breaking news
Kota coaching centres
-
ఆ మరణాలపై ఆనంద్ మహీంద్రా ఆవేదన
కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్ రాష్ట్రం కోటా పట్టణంలో విద్యార్ధుల ఆత్మహత్యలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోటీ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయేమోనని భయం, ఫెయిల్ అవుతావేమోనన్న ఆందోళనలతో విద్యా కుసుమాలు రాలుతున్నాయి. తాజాగా, గంటల వ్యవధిలో విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 24 మంది విద్యార్ధులు అర్ధాంతరంగా తనువు చాలించారు. తమ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచేస్తున్నారు. ఈ తరుణంలో కోటా విద్యార్ధుల మరణాలపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులు గురవుతున్న ఒత్తిడిపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మీరేంటో నిరూపించుకోవడం కంటే.. మీ గురించి మీరు తెలుసుకోవాలని సూచించారు. ‘ఈ వార్త చూసి కలత చెందాను. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరం. పంచుకోవడానికి నా దగ్గర గొప్ప జ్ఞానం లేదు. కానీ మీ అందరికి (కోటా విద్యార్ధులను ఉద్దేశిస్తూ) ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ దశలో మీ లక్ష్యం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు గుర్తించడం. పరీక్షలో విజయం సాధించకపోవడం అనేది కేవలం స్వీయ అన్వేషణ ప్రయాణంలో భాగం. మీ నిజమైన ప్రతిభ మరెక్కడో ఉందని అర్థం. శోధిస్తూ ఉండండి, ప్రయాణం చేస్తూ ఉండండి. చివరికి ఎందులో ప్రతిభావంతులో మీరే గుర్తిస్తారు. అనుకున్నది సాధిస్తారు’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. I am as disturbed as you are by this news. Tragic to see so many bright futures being extinguished. I don’t have any great wisdom to share. But I would want to tell every student in Kota that your goal at this stage of life is not to prove yourself but to FIND yourself. Lack of… https://t.co/2zWUUnEE6X — anand mahindra (@anandmahindra) August 29, 2023 ఈ ఏడాది అత్యధికంగా పలు నివేదికల ప్రకారం..కోటా పట్టణం పోటీ ప్రవేశ పరీక్షలకు ప్రసిద్ధి. ప్రతి ఏడు ఆయా రాష్ట్రాల్లో పోటీ ప్రవేశ పరీక్షల్లో కోచింగ్ తీసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం కోటాలో దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు మూడు లక్షల మంది విద్యార్ధులున్నారు. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రులకు భారం కాకూడదని, లక్ష్యాన్ని చేరుకుంటామో? లేదో’నని ఒత్తిడికి గురవుతున్నారు. తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ధోరణి విద్యార్ధులు మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి ఎంత ప్రభావం చూపిస్తుందో అర్ధమవుతుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆగస్ట్ 27న (గత ఆదివారం), కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు విద్యార్థులు కొన్ని గంటల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం 2023లో ఇప్పటివరకు అత్యధికంగా ముక్కుపచ్చలారని 24 మంది విద్యార్ధుల జీవితాలు బలైపోయాయి. -
'చెల్లిని నచ్చిన కోర్సు చదవనివ్వండి'
'చెల్లిని నేనెప్పుడూ కూతురిలాగే ప్రేమించాను. చాలాబాగా చూసుకున్నాను. తననైనా తను నచ్చిన కోర్సును చదవనివ్వండి'.. ఇది కృతి త్రిపాఠి తన ఆత్మహత్య లేఖలో తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి. మంచి మార్కులతో ఐఐటీ-జేఈఈలో పాసైనప్పటికీ ఐదు అంతస్తుల భవనం మీద నుంచి దూకి కృతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.తన ఆత్మహత్యకు ముందు కృతి ఎంతో భావోద్వేగంతో తల్లిదండ్రులను ఉద్దేశించి ఐదుపేజీల లేఖ రాసింది. తనకు బీఎస్సీ చదువాలని ఉందని, కానీ తన తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చదువుమని బలవంతపెట్టారని ఆ లేఖలో తెలిపింది. తన తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేక తనెంతగా మథనపడిందో ఆమె లేఖలో తెలిపింది. ప్రస్తుతం జూనియర్ ఇంటర్ చదువుతున్న తన చెల్లి భవిష్యత్తైనా బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తున్నందుకు క్షమాపణలు చెప్పింది. తన చెల్లి ఏది చదువుతానంటే అదే చదివించమని తల్లిదండ్రులను ఆమె కోరింది.తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తల్లికి విజ్ఞప్తి చేసింది. తల్లిదండ్రుల అంచనాలు నిలబెట్టలేకపోతున్నానని క్షమాపణలు కోరింది. రాజస్థాన్ లోని కోటా పట్టణంలో గురువారం కృతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కోటా పట్టణం ఎస్పీ ఎస్ఎస్ గోదారా శనివారం ఆమె ఆత్మహత్య లేఖలోని వివరాలను మీడియాకు వెల్లడించారు. ఐఐటీ-జేఈఈ 2016 ఫలితాలలో కృతి త్రిపాఠికి 144 మార్కులు వచ్చాయని, కటాఫ్ మార్కుల కన్నా ఆమె 44 మార్కులు అధికంగా సాధించిందని ఆయన వెల్లడించారు. తమకు నచ్చిన కోర్సును చదువుకోవాలని కృతి మీద తల్లిదండ్రులు ఒత్తిడి తేవడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఇంజినీరింగ్ చేయించడానికి పూనుకోవడం, ఈ పరిస్థితుల నడుమ తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేమన్న ఒత్తిడితో కృతి ప్రాణాలు తీసుకొని ఉంటుందని ఎస్పీ గోదార చెప్పారు. రాజస్థాన్ లోని కోటా కోచింగ్ సెంటర్లకు పేరుగాంచింది. ఈసారి ఐఐటీ ఫలితాల్లోనూ కోటా తన సత్తా చాటింది. అదే సమయంలో ఈ పట్టణం విద్యార్థుల ఆత్మహత్యలకు పేరుపడింది. కోచింగ్ సెంటర్లు, తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఈ ఏడాదే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.