breaking news
making the charges
-
పడినా, పెరిగినా.. బంగారమే
రేటు తగ్గినా, పెరిగినా బంగారం.. బంగారమే. దాని వన్నె తగ్గదు. అందుకే మనవాళ్లు ఇటు అలంకరణపరంగానే కాకుండా అటు ఇన్వెస్ట్మెంటుపరంగా కూడా పసిడికి పెద్ద పీట వేస్తుంటారు. ఎందుకంటే .. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే పెట్టుబడి సాధనంగానే కాకుండా మిగతా పెట్టుబడుల్లో నష్టాలేమైనా వస్తే భర్తీ చేసే సాధనంగా కూడా పసిడి ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో కొన్నేళ్ల పాటు సుమారు 20 శాతంపైగానే రాబడులు అందించింది. ఇప్పుడు రేట్లు కొంత తగ్గుముఖం పట్టినా.. బంగారంపై ఆకర్షణ అలాగే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు అందుబాటులో ఉన్న వివిధ సాధనాలపై ఈ కథనం. నాణేలు.. కడ్డీలు..ఆభరణాలు.. బంగారం అనగానే ప్రధానంగా ఆభరణాల రూపంలో కొనుగోళ్లే కనిపిస్తాయి. అనేక సంవత్సరాలుగా ఎంతో కొంత ఆభరణాల రూపంలోనే కొంటుంటాం. అయితే, వీటిని కొన్నప్పుడు మేకింగ్ చార్జీలు పడుతుంటాయి. అదే మళ్లీ అమ్ముదామనుకుంటే తరుగు వగైరా అంటూ మళ్లీ కోత పెడుతుంటారు. వీటితో పోలిస్తే బంగారు నాణేలు, కడ్డీలపై ఇన్వెస్ట్మెంటు కొంత మెరుగైనది. జ్యు యలర్లు, బ్యాంకులు వీటిని విక్రయిస్తుంటాయి. అయితే, బ్యాంకులు మనకు అమ్ముతాయే తప్ప మన దగ్గర్నుంచి కొనవు. అదే జ్యుయలర్లు కాయిన్లను తిరిగి కొంటారు. బంగారం ఈటీఎఫ్‌లు .. ఆభరణాల రూపంలోనే కాకుండా ఆన్లైన్లో ఫండ్ రూపంలో కూడా పసిడిని కొనుక్కోవచ్చు. ఇందుకోసం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అని ఉంటాయి. వీటిలో మనం ఇన్వెస్ట్ చేస్తే.. ఇవి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రతిగా మన పెట్టుబడికి సరిపడా యూనిట్లు కేటాయిస్తాయి. స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ యూనిట్ల అమ్మకం, కొనుగోలు లావాదేవీలు జరపవచ్చు. ఇందుకోసం మనకు డీమ్యాట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంట్లు అవసరమవుతాయి. అలాగే లావాదేవీలకు సంబంధించి కొంత మేర బ్రోకరేజి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఫండ్ మేనేజ్మెంటు చార్జీల కింద మరికొంత కట్టాల్సి ఉంటుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్.. మన తరఫున గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్‌ను గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌గా వ్యవహరిస్తుంటారు. దీనిలో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రత్యేకంగా డీమ్యాట్ అకౌంటు అక్కర్లేదు. ఇతర మ్యూచువల్ ఫండ్ పథకాల తరహాలోనే నెలకి ఇంత చొప్పున సిప్ పద్ధతిలో ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, ఈటీఎఫ్‌తో పోలిస్తే ఇందులో మేనేజ్మెంటు చార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈటీఎఫ్‌లలో డీమ్యాట్ అకౌంటు తెరవడం, బ్రోకింగ్ చార్జీలు కట్టడం చేయాల్సి వస్తే.. మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత అదనపు చార్జీలు ఉంటాయి. ఇవే కాకుండా బంగారం మైనింగు, వెలికితీత, మార్కెటింగ్ కార్యకలాపాలు చేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ ఆధారిత గోల్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇతర సాధనాల్లో మన పెట్టుబడి పనితీరు బంగారం ధరలపై ఆధారపడి ఉండగా.. ఈ గోల్డ్ ఫండ్స్ మాత్రం ఆయా కంపెనీల పని తీరుపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే ఇలాంటివి ఉన్నాయి. ఏది ఏమైనా దీర్ఘకాలికంగా పసిడిపై రాబడి వార్షికంగా 10% స్థాయిలోనే ఉన్న సంగతి గుర్తుంచుకుని.. మొత్తం పెట్టుబడుల్లో 5-10 శాతాన్ని పసిడికి కేటాయించవచ్చన్నది నిపుణుల సలహా. -
గోల్డ్ స్కీమా! జాగ్రత్త!!
