breaking news
light of Islam
-
నిరుపేదలూ ఇఫ్తార్ ఇవ్వొచ్చు
ఇస్లాం వెలుగు ‘రమజాన్’ అత్యంత శుభప్రదమైన, పుణ్యప్రదమైన మహామాసం. ఈ పవిత్ర మాసం మరికొన్ని రోజులు ఉందనగానే మమతలమూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) విశ్వాసుల సమాజాన్ని మానసికంగా సమాయత్త పరిచే వారు. ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిగా పొందగలిగే వాతావరణాన్ని సృష్టించేవారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి రమజాన్ ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను ప్రజలకు బోధ పరిచేవారు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) షాబాన్ మాసం చివరి తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ప్రజలారా! ఒక మహత్తరమైన, శుభప్రదమైన పవిత్రమాసం (రమజాన్) తన ఛాయను మీపై కప్పబోతోంది. ఆ పవిత్రమాసంలోని ఒక రాత్రి వెయ్యి మాసాలకన్నా శ్రేష్ఠమైనది. ఆ మాసం ఉపవాసాలను అలా్లహ మీకు విధిగా చేశాడు. అలాగే ఈ మాసంలో ఒక విధిని నెరవేరిస్తే ఇతర కాలంలో 70 విధులు నిర్వహించిన దానితో సమానంగా పుణ్యం లభిస్తుంది. ఎవరైనా ఈ మాసంలో (దైవ ప్రసన్నత, పుణ్యఫలాపేక్షలతో) ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే అతని పాపాలు క్షమించబడతాయి. నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. అతనికి ఉపవాసం ఉన్నవారితో సమానంగా పుణ్యం కూడా లభిస్తుంది. అలాగని ఉపవాసం పాటించే వ్యక్తి పుణ్యఫలంలో ఏ మాత్రం కొరత కలగదు’’ అని చెప్పారు. అప్పుడు ప్రజలు ‘‘దైవ ప్రవక్తా! మాలో ప్రతి ఒక్కరికీ ఇఫ్తార్ చేయించేటంత స్తోమత లేకపోతేనో?’’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త మహానీయులు, ‘‘కొద్ది మజ్జిగతో లేక గుక్కెడు మంచినీటితో ఇఫ్తార్ చేయించినా దైవం అతనికి కూడా అదే పుణ్యం ప్రసాదిస్తాడు’’ అని చెబుతూ, తన ప్రసంగాన్ని కొన సాగించి, ఇలా అన్నారు. ‘‘ఎవరైనా ఒక రోజె దారుకు (ఉపవాసికి) కడుపు నిండా భోజనం పెడితే అతనికి అల్లాహ్ నా హౌజు (కౌసర్ కొలను) నుండి తనివి తీరా తాగిస్తాడు. తర్వాత ఇక అతనికి ఎప్పటికీ దాహం వేయదు. చివరికతను స్వర్గంలో ప్రవేశిస్తాడు’’ అని చెప్పాడు. అంతేకాదు, ‘‘ఈ మాసంలోని మొదటి భాగం కారుణ్యం, మధ్యభాగం క్షమాపణ (మన్నింపు), చివరి భాగం నరకాగ్ని నుండి విముక్తి ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో తమ సేవకుల పనిభారాన్ని తగ్గిస్తారో, అల్లాహ్ వారిని క్షమిస్తాడు. వారికి నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదిస్తాడు’’ (బైహఖీ-ఈమాన్ అధ్యయం) అని చెప్పారు. ఇలా పవిత్ర రమజాన్‌కు సంబంధించి కారుణ్యమూర్తి ముహమ్మద్(స) మనకు బోధించిన అమృత వచనాలు. అందుకని ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిస్థాయిలో పొందడానికి ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దైవంతో సంబంధం పటిష్ట పరచుకోవాలి. ఆర్థిక స్తోమతను బట్టి వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేస్తుండాలి. సమాజంలోని అభాగ్యులను ఏమాత్రం విస్మరించకూడదు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
రోజా, ఖురాన్... దేవుడి వరాలు
ఇస్లాం వెలుగు ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం. ఇది పవిత్ర రమజాన్ మాసం. దైవ విశ్వాసుల పాలిట వరాల వసంతం. అందుకే దైవ విశ్వాసులంతా ఈ పవిత్రమాసంలో ఉపవాస వ్రతం పాటిస్తారు. ఇది సృష్టికర్త తరఫున మోపబడిన విధి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ ఇలా వివరిస్తోంది: ‘‘విశ్వాసులారా! గత ప్రవక్తల అనుయాయులకు ఏ విధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అలాగే ఇప్పుడు మీరు కూడా ఉపవాసాలు ఆచరించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’’ (2-183). దైవం పట్ల భయభక్తులు ఉన్నప్పుడే మనిషి అన్ని రకాల చెడులనూ, దుర్మార్గాలను విసర్జించి మంచిని స్వీకరిస్తాడు. ప్రతి మనిషీ మరణానంతరం ప్రపంచంలో తాను చేసుకున్న కర్మలకు పరలోకంలో విశ్వ ప్రభువు ముందు సమాధానం చెప్పుకోవలసి ఉన్నందున ఆ ప్రకారమే ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుంది. విశ్వాసి మదిలో నిరంతరం మెదిలే ఈ భావనే దైవభీతి. ఇలాంటి భయభక్తులు కలిగిన మనిషి సమస్త చెడులకు, పాపాలకు దూరంగా ఉంటూ సదాచార సంపన్నుడై సదా పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం గడుపుతాడు. పై వాక్యంలో రమజాన్ ఉపవాసాల అసలు ఉద్దేశం ‘దైవభీతి’ లేక ‘దైవభక్తులు’ అని తెలియజేయబడింది. అంటే రమజాన్ మాసంలో ఆచరించే ఉపవాసాలు మనిషిలో భయభక్తుల్ని జనింప జేసి, ఆ భావనలను పటిష్టం చేసే శిక్షణ ఇస్తాయన్నమాట. దైవం విశ్వాసులకు రమజాన్ ఉపవాసాలు పాటించాలని ఆజ్ఞాపించిన ఉద్దేశంలో దైవభీతితో పాటు, కృతజ్ఞత తెలియజేసుకోవడం కూడా ఉంది. అంటే, దైవం రమజాన్ మాసంలో మానవుల జీవితాలను సమూలంగా సంస్కరించి వారికి ఇహ పర సౌభాగ్యాలు అనుగ్రహించే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని కూడా అవతరింపజేసినందుకు వారాయనకు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. ‘‘దైవం మీకు రుజుమార్గం చూపినందుకు ఆయన ఔన్నత్యాన్ని కొనియాడడానికి, ఆయనకు కృతజ్ఞులై ఉండేందుకు గాను ఈ సౌలభ్యం ప్రసాదించాడు’’ (2-185). రమజాన్ ఉపవాసాలు పాటించడం ద్వారానే మనం దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోగలుగుతాం. ఈ పవిత్ర మాసంలో ఒక విశ్వాసి శక్తి ఉండి కూడా ఉపవాసాలు పాటించడం లేదంటే, అతడు దైవం చేసిన మేలును మరిచిపోయి ఆయనకు కృతఘు్నడై పోయాడని అర్థం. అ కృతఘ్నతా పర్యవసానాన్ని అతడు పరలోకంలో చవిచూడవలసి ఉంటుంది. కనుక ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం. అలా కాకుండా మిగతా మాసాలకు లాగానే రమజాన్‌ను కూడా నిర్లక్ష్యంగా గడిపేస్తే అంతకంటే దౌర్భాగ్యం మరేమీ ఉండదు. దైవం సమస్త మానవాళికీ సన్మార్గ భాగ్యం ప్రసాదించాలని, పరలోకంలో ఉన్నత స్థానాలు అనుగ్రహించాలనీ కోరుకుందాం. - యం.డి. ఉస్మాన్‌ఖాన్