breaking news
laxmana swamy
-
జాబు రాలేదని దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ తీరుతో కొలువు దొరక్క, బతికేందుకూ ఏ ఆసరా లేక, కుటుంబాలకు భారంగా మారలేక నిరుద్యోగ యువత మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ నిరుద్యోగ దివ్యాంగుడు కర్నూలు కలెక్టరేట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కోసం సీఎం చంద్రబాబు వద్దకు నాలుగు సార్లు వెళ్లి గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో లక్ష్మణస్వామి అనే దివ్యాంగుడు గురువారం ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. బేతంచెర్ల మండలం రేపల్లెకు చెందిన లక్ష్మణస్వామి 2009లో డిగ్రీ (బీఏ) పూర్తి చేశాడు. పై చదువులు చదివే స్తోమత లేక, కుటుంబానికి భారం కావడం ఇష్టం లేక ఉద్యోగం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కనీసం స్వయం ఉపాధి కోసమయినా ప్రభుత్వ సాయం తీసుకోవాలనుకున్నాడు. అతికష్టమ్మీద అమరావతికి వెళ్లి సీఎం చంద్రబాబును నాలుగుసార్లు కలిశాడు. ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు. అయినా ఎలాంటి ఫలితమూ లేదు. పైగా 80 శాతానికి పైగా వైకల్యమున్నా.. ఉద్దేశపూర్వకంగానే తక్కువ చూపి రూ.1,500 పింఛన్‌ను కూడా ఎగవేశారు. లక్ష్మణస్వామికి వివాహం కూడా అయ్యింది. ఇద్దరు కుమారులు. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలా ఇంకెన్నాళ్లు బతకాలంటూ తీవ్రవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని జేడీఏ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ దగ్గర్లో ఉన్న ఉద్యోగులు వెనక్కి లాగేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని డీఆర్వో వెంకటేశం వద్దకు తీసుకెళ్లారు. లక్ష్మణస్వామి బాధ విన్న డీఆర్వో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. తర్వాత పట్టించుకోలేదు ‘ఇంటికో జాబు ఇస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. దివ్యాంగులం ఉన్నత చదువులు చదువు కొని ఉపాధి కోసం నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించా’ అని లక్ష్మణస్వామి వాపోయాడు. -
లక్ష్మణ స్వామికి లాకెట్
భద్రాచలం : భద్రాద్రి ఆలయంలో శ్రీసీతారామలక్ష్మణ సమేతంగా జరిపే నిత్య కల్యాణోత్సంలో గురువారం లక్ష్మణస్వామికి లాకెట్ అలంకరించారు. భక్తరామదాసు చేయించిన బంగారు ఆభరణాలతో పాటు, భక్తులు కానుకల రూపేణా ఇచ్చిన నగలు నిత్యకల్యాణోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరించడం ఆనవాయితీ. అయితే గత కొద్ది రోజులుగా లక్ష్మణస్వామి మెడలో బంగారు లాకెట్ వేయటం లేదు. ఈ విషయం పత్రికల ద్వారా బయటకు పొక్కటంతో దేవస్థానం అధికారులు మేల్కొన్నారు. కొక్కెం విరిగిపోవటంతో అలంకరించలేదని ఆలయాధికారులు చెబుతున్నప్పటికీ, దానిలో ఏదో గమ్మత్తు దాగిఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఆలయంలో రెండు బంగారు ఆభరణాలు మాయమైన విషయం తెలిసిందే. సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణస్వామి వారి లాకెట్ కనిపించలేదు. తిరిగి పది రోజులు తర్వాత దొరికినప్పటికీ, ఆ అభరణాన్నే బుధవారం దాకా లక్ష్మణస్వామికి అలంకరించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారు ఆభరణాల మాయంపై ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. అర్చకుల మధ్య మాటల యుద్ధం లక్ష్మణస్వామికి బంగారు లాకెట్ అలంకరించకపోవడంపై దేవస్థానం ఈఓ రమేష్‌బాబు తీవ్రంగానే స్పందించారు. కొంతమంది అర్చకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే ఈ పరిణామాలు అర్చకుల మధ్య విభేదాలకు దారితీశాయి. గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఇద్దరు అర్చకుల మధ్యమాటల యుద్ధం కొనసాగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘దేవస్థానం పరువు పోవడానికి నీవే కారణమని, నీవు ఇక్కడి నుంచి వెళ్లిపోతేనే ఆలయం బాగుపడుతుందని’ బంగారు ఆభరణాలు పోయిన నాటినుంచి తీవ్ర మధనపడుతున్న ఓ అర్చకుడు మరో అర్చకుడిపై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈఓ రమేష్‌బాబు వారిని సమన్వయపరిచినట్లుగా తెలిసింది. ఇటువంటి పరిణామాలు ఆలయపాలనను ఎత్తిచూపుతున్నాయి. భద్రాద్రి ఆలయంలో జరుగుతున్న ఇటువంటి వ్యవహారాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.