయలేదని పురూరవరెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల లోక్‌స్థానం నుంచి తిరిగి జైపాల్రెడ్డియే బరిలో ఉంటారన్నారు. తాను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నానని, ఎన్నికల్లో పోటీచేయడమనేది అధిష్టానం నిర్ణయించాల్సిన అంశమన్నారు. విలేకరుల సమావేశంలో చేవెళ్ల లోక్‌సభ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రణధీర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి సంతోష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ, పట్టణ అధ్యక్షులు హేమంత్‌కుమార్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.