కుంభకోణంలో వందేళ్ల నాటి హోటల్
అదో చిన్న హోటల్. పేరు శ్రీ మంగళాంబికా విలాస్. తమిళనాడులోని దేవాలయాల నగరం కుంభకోణంలో ఉంది. అది ఈనాటిది.. ఆ నాటిది కాదు, ఏకంగా వందేళ్ల నాటి హోటల్. '1914 నుంచి' అనే ఓ చిన్న బోర్డు ఆ హోటల్ ఆది కుంభేశ్వరార్ ఆలయానికి వెళ్లే భక్తులందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం ఇడ్లీ, దోశ లాంటివాటిని మాత్రమే అమ్ముకుంటూ వందేళ్లకు పైగా వ్యాపారం సాగించడం అంటే సామాన్య విషయం కాదు. పైగా.. కుంభకోణంలో మిగిలిన రెస్టారెంట్లన్నీ పలు రకాల రుచులను అందిస్తూ, అద్భుతమైన కాఫీ ఇస్తుండగా శ్రీమంగళాంబికా విలాస్ మాత్రం ఇడ్లీ, దోశలతోనే ఇంకా బ్రహ్మాండంగా కొనసాగుతోంది.
నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఇడ్లీలు, కరకరలాడే దోశలు ఇక్కడ దొరుకుతాయి. కొబ్బరి చట్నీ, సాంబారుతో వేడివేడిగా అందిస్తారు. ఎవరైనా సరే, ముందు వద్దనుకున్నా, అరిటాకుల్లో అందించే ఆ ఇడ్లీలు, దోశల రుచి చూడగానే రెండు నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు. ఇక అక్కడ అందించే కాఫీ ఘుమఘుమల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైలు కూడా ఇక్కడకొచ్చి టిఫిన్లు తినకుండా వెళ్లరు. వాళ్లకు ఇక్కడ ప్రత్యేక హోదాలు, గౌరవ మర్యాదలు ఏమీ ఇవ్వరు. అందరిలాగే చూస్తారు. ఇక ఇక్కడ కూరలు, సాంబారు, రసం, పెరుగుతో అందించే భోజనం కూడా సింపుల్గా, కడుపు నింపేలా ఉంటుంది. అందుకే వందేళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరని ఆదరణతో ఈ హోటల్ నడుస్తోంది.