breaking news
land market
-
భూఫలహారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 358 ఎకరాల సర్కారు భూమి. 20 ఏళ్ల క్రితం వరకు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్న ఈ భూమి అసైన్డ్ రూపంలో కనుమరుగవడం మొదలైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌కు సమీపంలో ఉన్న 476 సర్వే నంబర్లోని ఈ భూమి గత కొన్నేళ్లుగా ఎక్కడికక్కడ కబ్జాకు గురైంది. ఇళ్ల నిర్మాణం కోసం ‘ఏదోలా’ గుంట, గుంటన్నరకు పట్టాలు తెచ్చుకోవడం.. దానికి రెండు మూడింతలు ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకోవడం పరిపాటిగా మారింది. దీంతో గత పదేళ్లలో ఈ భూమికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ యజమానులు తయారయ్యారు. అసైన్మెంట్ కమిటీతో సంబంధం లేకుండా తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు తలుచుకున్నదే తడువు... గుంటల కొద్దీ భూములకు పట్టాలు తయారయ్యాయి. రెండేళ్ల క్రితం వరకు సాగిన ఈ దందా అప్పటి కలెక్టర్ ఆదేశాలతో నిలిచిపోయినా తాజాగా మళ్లీ మొదలైంది. ఈ సర్వే నంబర్లోని 358 ఎకరాల భూమిలో కబ్జాలు పెరిగిపోయాయని, ఒకే కుటుంబం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇతర సభ్యులకు సైతం అసైన్మెంట్లు జరిగాయని పెద్దపల్లి జాయింట్ కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో కొందరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన జేసీ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మండల తహసీల్దార్ సంపత్ ను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికా రులు హుటాహుటిన ధర్మారం వెళ్లారు. సోమ, మంగళవారాల్లో మండల కేంద్రం లోనే భూరికార్డులను పరిశీలిస్తూ, అసైన్మెంట్, కబ్జా భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 1998 నుంచే పందేరం సర్వే నంబర్ 476లోని 358.07 ఎకరాల ప్రభుత్వ భూమిలో 1998–99 సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో స్థానికులైన ఎనిమిది మందికి ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో గుంటన్నర చొప్పున స్థలాలను కేటాయించారు. అక్కడి నుంచి మొదలైన భూపందేరం ఆగలేదు. ఎవరైనా అడిగిందే తడువుగా ఈ ప్రభుత్వ భూమిలో గుంటల కొద్దీ రాసిచ్చేశారు. అర్హుల పేరిట గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు సర్కారు భూమిని ఆక్రమించుకున్నారు. భూమి లేని పేదలు, అనాథల పేరుతో కొందరు అనర్హులకు సైతం ఎకరాల చొప్పున కట్టబెట్టారు. ఒక కుటుంబంలో ఒకరికి భూమి లభించగానే, ఆయన దగ్గరి బంధువులకు కూడా పేదల పేరిట ఇళ్ల కోసం స్థలాలు కేటాయిస్తూ పోవడంతో ఇప్పుడు సర్కారు భూమి ఎంత మిగిలి ఉందో కూడా రెవెన్యూ అధికారులకే తెలియని పరిస్థితి. రిటైర్డ్ అయిన తహసీల్దార్ల దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్స్ తయారు చేయించి కూడా ఇక్కడ భూములను కాజేశారనే ఫిర్యాదులు సైతం ఉన్నాయి. పదేళ్లలో ఇక్కడ తహసీల్దార్లుగా పనిచేసిన వారు, వీఆర్ఓల కనుసన్నల్లోనే విలువైన భూమి ఫలహారంగా మారిందని స్థానికులు చెపుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి మొదలు జెడ్పీటీసీ, ఎంపీపీ తదితర ప్రజాప్రతినిధుల నోటిమాటే వేదంగా భూపందేరం జరిగాయని సమాచారం. మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు ఉన్న ఎనిమిది గుంటల పట్టా భూమికి 4 గుంటల ప్రభుత్వ భూమిని కలుపుకున్నారని స్థానికులు బహిరంగంగానే చెబుతారు. పేదల కోసం గుంట, రెండు గుంటల భూమి కేటాయిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు 5 నుంచి 7 గుంటల వరకు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని పెద్దపల్లి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో జేసీ దీనిని అత్యంత ముఖ్యమైన ఫిర్యాదుగా భావించాలని ఆదేశిస్తూ తహసీల్దార్‌కు సిఫారసు చేశారు. మళ్లీ మొదలైన సర్వే! 476 సర్వే నంబర్లో ఉన్న సర్కారు భూమిలో నుంచి పేదలు, దళితులకు అసైన్డ్ చేసిన భూమి ఎంత? ఎలాంటి అసైన్మెంట్ ఆర్డర్ లేకుండా ఆక్రమణలోకి వెళ్లిన భూమి ఎంత అనే విషయాలను తేల్చేందుకు తహసీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కేటాయించిన భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా కొలతలు తీస్తున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ హద్దులు నిర్ణయించి, ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ సంపత్ తెలిపారు. -
పథకం సరే.. లక్ష్యం ఏదీ?
చిత్తూరు (టౌన్): భూమిలేని దళిత వ్యవసాయ కూలీల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టిన భూకొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్) జిల్లాలో చతికిలబడుతోంది. ఈపథకాన్ని 2013లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. అయితే తొలి ఏడాది(2013 -14)లో కేటాయించిన లక్ష్యాలను సాధించడంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పథకం బాగున్నప్పటికీ అమలు తీరులో లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది. భూమి మార్కెట్ రేటును పెంచిన ప్రభుత్వం భూ కొనుగోలు పథకం కింద పొలం కొనుగోలు చేసే యూనిట్ ధరను పెంచకపోవడంతో ఇస్తాననే రైతు లేడు, కొనుగోలు చేయడానికి ముందుకొచ్చే లబ్ధిదారుడు లేడు. దాం తో గత ఏడాది (2013-14) లక్ష్యసాధనలో ఎస్సీ కార్పొరేషన్ వంద శాతం వెనుకబడి ఉంది. పథకం కోసం కేటాయించిన కోట్లాది రూపాయల బడ్జెట్ మురుగుతోంది. అమలు చేయాల్సిన తీరిదీ.. ఈ పథకం అమలు కోసం జిల్లా స్థాయి కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కన్వీనర్‌గా, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, వ్యవసాయశాఖ జేడీ, గ్రౌండ్‌వాటర్ డీడీ, ఎల్డీఎం, సంబంధిత ఆర్డీవోలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల స్థాయి కమిటీల్లో ఎంపీడీవో చైర్మన్‌గా, తహశీల్దార్ కన్వీనర్‌గా, డీఆర్డీఏ ఏపీవో, వెలుగు వీవో, బ్యాం కు మేనేజర్లు సభ్యులుగా వ్యవహరించాల్సి ఉంది. వీరంతా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ పథకం అమలుపై లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉంది. అయితే జిల్లా స్థాయిలో గానీ, మండలాల్లో గానీ ఎక్కడా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు ముందుగా మండల కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులు జిల్లా కమిటీకి చేరుతాయి. మండల కమిటీ అనుమతి పొందిన వాటినే జిల్లా కమిటీ మంజూరు చేయాల్సి ఉంది. జిల్లా కమిటీ ద్వారా మంజూరైన యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసేందుకు బ్యాంకుకు సిఫారసు చేయాల్సి ఉంది. కానీ 2013-14 (గడచిన ఏడాది)లో వంద యూనిట్ల లక్ష్యం కాగా ఒకటి మాత్రమే దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తు కూడా సక్రమంగా లేకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్అధికారులు తిరస్కరించారు. చాలీచాలని యూనిట్ ధర రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు యూనిట్ ధరను పెంచకుండా భూములను కొనుగోలు చేయాలనుకోవడంతో ఇస్తానని ముందుకొచ్చే రైతు కనబడడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా ప్రభుత్వమిచ్చే డబ్బు చాలడం లేదు. దాంతో జిల్లాలో ఈ పథకం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో సైతం ఎకరా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ధర పలుకుతోంది. దాంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ కొనుగోలు పథకానికి కేటాయించిన యూనిట్ ధర చాలడం లేదు. పైగా రిజిస్ట్రేషన్ ఖర్చులకు కూడా దీన్నే వాడుకోవాల్సి ఉంది. దాంతో లబ్ధిదారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రామారావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా యూనిట్ ధర చాలడం లేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో భూముల ధరలు ఎక్కడ చూసినా ఎకరా రూ.10 లక్షలకు తక్కువ లేకుండా ఉందన్నారు. దానివల్ల లబ్ధిదారులకు భూమిని కొనివ్వడం సాధ్యం కావడం లేదన్నారు. అయితే ప్రభుత్వం మారినందున దీనిపై గైడ్‌లైన్స్ మారుతాయేమోనని చూస్తున్నట్టు తెలిపారు. గైడ్‌లైన్స్ మారకపోతే తామే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.