breaking news
Loan waiver program
-
నిండా ముంచారు
‘రుణమాఫీ పచ్చి బూటకం. అన్ని వివరాలు సమర్పించినా మాఫీ చేయడం లేదు. ఎందరో అధికారులకు వినతులు ఇచ్చాం. అయినా ఫలితమేమీ లేదు. అసలు లోన్ రద్దవుతుందో, లేదో తెలియక వేదన పడుతున్నామ’ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేశారని, ఇప్పుడు మాత్రం నిబంధనల పేరిట ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పరిషత్ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో సోమవారం రుణమాఫీ పరిష్కార వేదికను ప్రారంభించారు. మాఫీ కాని రైతులు ఫిర్యాదులు ఇస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారని వ్యవసాయ అధికారులు ప్రచారం చేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో రైతులు తరలివచ్చారు. మొదటి రోజు ఫిర్యాదుల స్వీకరణలో తీవ్ర జాప్యం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రసంగాలు, కౌంటర్ల పరిశీలన తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కోసారి వంద మంది ప్రకారం రైతులకు టోకెన్లు ఇచ్చి లోపలికి పంపారు. మొదటి రోజు మూడు వేల మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అనేక మందికి లభించకపోవడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి రైతులు పోటెత్తారంటే రుణమాఫీ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. అనేక మందికి అన్ని అర్హతలున్నా ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మరి కొంతమందికి రెండు, మూడు విడతల మాఫీ నిధులు జమ కాలేదు. ఇంకొందరికి మూడో విడత రాలేదు. బ్యాంకర్లపైకి నెపం రుణమాఫీలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా.. తప్పిదాన్ని బ్యాంకులపైకి నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. రైతు రుణం వివరాలు ఇప్పటి వరకు ఎన్ఐసీ పోర్టల్‌లో నమోదు కాలేదు. 2007 ఏప్రిల్ 1 నుంచి 2013 డిసెంబరు 31 మధ్య లోన్ ఉన్నట్లయితే అవుట్ స్టాండింగ్ (అప్పు నిల్వ) రిపోర్టుతో కూడిన 36 వివరాలను సంబంధిత బ్యాంకు ద్వారా రైతు సాధికార సంస్థకు మెయిల్ చేయించాలంటూ ఒక కాగితాన్ని రైతుల చేతుల్లో పెట్టి చేతులు దులిపేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే లోపాన్ని బ్యాంకులపైకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకుకు వెళ్లండంటూ ఉచిత సలహా ఇవ్వడం తప్ప రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం లేదు. రెండు విడతల నిధులు జమ కాలేదు పత్తికొండలోని బ్యాంకు నుంచి రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్నా. ఒక విడత మాత్రమే రూ.26,174 మాఫీ నిధులు జమయ్యాయి. 2, 3వ విడతల నిధులు రాలేదు.. దీనిపై ఫిర్యాదు చేసినా పరిష్కారం కనిపించలేదు. ‘పడతాయిపో’ అన్నారు తప్ప ఎప్పటికి పడతాయో అధికారులెవరూ చెప్పడం లేదు. – బాబాఫకృద్ధీన్, హోసూరు, పత్తికొండ మండలం మూడో విడత నిధులు రాలేదు రుణమాఫీ మూడో విడత నిధులు జమ కాలేదు. దీనిపై వినతి ఇచ్చేందుకు ఇప్పటికే గన్నవరం కూడా వెళ్లి వచ్చాం. ఈ పరిష్కార వేదికలోనూ అన్ని వివరాలు ఇచ్చాం. తూతూ మంత్రంగా పరిశీలించి, బ్యాంకుకు వెళ్లి కలవాలని చెప్పారు. – వెంకటరమణ, గోరుకల్లు, పాణ్యం మండలం -
మాఫీ అంతంతే
ఏలూరు (టూ టౌన్) :వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమం జిల్లాలో ప్రహసనంలా సాగుతోంది. ఎన్నికల ముందు రుణమాఫీ హామీ ఇచ్చి రైతులను ఆకర్షించిన చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టాక తప్పదన్నట్టుగా కొంతమొత్తాన్ని విది ల్చారు. అదికూడా రైతులకు పూర్తిగా అందలేదు. తరచూ నిబంధనల్ని మారు స్తూ.. ఎట్టకేలకు జిల్లాలోని సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల ద్వారా 4.55 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేల్చారు. వారికి రెండు విడతలుగా రూ.1,550 కోట్లను మాఫీ చేయాల్సి ఉండగా, రూ.488 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని బాండ్ల రూపంలో రైతులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు. మరోవైపు ప్రభుత్వం డొంక తిరుగుడు వ్యవహారం చేయడంతో జిల్లాలో 30 శాతం మంది రైతులకు మాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమ కాలేదు. రైతుల కష్టాలెన్నో.. రుణమాఫీకి అర్హత పొందని రైతులు పైసాకూడా దక్కక అల్లాడుతుంటే.. అర్హత సాధించిన రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. కొంత పొలంపై సొసైటీలోను, మరికొంత పొలంపై వాణిజ్య బ్యాంకుల్లోను రుణాలు తీసుకున్న రైతులు మాఫీ కోసం అవస్థలకు గురవుతున్నారు. సొసైటీలో తీసుకున్న రుణానికి సంబంధించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై స్టాంప్ వేయించుకు రావాలని వాణిజ్య బ్యాంకు అధికారులు, వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి ఆ బ్యాంక్ స్టాంప్ వేయించాలని సొసైటీలు కోరడంతో రైతులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. మరోవైపు నిమ్మ, అరటి వంటి దీర్ఘకాలిక పంటలు వేసిన ఉద్యాన రైతులు రుణమాఫీకి అనర్హులుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదిలావుండగా, మూడో విడతలోనూ రుణమాఫీకాని రైతులంతా తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిం చింది. దీంతో రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 9,796 మంది రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేక కౌంటర్లలో రైతుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులను మూటగట్టి మూలన పడేయటం తప్ప ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరికి రుణమాఫీ అవుతుందా లేదా అన్నది సందేహంగానే ఉంది. రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో బకాయిలు చెల్లించని రైతులపై అధిక వడ్డీల భారం పడుతోంది. మరోవైపు కొత్త రుణాలు అందక అల్లాడిపోతున్నారు. రుణమాఫీ పేరిట ప్రభుత్వం చేసిన మోసాన్ని తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.