మహిళా ఉద్యోగుల భద్రతకు కమిటీలు
సాక్షి, ముంబై: మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారి భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రైవేట్‌రంగ సంస్థలతోపాటు మాల్స్, కాల్ సెంటర్స్, హోటళ్లలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. కర్మాగార తనిఖీ అధికారులు, కార్మిక అధికారులు తమ తమ పరిధిలోని అన్ని సంస్థలకు మరికొన్ని రోజుల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులను జారీచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా పెద్ద సంస్థల్లో ఏర్పాటు చేసే కమిటీల్లో ఆ సంస్థ సీనియర్ మహిళలు అధికారులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఎన్జీవోలు, నిపుణులు ఈ కమిటీల్లో సభ్యులుగా వ్యవహరించనున్నారు. అంతేకాకుండా వీరు రోజూ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. 1997లో సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘విశాఖ గైడ్‌లైన్స్’ ప్రకారమే ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తాము ఇదివరకే ప్రైవేట్ కర్మాగారాలు, కార్యాలయాలతోపాటు డిపార్ట్మెంటల్ స్టోర్స్, కాల్ సెంటర్లలో కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించామని రాష్ట్ర కార్మిక మంత్రి హసన్ ముష్రిఫ్ చెప్పారు. మహిళా-శిశు సంక్షేమ, కార్మిక శాఖతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కమిటీలు ఏర్పాటు చేసుకోని సంస్థలకు జరిమానా విధించడమే కాకుండా వారి లెసైన్సులను పునరుద్ధరించబోమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా స్త్రీ-శిశు సంక్షేమ మంత్రి వర్షా గైక్వాడ్ మాట్లాడుతూ.. 50 మంది కంటే ఎక్కువగా మహిళా సిబ్బంది ఉన్న సంస్థలు విశాఖ గైడ్‌లైన్స్ ఆధారంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కాగా, 25,000 ప్రైవేటు సంస్థల్లో 2,000 మాత్రమే ఈ కమిటీలను ఏర్పాటు చేశాయని కార్మిక శాఖ పేర్కొందని ఆమె చెప్పారు. వాటిలో కొన్ని కమిటీలు మహిళా సిబ్బంది నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుకోకపోవడంతో పనిచేయడం లేదని ఆమె వివరించారు.