బంగారం.. ఎవరిని ఆకర్షించదు చెప్పండి! అందుకే అది బంగారమైంది. బంగారంలానే బంగారం డిపాజిట్ స్కీమ్‌లు కూడా అందరినీ ఆకర్షిస్తుంటాయి. నె లనెలా కొంత కట్టడం... చివరికి ఆ మొత్తంతో ఏదో ఒక నగ కొనుక్కోవటం. ఇలా చేసేవారికి ఆ స్కీము నడిపే సంస్థ బోనస్ కూడా ఇస్తుంటుంది. సాధారణంగా ఓ 11 నెలల పాటు నెలకు ఇంత అని నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే... దానికి బోనస్‌గా 12వ నెల మొత్తాన్ని సదరు సంస్థ వేయటమో, వేరే ప్రోత్సాహం ఇవ్వటమో చేస్తుంటుంది. చాలా వరకూ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లను బంగారం దుకాణాలే నిర్వహిస్తుం టాయి. మరి ఈ స్కీములు మంచివేనా? చాలామంది ఇన్వెస్ట్మెంట్ నిపుణులు ఇలాంటి పథకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండమని చెబుతుంటారెందుకు? దీన్లో లాభనష్టాలేంటి? ఈ వారం చూద్దాం... ప్రయోజనాలు ఈ స్కీముల్లో ఉండే ప్రధానమైన లాభమేంటంటే వాయిదాల పద్ధతిపై కొనుక్కోగలగటం. ఎందుకంటే బంగారమంటే ఖరీదైంది. ఒకేసారి కొనుగోలు చేయాలంటే కష్టం కాబట్టి వాయిదా పద్ధతుల్లో సొమ్ము చెల్లించి, కొనుక్కోవడం కొంత ఈజీ. చాలా స్కీమ్‌లలో ధరకు రక్షణ ఉంటుంది. స్కీమ్ ప్రారంభమైనపుడు ఎంత ధర ఉందో, అదే ధరకు బంగారం మీ చేతుల్లోకి వస్తుంది. మధ్యలో ధర పెరిగినా దాన్ని దుకాణదారే భరిస్తాడు. నష్టాలు చాలానే.. దుకాణదారు చెల్లిస్తానని చెప్పే చివరి ఇన్స్టాల్మెంట్ పేపర్‌పై తప్ప డిపాజిట్‌దారుకు అందదు. కొన్ని స్కీమ్‌లలో ధర కు రక్షణ ఉండదు. ఈలోగా బంగారం రేటు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈపథకాల్లో బంగారాన్ని ఆభరణాల రూపంలో తప్ప నాణాలు, కడ్డీలుగా ఇవ్వరు. ఆభరణాలపై మేకింగ్ చార్జీలు భారీగా వడ్డిస్తారు. మీరు బంగారాన్ని సదరు దుకాణదారు దగ్గరే... అక్కడ ఉన్న మోడళ్లనే కొనుగోలు చేయాలి. ఈ స్కీమ్‌ల కింద డిపాజిట్లు వసూలు చేసేవారు ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రారు. ఈదుకాణదారు కనక రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్నదీ ప్రశ్నార్థకమే. సాధ్యాసాధ్యాలను బట్టి చూస్తే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ల కన్నా బంగారం కడ్డీలు, నాణేలు లేదా బంగారం ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) చాలావరకూ ఉత్తమమన్నది నిపుణుల సలహా.