breaking news
Mahesh Chandra Mehta
-
వికాస్ మోడల్ కాదు.. వినాశ్ మోడల్
సాక్షి, హైదరాబాద్ : భారీ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలు భూ నిర్వాసితుల పునరావాస(2013) చట్టాలను ఉల్లంఘిస్తుండటం.. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాలు తమవైన చట్టాలు రూపొందించుకోవడంపై ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమ కారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ చంద్ర మెహతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే ప్రభుత్వాలు ఇష్టారీతిలో వ్యవహరించడం మానుకోవని... పౌరులంతా సంఘటితంగా ఒక్కతాటిపై నిలిస్తే పాలకుల మెడలు వంచడం కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన ‘మీట్ ద ప్రెస్’లో ఆయన మాట్లాడారు. పౌరులందరికీ స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీరు, ఆహారం అందివ్వడం అసలైన వికాసం అవుతుందిగానీ.. ‘‘వికాస్’’ అంటూ నినాదాలు ఇవ్వడంతో రాదని అన్నారు. నిజానికి ఇప్పుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్నది వికాస్ మోడల్ కాదని.. వినాశ్ మోడల్ అని దుయ్యబట్టారు. మేనిఫెస్టోల్లో చేర్చినా లాభం లేదు... రాజకీయ పార్టీలు పర్యావరణ పరిరక్షణ అంశాలను తమ మేనిఫెస్టోల్లో చేర్చినా పెద్దగా ఫలితం ఉండబోదని.. ఎందుకంటే గెలుపు కోసం ఎన్ని అడ్డదారులనైనా తొక్కేందుకు అవి సిద్ధంగా ఉన్నాయని ఎంసీ మెహతా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్.దిలీప్ రెడ్డి, ప్రెస్‌క్లబ్ చైర్మన్ రాజమౌళి చారి, కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురోషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారే దళారీ కారాదు
ప్రభుత్వమే భూములు సేకరిస్తూ రియల్టర్‌గా మారడం సరికాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి పర్యావరణ వేత్త, న్యాయవాది ఎం.సి.మెహతా సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంపై ఒంటెత్తుపోకడతో వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ చంద్ర మెహతా (ఎం.సి. మెహతా) పేర్కొన్నారు. పచ్చటి, సారవంతమైన పొలాలను భవంతుల నిర్మాణానికి, కంపెనీలకు కట్టబెట్టేందుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఉపయోగించడం క్షంతవ్యం కాదన్నారు. ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో పునరాలోచన చేయాలని, రైతుల భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలు ఆపి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని సూచించారు. గంగానది ప్రక్షాళన మొదలుకొని శివకాశీ టపాసుల ఫ్యాక్టరీల్లో బాలకార్మికుల వెట్టిచాకిరీ వరకూ పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయస్థానాల్లో పోరాడి పలు విజయాలు సాధించిన ఎం.సి.మెహతా ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆయన్ను పలకరించిం ది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 29 గ్రామాలకు చెందిన 35 వేల ఎకరాల భూములను రాజధాని పేరుతో సేకరించేందుకు ప్రయత్నిస్తోందన్న సమాచారం విస్మయపరిచింది. రాజధాని అనేది ప్రజా అవసరాలు తీర్చేదిగా ఉండాలేగానీ.. పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు భూమి పంచేందుకు కాదు. రైతుల నుంచి సేకరించిన భూమిని, పరిశ్రమలకు, కంపెనీలకు ఇచ్చేందుకు, అధిక ధరలకు వేలం వేసి నిధులు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం సరికాదు. ళీదేశంలో జీవవైవిధ్యానికి పట్టుకొమ్మల్లాంటి తూర్పు, పశ్చిమ కనుమలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకోవాల్సిందే. లేదంటే భూతాపోన్నతి ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పులతో సమీప భవిష్యత్తులో పూడ్చుకోలేనంత నష్టం కలుగుతుంది. విదేశాలతో పోలికెందుకు? విదేశాలతో పోలిస్తే మన సంస్కృతి, అవసరాలు వేరు. రాజధాని విషయంలో సింగపూర్‌తో పోలికెందుకు? మీరు వాషింగ్టన్ ఎప్పుడైనా చూశారా? అమెరికా రాజధానిలో పరిపాలన భవనాలున్న ప్రాంతాలు సాయంత్రానికి నిర్మానుష్యంగా మారిపోతాయి. మన అవసరాలు బట్టీ ఉండాలి. చట్టాల అమలే సవాలు దేశంలో భూముల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ఉన్న చట్టాలే సరిపోతాయి. కాకపోతే వీటిని సక్రమంగా అమలు చేయడమనేదే పెద్ద సవాలు. మన న్యాయవ్యవస్థ చురుకుగా ఉండటం వల్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకోగలిగాం.