breaking news
lilium
-
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు
విమానం నడిపిన అమ్మాయిలను చూస్తున్నాం. విమానంలో యుద్ధం చేసే అమ్మాయిలనూ చూశాం. ఇప్పుడు... విమానాలు తయారు చేస్తున్న అమ్మాయిని చూద్దాం. వల్లూరి సుధీర ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్. జర్మనీలోని లిలియుమ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలో మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్. ఆ కంపెనీ స్థాపించిన తర్వాత ఉద్యోగంలో చేరిన వంద మంది ఇంజనీర్లలో ఒకే ఒక యువతి ఆమె. సెలవు మీద హైదరాబాద్‌కి వచ్చిన సుధీర ఈ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని, ఏరోస్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్ విభాగంలో తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన! ‘‘మా తాతయ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్‌గా పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో ఉద్యోగం చేశారు. అమ్మమ్మ అదే డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా భువనేశ్వర్‌లో రిటైర్ అయ్యారు. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావడానికి డైరెక్ట్‌గా ప్రభావితం చేయలేదు, కానీ పరోక్షంగా వారి నేపథ్యం నాకు మంచి భరోసానిచ్చింది. నిజానికి మా అమ్మానాన్నలిద్దరి మూలాలూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులోనే ఉన్నాయి. అమ్మానాన్న హైదరాబాద్‌లో సెటిల్ కావడంతో నా బాల్యం భాగ్యనగరంలోనే. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. పైలట్ల కోసం ప్రకటన అది. అయితే మగవాళ్లకు మాత్రమే. అప్పుడు ‘అమ్మాయిలెందుకు వద్దు’ అనిపించింది. అమ్మాయిలు విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదవరా అని కూడా అనుకున్నాను. నేను ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మానాన్న పెద్దరికపు సవరణలేమీ చేయకుండా నన్ను నేను కోరుకున్న కోర్సులో చేర్చారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్‌లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అప్పట్లో నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి ఆర్మీలో పని చేయాలని ఉండేది. పరీక్షలు రాశాను, కానీ సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఆదిభట్లలో ఉన్న ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీ మా క్యాంపస్‌కి ప్లేస్మెంట్ గురించి వచ్చింది, అలా 2012లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ప్రొడక్షన్ ప్లానింగ్, కంట్రోల్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా చేయడంతో పని మీద మంచి పట్టు వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలని, అది కూడా మాన్యుఫాక్చరింగ్లోనే చేయాలనుకుని యూఎస్‌లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. కోర్స్ పూర్తయిన తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశాను. అది బిజినెస్ జెట్లు తయారు చేసే కంపెనీ. ఇప్పటి వరకు నాది చాలా మామూలు జర్నీనే. 2017లో పెళ్లి, అబ్బాయి నాకు బీటెక్ క్లాస్మేటే. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఏవియేషన్ ఆఫీసర్. పెళ్లి తర్వాత ఇండియాలో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందట నేను మాత్రమే జర్మనీలో ‘లిలియుమ్ ఎయిర్ క్రాఫ్ట్’ కంపెనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో అప్పుడు... అంటే 2018లో వందమంది ఇంజనీర్లలో అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఆ గుర్తింపు నాకు పెద్దగా సంతోషాన్నివ్వదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది జెండర్ సెపరేషన్తో కూడిన గుర్తింపు కాదు. వందమందిలో యాభై మంది అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మా కంపెనీలో ఎనిమిది వందల మంది ఇంజనీర్లున్నారు, వారిలో వందమంది వరకు అమ్మాయిలున్నారు. ఈ నాలుగేళ్లలో వచ్చిన పురోగతి. ఈ ఫీల్డ్‌లో అమ్మాయిలు నెగ్గుకురావడం కష్టమనేది అపోహ మాత్రమే. నేనిప్పుడు మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్‌ని. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి సెలెక్ట్ చేసుకోగలిగాను. మా టీమ్‌లో పోలండ్, బ్రెజిల్, యూకే, యూరప్ దేశాల వాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసి పని చేయడం, వాళ్ల నుంచి పని తీసుకోవడంలో ఎక్కడా ఇబ్బందులేవీ రాలేదు. అయితే ఒక టాస్క్ ఇచ్చే ముందు వాళ్ల బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్‌ని అర్థం చేసుకోగలిగితే టీమ్‌తో పని చేయించుకోవడం ఏ మాత్రం కష్టంకాదనేది నా అభిప్రాయం. నేను టీమ్ లీడర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది మహిళలను చూశాను, వారితో పనిచేశాను కూడా. మిగిలిన అన్ని రంగాల్లోలాగానే ఈ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారు’’ అన్నారు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ వల్లూరి సుధీర. సబ్జెక్ట్‌ని నిరూపించుకోవాల్సిందే! ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ వంటి సాంకేతికత ఎక్కువగా ఉంటే రంగాల్లో టెక్నికల్ పీపుల్‌తో పని చేసేటప్పుడు వాళ్లు ఆడవాళ్ల మాటను పట్టించుకోరనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే... యంగ్ ఇంజనీర్కంటే సీనియర్ టెక్నీషియన్‌కి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త మార్పును తెచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్‌కి మనం విషయమంతా వివరించేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మనం ఒక అడుగు ముందున్నామనే విషయాన్ని నిరూపించుకోవాలి. ఈ నిరూపణ మగవాళ్లకైనా ఉంటుంది, ఆడవాళ్లకూ ఉంటుంది. నేను మహిళలకు చెప్పే మాట ఒక్కటే... మనల్ని మనం ‘ఇంజనీర్, సైంటిస్ట్, పైలట్’ అని ప్రొఫెషన్పరంగా మాత్రమే గుర్తించుకోవాలి, ‘ఉమన్ ఇంజనీర్, ఉమన్ పైలట్, ఉమన్ సైంటిస్ట్’ అని జెండర్‌పరంగా కాదు. అన్ని పరీక్షలనూ మగవాళ్లతోపాటు పూర్తి చేసి ఈ స్థాయికి వచ్చాం. రిజర్వేషన్లలో రాలేదు. ఇక ఉమన్ అని జెండర్‌తో ఐడింటిఫై అవడం ఎందుకు? – వల్లూరి సుధీర, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ – వాకా మంజులారెడ్డి -
రెండేళ్లలో రెక్కల కార్లు
ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఆ మధ్య వచ్చిన తెలుగు సినిమా పాట ఇది. భూమ్మీద చాలామంది ఆశ కూడా ఇదే.. ఎగిరే కార్లు వచ్చేస్తే ఎంత బాగుంటుంది అని! వాటి మాటేమిటోగానీ.. ఇంకో మూడేళ్లలో ఎగిరే ట్యాక్సీలైతే గ్యారెంటీ అంటోంది లిలియం! జర్మనీకి చెందిన కంపెనీ ఇది. ఫొటోలో కనిపిస్తున్న ఎగిరే ట్యాక్సీని ఈమధ్యే విజయవంతంగా ప్రయోగించింది లిలియం! అబ్బో ఇలాంటివి చాలా చూశాం గానీ.. దీని స్పెషాలిటీస్ ఏమిటో అంటున్నారా? ఫస్ట్... ఇది పూర్తిగా విద్యుత్తుతో నడుస్తుంది. అంటే.. కాలుష్యం అస్సలు ఉండదన్నమాట. సెకండ్ .. పార్క్ చేసిన చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. విమానాలు, కొన్ని రకాల ఎగిరే కార్ల మాదిరిగా రన్‌వే లేకుండానే కావాల్సిన చోటికి చెక్కేయవచ్చు. ధర్డ్... మొదటి, రెండు ప్రత్యేకతల కారణంగా దీంట్లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఫోర్త్.. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు.. దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అది కూడా గంటకు 300 కి.మీల వేగంతో! దీనర్థం... హైదరాబాద్ నుంచి ఇటు అదిలాబాద్.. అటు విజయవాడ గంటలో చేరుకోవచ్చు. ఫిఫ్త్.. ఒక్కో దాంట్లో ఐదుగురు ప్రయాణించవచ్చు కాబట్టి.. ఫుల్ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇంకో విషయం. పైలట్ అవసరం కూడా లేకుండా డ్రోన్ మాదిరిగా ఎగురుతుంది ఇది. సరేగానీ ఎలా పనిచేస్తుంది అంటారా? కారు ముందు, వెనుక భాగాల్లో ఉన్న రెక్కలాంటివి చూశారుగా.. దాంట్లోనే 36 ఫ్యాన్ల వంటివి ఉన్నాయి కదా.. వాటిని విద్యుత్ మోటార్ల సాయంతో స్పీడ్‌గా తిప్పితే చాలన్నమాట. నిట్టనిలువుగా పైకి ఎగిరేందుకు.. ఆ వెంటనే ముందుకు దూసుకెళ్లేందుకు తగిన విధంగా వీటి దిశ మార్చుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఫ్యాన్ పాడైనప్పటికీ దాని ప్రభావం మిగిలిన వాటిపై పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఇదేదో బాగానే ఉందే.... ఎప్పుడు వస్తుందో అనేనా మీ డౌట్.. తొలి ప్రయోగం సక్సెస్ అయింది. 2019కి ప్రయాణీకులతో, మరికొన్ని ఇతర పరీక్షలు పూర్తి చేసి 2020 నాటికల్లా మార్కెట్లోకి తెస్తామంటోంది లిలియం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇంట్లో నుంచే ఎగిరే విమానం
విమానంలో ప్రయాణించాలంటే విమానాశ్రయాలకు వెళ్లాల్సిన పనిలేదు. కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు ఇంట్లో నుంచే ఎక్కడికైనా ఎగిరిపోవొచ్చు, తిరిగి ల్యాండ్ అవ్వొచ్చు. విమానాలకు ఎంతో ఖర్చుతో కూడిన ఇంధనం అవసరమౌతుంది, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా?..ఇంట్లో మనం సాధారణంగా వాడే కరెంట్ సాకెట్ నుంచే ఛార్జింగ్ చేస్తే చాలు గాల్లో హాయిగా చక్కర్లు కొట్టి రావొచ్చు. నలుగురు జర్మన్ ఇంజనీర్లు కలిసి ఇంట్లో నుంచే గమ్యస్థానాలకు చేరే కొత్త రకం మినీ విమానం 'లిలియం' డిజైన్‌ను చూస్తే 2018 వరకు ఇది సాధ్యమయ్యేదిలానే కనిపిస్తుంది. రెండు సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త ఆల్ట్రాలైట్ చిన్న విమానం లిలియం. ఇది ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు. లిలియం స్టార్టప్‌ను మునిచ్ యూనివర్సిటీ విద్యార్థులు..డానియల్ వీగాండ్, పాట్రిక్ నాథన్, సెబాస్టియన్ బోర్న్, మాథియాస్ మీనర్లు కలిసి ప్రారంభించారు. యూరోపియన్ స్పెస్ ఏజెన్సీలో(ఈఎస్ఏ) బిజినెస్ ఇంక్యుబేటర్‌లో లిలియం ప్రాజెక్టును హోస్ట్ చేశారు. 'వీగాండ్ తమ కాన్సెప్ట్‌ను ప్రాక్టికల్‌గా వివరించారు..వాతావరణానికి కలిగే లాభాలను వివరించారు. ఎలక్ట్రిక్ ఇంజిన్లను వాడటం వల్ల తక్కువ శబ్ధం ఉద్గారమవ్వడంతో పాటూ వాతావరణానికి ఎలాంటి హానీ జరగదు' అని ఈఎస్ఏ తెలిపింది. రోజూ వారి అవసరాల కోసం ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తున్నట్టు దీని డిజైనర్లలో ఒకరు డానియల్ వీగాండ్ తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడిన భారీ ఎయిర్ పోర్టుల అవసరం లేకుండానే ఈ విమానం సునాయాసంగా ఎగిరిపోతుంది. ఇంట్లోనే విమానానికి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇంకా నిర్మాణదశలోనే ఉన్న ఈ గుడ్డు ఆకారంలో ఉండే లిలియం విమాన అమ్మకాలు 2018 ఏడాది వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని దీని డిజైనర్లు చెబుతున్నారు. గరిష్టంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ విమానం.. గంటకు 400కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. 'లిలియం ఇంజన్లలో ఉపయోగించే టెక్నాలజీతో జెట్ విమానాలు, హెలీకాప్టర్లలో వచ్చే శబ్ధాలకన్నా చాలా రెట్లు తక్కువ వస్తుంది. దీనికి ఇంట్లో వాడే సాకెట్‌తోనే ఛార్జింగ్ చేయోచ్చు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయాల్లో మాత్రమే దీంట్లో ప్రయాణించొచ్చు' అని వీగాండ్ తెలిపారు. లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కేటగిరికి చెందిన దీన్ని నడపడానికి పైలెట్ లైసెన్స్ ఉండి కేవలం 20 గంటల ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. దీని ధర విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకపోయినా..ఇప్పటికే ఉన్న మినీ విమానాలకంటే తక్కువకే ఇది లభిస్తుందని ఈఎస్ఏ తెలిపింది.