మహాభారతం మరియు గాన్ విత్ ద విండ్
మహాభారతంలోలానే ఒక కులీనవర్గం, దాని కట్టుబాట్లు, అభిరుచులు, దర్పం, కాల్పనిక ఊహా ప్రపంచం, వీరత్వంతో సహా అన్నీ యుద్ధమనే ఉగ్రతాపానికి మంచులా కరిగిపోయి, సాధారణ ప్రవాహంలో అనామకంగా కలిసిపోవడాన్ని ఈ నవల చెబుతుంది.
ఈమధ్య పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి హిమాలయ రాష్ట్రమైన సిక్కిం వెడుతున్నాం. ఘాట్ రోడ్డు మీద బస్సు ఎక్కుతూ దిగుతూ, వంపులు తిరుగుతూ, పచ్చని లోయల వెంబడే ప్రయాణిస్తోంది. ఆ లోయలను ఒరుసుకుంటూ తీస్తానది. ప్రకృతి అందంగానే కాదు, నిశ్చలచిత్రంలానూ, ప్రశాంతంగానూ ఉంది. అంతలో హిమాలయాలు తీవ్ర భూకంప స్థావరాలన్న సంగతీ, ఇటీవల నేపాల్లో సంభవించిన భారీ భూకంపం గుర్తొచ్చాయి. ‘‘ఇప్పుడు ఈ క్షణంలో కూడా భూకంపం రావచ్చు’’ ననిపించింది. ‘‘భూమిలో ఉన్న రాతి పలకల్లో విపరీతమైన రాపిడీ, చలనమూ నిరంతరాయంగా సంభవిస్తూ ఉంటాయి. అవి కుదుటపడటానికి నిర్విరామంగా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక దశలో ఆ ప్రయత్నం విస్ఫోటస్థితికి చేరి భూకంప రూపం తీసుకుంటుంది.
నిజమే, ప్రకృతి సమస్తం ఒక సమస్థితిని తెచ్చుకునే ప్రయత్నం నిర్విరామంగా చేస్తూనే ఉంటుంది. అది తుపానులు, వరదలు వగైరా ఇతర ఉత్పాతాలుగా కూడా బయటపడుతూ ఉంటుంది. అలాగే, మానవ సమాజాలు కూడా సమస్థితిని తెచ్చుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయా? యుద్ధాలు అందుకేనా?!
యుద్ధాలను ఎవరూ కోరుకోరు. కానీ వాటిని ప్రాకృతిక న్యాయంతో ముడిపెట్టి చూసినప్పుడు ఆపడమూ సాధ్యమా అనిపిస్తుంది. యుద్ధం అపార విధ్వంసాన్ని, మానవ సంబంధాల క్షీణతను, విలువల పతనాన్ని తెస్తుంది. కానీ విచిత్రంగా సరికొత్త నిర్మాణానికీ, వినూత్న మానవ సంబంధాలకూ, విలువలకూ దారితీస్తుంది. జవహర్లాల్ నెహ్రూ వంటి శాంతికాముకుడు కూడా, ఈ దేశ ప్రజల పెనునిద్దర వదిలించి జాతిని ప్రక్షాళన చేసే యుద్ధమొస్తే బాగుండునని కోరుకున్న సంగతి (డిస్కవరీ ఆఫ్ ఇండియా) తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.
దేశం మొత్తాన్ని కుదిపేసే ఒక మహాయుద్ధం మనదేశంలో సంభవించి ఎంతకాలమైంది?! ‘వీరో’చితంగా స్వాతంత్య్రం తేవాలనుకున్న సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల పట్ల ఇప్పటికీ జనసామాన్యంలో గూడుకట్టుకున్న ఆరాధన ఆనవాళ్లు కనిపించినప్పుడు ఒక వీరుడి కోసం, ఒక మహాయుద్ధం కోసం ఈ జాతి ఎంతగా మొహం వాచిందో అనిపిస్తుంది. కళింగయుద్ధం లాంటి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగి, జనజీవితాన్ని అల్లకల్లోలం చేసి ఉండవచ్చు. వాటిలో గొప్ప ఇతిహాసంగా పరిణమించిన యుద్ధాలున్నాయా? ఈ స్థితిలో ఈ క్షణాన నా చూపుల్ని ఆక్రమించుకుంటున్న మహాయుద్ధ ఇతిహాసం మహాభారతం.
