breaking news
Land mortgage
-
నిన్న తనఖా.. నేడు వేలం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) అధీనంలో ఉన్న సుమారు 400 ఎకరాలకు పైగా భూమిని వేలం వేయడం ద్వారా రూ.25 వేల కోట్లు సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఐసీఐసీఐ బ్యాంకుకు సెక్యూరిటీ బాండ్ల రూపంలో తనఖా పెట్టిన భూమికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మాస్టర్ ప్లాన్ లే ఔట్ రూపొందించి దశలవారీగా వేలం వేయడం ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ తయారీ, వేలంలో సహకారం అందించేందుకు ‘ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కన్సల్టెంట్’ ఎంపిక కోసం గత నెల 28న టీజీఐఐసీ ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ (ఆర్ఎఫ్పీ) జారీ చేసింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసేందుకు మార్చి 15వ తేదీని తుది గడువుగా పేర్కొంది. గతంలో ప్రభుత్వ గ్యారంటీతో ఐసీఐసీఐకి తనఖాటీజీఐఐసీ అధీనంలో ఉన్న భూములను తాకట్టు పెట్టడం ద్వారా రైతుభరోసా వంటి పథకాల అమలుకు అవసరమైన నిధుల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చబౌలిలోని 25(పీ) సర్వే నంబరులోని సుమారు రూ.20 వేల కోట్లు విలువ చేసే 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ‘క్యాపిటల్ ట్రస్ట్’ అనే మర్చంట్ బ్యాంకర్‌కు రూ.10 వేల కోట్ల రుణ సేకరణ బాధ్యతను అప్పగించింది. ఈ క్రమంలో 9.6 శాతం వడ్డీపై రుణం ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ముందుకు వచ్చింది. అయితే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలనే మెలిక పెట్టింది. ప్రభుత్వ గ్యారంటీతో తాకట్టు ద్వారా తీసుకునే రుణాలకు కూడా ‘ద్రవ్య బా«ధ్యత బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ వర్గాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ నిధుల అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది అక్టోబర్ 26న జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలపడంతో రుణ సేకరణ ప్రక్రియ పూర్తయింది.సెక్యూరిటీల విడుదలకు షరతులతో ఓకేరూ.20 వేల కోట్లకు పైగా విలువ కలిగిన భూములపై కొల్లేటరల్ సెక్యూరిటీ పెట్టి కేవలం రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రభుత్వం ఇప్పుడు పునరాలోచనలో పడింది. అవే భూములు వేలం వేస్తే రూ.20 వేల నుంచి రూ.25 వేల కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశముందనే అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వేలం వేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే తమకు కొల్లేటరల్ సెక్యూరిటీగా పెట్టిన భూములను వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ బాండ్లు విడుదల చేసేందుకు ఐసీఐసీఐ తొలుత నిరాకరించినట్లు తెలిసింది. అయితే తమకు నిధులు అత్యవసమని, కొల్లేటరల్ సెక్యూరిటీ బాండ్లను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. రుణం తీర్చేందుకు పదేళ్ల వ్యవధి ఉండటాన్ని, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో కొన్ని షరతులతో బాండ్ల విడుదలకు ఐసీఐసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఈఎంఐ డిపాజిట్‌కు అంగీకారం?భూ తనఖా ద్వారా తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం ప్రతినెలా రూ.100 కోట్ల మేర కిస్తీ (ఈఎంఐ) కింద చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు చెల్లించాల్సిన కిస్తీ సుమారు రూ.2,500 కోట్లు ముందస్తుగా డిపాజిట్ చేస్తేనే కొల్లేటరల్ సెక్యూరిటీ బాండ్లు తిరిగి ఇస్తామంటూ ఐసీఐసీఐ విధించిన షరతుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఓ వైపు సన్నాహాలు చేస్తూనే వేలం ప్రక్రియకు తెరలేపింది.గతంలో ఎకరం రూ.50 వేలకే విక్రయించిన చంద్రబాబు సర్కారుకంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25(పీ)లోని సుమారు 425 ఎకరాల భూమిని 2003లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల చొప్పున ‘ఐఎంజీ అకాడమీస్ భారత’ అనే సంస్థకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మంత్రివర్గ ఆమోదం, ఒప్పందం లేకుండానే అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. అయితే ఎంఓయూలో పేర్కొన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడంతో 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం భూమిని తిరిగి తీసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించింది. సుమారు రెండు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని గత ఏడాది ఆరంభంలో హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది -
ప్రభుత్వ రేటు ప్రకారమే ‘భూ’రుణాలు
పరిశ్రమల స్థాపన, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములపై ఇష్టారాజ్యంగా తనఖా రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నియంత్రించేలా భూకేటాయింపుల విధానంలో కొత్త నిబంధన చేర్చాలని రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఐ.వై.ఆర్.కృష్ణారావు ప్రతిపాదించారు. ‘పరిశ్రమల ఏర్పాటు కోసమంటూ ప్రజాప్రయోజనాల పేరిట తక్కువ ధరతో ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న సంస్థలు/వ్యక్తులు ఆ భూములను బహిరంగ మార్కెట్లో ఉన్న విలువ ప్రాతిపదికన తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. కొన్ని సంస్థలైతే తర్వాత బ్యాంకులకు డబ్బు చెల్లించటంలేదు. దీంతో బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఆభూములను వేలం వేసి అప్పులు జమ వేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రజాప్రయోజనం నెరవేరకపోగా ప్రభుత్వం భూమిని పోగొట్టుకుంటోంది. ఏదైనా సంస్థకు లేదా వ్యక్తికి ప్రభుత్వం ఎంత ధరకు భూమిని కేటాయిస్తుందో గరిష్టంగా అంత మొత్తానికే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇవ్వాలనే నిబంధన ద్వారా ఈ మోసాలను నియంత్రించవచ్చు. ప్రభుత్వం కేటాయించిన భూమి విలువను మాత్రం ప్రభుత్వానికి చెల్లించిన ధరనే గరిష్టంగా ప్రాజెక్టు రిపోర్టులో చూపించాలనే కొత్త నిబంధనను భూకేటాయింపుల పాలసీలో చేర్చాలి’ అని ఆంధ్రప్రదేశ్ భూమి నిర్వహణ అథారిటీ (ఏపీఎల్‌ఎంఏ) చైర్మన్ హోదాలో కృష్ణారావు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ఈ అంశంపై ‘సాక్షి’ సంప్రదించగా.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, భూ కేటాయింపుల లక్ష్యం నెరవేరాలంటే ఈ కొత్త నిబంధన చేర్చాల్సిన అవసరం ఉందని, అందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన విషయం వాస్తవమేనని సీసీఎల్ఏ చెప్పారు.