కొత్త ఉయ్యాల
ముదిగంటి సుజాతారెడ్డి ఆశపడ్డట్టు ఈనాటి ఆడవాళ్ల పరిస్థితినీ బతుకమ్మ పాటగా మార్చింది ఇంకో రచయిత్రి, అగిగిఅ ఇఅఖఉ ఫౌండేషన్ ఫౌండర్ లక్కరాజు నిర్మల. ‘కాలం మారింది.. స్త్రీ అంతరిక్షంలోకీ అడుగుపెట్టింది. అయినా ఆమె ఆంక్షల సంకెళ్లలో బందీనే. ఇంటా, బయటా యంత్రంలా పనిచేస్తున్న ఆధునిక బానిస. ఆత్మవిశ్వాసం ఆయుధంగా బయటకు వెళ్తున్నా నిర్భయ, అభయ సంఘటనలు ఆమెను భయపెడ్తూనే ఉన్నాయని’ ఆందోళన వ్యక్తం చేసిన నిర్మల.. ఆ వేదనకు బతుకమ్మ పాట రూపాన్నిచ్చారు.
హరి హరి ఓరామ ఉయ్యాలో.. ఆడదాని బతుకు ఉయ్యాలో
నను బతుకనీయవు ఉయ్యాలో.. నను సంపకండయ్య ఉయ్యాలో
కడుపున పడ్డనాడె ఉయ్యాలో.. కడతేర్తురు నన్ను ఉయ్యాలో
ఆడబిడ్డ పుట్టిననాడే ఉయ్యాలో... వడ్లగింజేతురు ఉయ్యాలో
సదువులకెళ్తేను ఉయ్యాలో.. సక్కదిద్దే పంతులు జెర్చె ఉయ్యాలో..
అన్నదమ్ములకైన ఉయ్యాలో... ఆటవస్తువునైతి ఉయ్యాలో..
అంగడి బొమ్మనై ఉయ్యాలో.. సినిమాల్ల పేపర్ల ఉయ్యాలో..
కోట్లు ఆర్జించిరి ఉయ్యాలో... నా బతుకు బండ్లవడ ఉయ్యాలో..
అన్నలు, అయ్యలు నను జెర్చిరి ఉయ్యాలో..
వావివరుసలు లేక ఉయ్యాలో.. తాగి ఊరేగిరి జనులు ఉయ్యాలో..
భర్త ఉన్నాకూడా ఉయ్యాలో.. నాకు రక్షణ కరువాయె ఉయ్యాలో..
పువురేకులా నన్ను ఉయ్యాలో... చిదిమిపారేతురే ఉయ్యాలో..
అమ్మను నేనురా ఉయ్యాలో... బాలుడైతే కననురా ఉయ్యాలో..
కాపుకాచి కాటేసె ఉయ్యాలో... నాయనలకు బుద్ధిసెప్పు ఉయ్యాలో...
అత్తింటి వారయిన ఉయ్యాలో.. ఆరళ్లు లేకుండి ఉయ్యాలో...
నీ పెనిమిటీ నీకు ఉయ్యాలో.. ఆదరించి సూడయ్య ఉయ్యాలో..
నీ ఇంటిదీపమే ఉయ్యాలో... నీ కంటిజ్యోతిరా ఉయ్యాలో..
ఆమె కన్నీళ్లకు ఉయ్యాలో... సిరులు కరిగిపోవునుయ్యాలో..
స్త్రీలుమెచ్చే పనులు ఉయ్యాలో... మెండుగ సేయుండ్రి ఉయ్యాలో..
ప్రగతినకు వచ్చు ఉయ్యాలో... పండగల అర్థమిదే ఉయ్యాలో..
జాగృతిని పరచంగ ఉయ్యాలో.. బంగారు తెలంగాణ ఉయ్యాలో..
బంగారు ఆడపిల్లలుయ్యాలో... రాజకీయంగా ఉయ్యాలో..
మహరాణులై మీరు ఉయ్యాలో.. సల్లంగ మముసూడ ఉయ్యాలో..
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో.. హరి హరి ఓ రామ ఉయ్యాలో...