కురుక్షేత్ర యుద్ధం ఇతిహాసం వర్ణించిన స్థాయిలో గొప్ప యుద్ధం కాకపోవచ్చు. అదొక కీలకమైన యుద్ధం. మౌలికమైన అనేక రాజకీయ, సామాజిక, మానసిక పరివర్తనలతో జనచేతనపై గాఢమైన ముద్రవేసిన యుద్ధం. ఆ యుద్ధానికి ముందూ, తర్వాతా ఉన్న సమాజాలు ఒకలాంటివి కావు. ఏకశరీరిగా ఉండే నాటి గణసమాజంలో అంతవరకూ అంతర్యుద్ధాలు లేవు. అది ఊహించడానికే వీలుకాని విపరిణామం. అర్జునుడు ఎదుర్కొన్న విషాదం అదే. దాంతో కృష్ణుడు అతణ్ణి యుద్ధోన్ముఖుణ్ని చేయడానికి చాలా కౌన్సెలింగ్ జరపాల్సివచ్చింది. అదే భగవద్గీత అయింది.
మహాభారతం మొత్తం యుద్ధాలు తెచ్చిపెట్టే జనక్షయం గురించీ, ఆచారాలు, కట్టుబాట్లు సడలిపోవడం గురించీ చెబుతుంది. ‘‘(యుద్ధం వల్ల) కులక్షయం అవుతుంది. సనాతన కులధర్మాలు నశిస్తాయి. అధర్మం వృద్ధి అవుతుంది. స్త్రీలు చెడిపోతారు. వర్ణసంకరం అవుతుంది’’ అని అర్జునుడు అంటాడు. అప్పుడు కృష్ణుడు, ‘‘ఈ విషమఘట్టంలో ఆర్యులకు తగని, అపకీర్తికరమైన ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నా’’ వంటూ మందలిస్తాడు.
మహాభారతాన్ని చదువుతూ, మార్గరెట్ మిచెల్ రాసిన గాన్ విత్ ద విండ్ చదవడం యుద్ధం గురించిన గొప్ప ఎరుక. యుద్ధం అన్ని రకాల మానవ సంబంధాలలో తీసుకువచ్చే మార్పుల గురించి మహాభారతం చెప్పిందే, మరింత బాగా అర్థమయ్యే భాషలో గాన్ విత్ ద విండ్ చెబుతుంది. అమెరికా అంతర్యుద్ధం (1861-65), యుద్ధానంతర పునర్నిర్మాణం (1865-77) దాని నేపథ్యం. భారతంలోలానే ఒక కులీనవర్గం, దాని కట్టుబాట్లు, అభిరుచులు, దర్పం, కాల్పనిక ఊహా ప్రపంచం, వీరత్వంతో సహా అన్నీ యుద్ధమనే ఉగ్రతాపానికి మంచులా కరిగిపోయి, సాధారణ ప్రవాహంలో అనామకంగా కలిసిపోవడాన్ని ఈ నవల చెబుతుంది. యుద్ధం తెచ్చిపెట్టే మానసిక, భౌతికకల్లోలాన్ని అనితరసాధ్యంగా చిత్రించిన ఈ రచన వెయ్యి పుటల విస్తృతిలోనూ, వస్తువులోనూ కూడా ఇతిహాసస్థాయిని అందుకుంది.
సువిశాలమైన పత్తి వ్యవసాయ క్షేత్రాలతో బానిసల శ్రమమీద కాటన్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వచ్చిన అమెరికాలోని ఏడు దక్షిణాది రాష్ట్రాలు తమ భద్రస్థితిని, తమ పరిమిత ప్రపంచాన్ని కాపాడు కోవాలనుకుంటాయి. యూనియన్లో చేరడానికి నిరాకరించి కాన్ఫెడరేట్గా ఏర్పడి యుద్ధానికి దిగుతాయి. విందు వినోదాలతోనూ, కాల్పనిక ప్రణయావేశంలోనూ, వీరత్వపు ఊహల్లోనూ గడిపే యువతకు తమది ఓడిపోయే యుద్ధమన్న నిజం తెలియదు. కాలం చెల్లిన తమ వ్యవస్థ కడతేరక తప్పదన్న తెలివిడి వారికి లేదు. ఈ నవలలోని ఒక ప్రధానపాత్ర రెట్ బట్లర్ మాటల్లో చెప్పాలంటే, ఉత్తరాదిన ఉన్నట్టు దక్షిణాదిన ఒక్క తుపాకుల ఫ్యాక్టరీ కానీ, ఇనప కర్మాగారం కానీ, వులెన్ మిల్లు కానీ, యుద్ధనౌక కానీ లేవు. ఇక్కడి జనానికి పత్తి సాగు, బానిసల శ్రమ, అలవిమాలిన పొగరు తప్ప ప్రపంచానుభవం లేదు. వీళ్ళను మట్టి కరిపించడానికి యూనియన్ సైన్యాలకు ఒక్క నెల చాలు.
అదే జరుగుతుంది. దశాబ్దాలపాటు వీరు నిర్మించుకున్న కాల్పనిక భద్రప్రపంచం కొన్ని నెలల్లోనే కుప్పకూలిపోతుంది. సామాజిక సంబంధాలు, విలువలు తారుమారు కావడమే కాదు; అన్న పుష్కలత్వం నుంచి ఆకలి ఆర్తనాదాలకు, పిడికెడు ఆహారం కోసం హత్యలు చేయడానికి తెగబడే స్థితికి చేరుకుంటారు. యుద్ధంలో బతికి బట్టకట్టిన వాళ్లు సాధారణ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటారు. అంతవరకూ ప్రేమ గురించీ, పెళ్లి గురించీ కమ్మని కలలు కంటూ వచ్చిన ఆడపిల్లలు ఒక్కసారిగా కఠోర వాస్తవిక ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎవరో ఒకరు కట్టుకుంటే చాలనుకుంటారు.
స్కార్లెట్ ఒహారా, రెట్ బట్లర్, మెలనీ.. ఈ మూడూ గుర్తుండిపోయే పాత్రలు. స్కార్లెట్ ముఖంగా రచయిత్రి కథ చెబుతుంది. కలల ప్రపంచం నుంచి కఠోర ప్రపంచానికి మారే అన్ని దశలనూ, అనుభవాలనూ చవిచూసిన స్కార్లెట్ అచంచలమైన జీవితేచ్ఛకు ప్రతినిధి. గొప్ప కాలికస్పృహతో యుద్ధపరిస్థితులను అనుకూలంగా మలచుకుంటూ సంపదకు పడగెత్తి కొత్త నీటిలో చేపలా కలిసిపోయిన పాత్ర రెట్ బట్లర్. ఎటువంటి కల్లోలంలోనైనా మానవీయతను, నిష్కల్మషతను, ప్రేమించే గుణాన్ని నిలుపుకున్న గొప్ప పాత్ర మెలనీ.
భౌతికంగా చూస్తే, ఈ నవలకు ప్రధాన రంగస్థలం జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా. యుద్ధానికి ముందు ఒక గ్రామంగా ఉన్న అట్లాంటా, యుద్ధసమయంలోనూ, ఆ తర్వాతా ఒక మహానగరస్థాయికి ఎలా చేరుకుందో; వెనకటి కులీన, భద్రప్రపంచం అక్కడి రకరకాల జనసందోహంలో ఎలా నామరూపాలు లేకుండా కలసిపోయిందో రచయిత్రి అద్భుతంగా చిత్రిస్తుంది.
మహాభారతం చిత్రించింది కూడా అదే! మెలనీ భర్త ఆష్లే మాటల్లో అర్జునుడి విషాదం తాలూకు ప్రతిధ్వనులే వినిపిస్తాయి. అతను కూడా అందరిలానే యుద్ధానికి వెడతాడు. యుద్ధంలో మనం గెలిచినా, ఓడినా చివరికి మిగిలేది ఓటమే నంటాడు. ‘‘గెలిస్తే మన కాటన్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుని, ఉత్తరాది వారిలో మనం ఏవగించుకునే వ్యాపార సంస్కృతిలోకి దిగజారిపోతాం. ఓడితే భవిష్యత్తులో ఎందులోనూ ఇమడని వ్యర్థజీవులుగా మిగిలిపోతాం. యుద్ధఫలితం ఎలా ఉన్నా మన పాతకాలాన్నీ, పాతప్రపంచాన్నీ కోల్పోతాం’’ అంటాడు.
అమెరికా అంతర్యుద్ధ కథనంలో మన మహాభారత ప్రతిబింబాన్ని చూడడం ఎంత విచిత్రమైన అనుభవం!
-భాస్కరం కల్లూరి
9703445985