పింఛన్.. వస్తలేదు!
3 నెలల నుంచి పెన్షన్ రాక వృద్ధ కళాకారుల తిప్పలు
నిధులు లేవంటూ నిలిపివేత ఠ 3 వేల మందికిపైగా ఇబ్బందులు
హైదరాబాద్: గజ్జె కట్టిన ఆ కాలు తడబడుతోంది.. డప్పు కొట్టిన ఆ చేతులు వణుకుతున్నాయి.. ఉద్యమ గీతాలు ఆలపించిన ఆ గొంతు జీరబోతోంది.. వృద్ధాప్యం మీద పడడంతో ఆ కళాకారులంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు సాయంపైనే ఆధారపడ్డ ఆ వృద్ధ కళాకారులు.. మూడు నెలల నుంచి పెన్షన్లు అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల మందికి పైగా కళాకారుల తిప్పలివీ! బడ్జెట్ లేని కారణంగా చెల్లింపులు నిలిపేయాలని ప్రభుత్వం నుంచి సాంస్కృతిక శాఖకు మార్చిలో ఆదేశాలు వచ్చాయి. ఫలితంగా వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఆగిపోయాయి.
తెలంగాణలో మొత్తం 3,254 మంది వృద్ధ కళాకారులకు నెలనెలా ప్రభుత్వం పింఛన్ అందజేస్తోంది. ఇంతకుముందు రూ.500 ఉన్న ఈ మొత్తాన్ని సీఎం కేసీఆర్ రూ.1,500కి పెంచారు. పింఛన్‌కు అర్హులైన వృద్ధ కళాకారుల జాబితా పంపాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ గతంలో జిల్లాల్లోని డీపీఆర్వోలను ఆదేశించింది. డీపీఆర్వోలు జాబితాను పంపినా.. ఇప్పటిదాకా 70 శాతం మంది వివరాలే అందాయి. వారికి మాత్రమే సాంస్కృతిక శాఖ పింఛన్ అందజేస్తోంది. అయితే నిధుల కొరతను కారణంగా చూపుతూ వీరికి మూడు నెలల నుంచి పెన్షన్లు ఇవ్వడం లేదు. మరోవైపు ఇంకా 30 శాతం మంది కళాకారుల వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో.. వారికి ఎలాంటి పింఛన్ అందడం లేదు. వారంతా డీపీఆర్వోలు, హైదరాబాద్‌లోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు.
‘‘మూడు నెలలు పూర్తవుతున్నా.. ఇంతవరకు పింఛన్ ఇయ్యలేదు. డీపీఆర్వోను అడిగితే రేపు మాపు వస్తాయని, పైసలు లేవని అంటుండ్రు. పైసల్లేక శానా తిప్పలుపడుతున్న. పింఛన్ పైసలతోనే మందు గోలీలు కొనుక్కుంటా. కాలం లేదు.. పంటల్లేవు.. ఏమీ లేవు.. ఇంట్లో వాళ్లను అడిగి ఇబ్బంది పెట్టలేను. సీఎం కేసీఆర్ దయచూపాలే’’
- చుక్క సత్తయ్య, ఒగ్గు కథ దిగ్గజం, మాణిక్యాపురం, వరంగల్
పైసలు వస్తేనే బుక్క దొరకుతది..
కళ్లు కనిపిస్తలేవు. రెక్కలు మూలకు పడ్డయ్. పింఛను పైసలు వస్తేనే బుక్క దొరకుతది. మూడు నెల్లైంది. ఇంకా రాలేదు. జనగామ బ్యాంక్‌కు పోయి వచ్చినప్పుడల్లా రూ.50 ఖర్చు అయితున్నయ్. ఇక్కడ ఎవరిని అడిగిన ఏమీ తెలువదు. బ్యాంక్‌కు పోయి వస్తనే.. వచ్చినయ్ లేనియ్ తెలుస్తది. పెద్దోళ్లు రోజూ ఎంతో ఖర్చు పెడుతుండ్రు. మాకివ్వడానికే పైసల్లేవా? - ముగ్గు యాదగిరి. శార్తఖాన్ కళాకారుడు, కళ్లెం, వరంగల్
పైసా ఇవ్వలేదు..
‘‘ఏప్రిల్ 19 నుంచి విధుల్లో చేరాం. హైదరాబాద్‌లోని 18 సర్కిళ్లలో స్వచ్ఛ భారత్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, హరిత హారం, పుష్కరాలు, ఇప్పుడు బోనాలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇంత వరకు పైసా ఇవ్వలేదు. మా ఆకలి మంటలు ఎవరికి చెప్పుకోవాలి. జీతం ఎంత అనేది ఇప్పటికీ నిర్ణయించలేదు’’ - సాంస్కృతిక సారథి కళాకారుల గోడు
మాకు పింఛనే ఆధారం..
మాకు గీ పింఛన్ ఒక్కటే ఆధారం. నెలకు ఇచ్చే రూ.1500తోనే ఏమైనా చేసుకుంటాం. నెలనెలకు వస్తే బాగుండు. ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తరు. ఎవ్వర్ని అడుగలేని పరిస్థితి. పెద్దోళ్లు కస్తా దయజూపాలె - సిరిగిరి బాలనర్సయ్య, వరంగల్
నాకు తెలియదు..
రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు పింఛన్ మూడు నెలలుగా అందని విషయం నాకు తెలియదు. రాలేదని ఎవరన్నారు? సాంస్కృతిక డెరైక్టర్ ఈ విషయాన్ని చూసుకోవాలి. - బీపీ ఆచార్య, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి.