breaking news
kostal
-
కాంగ్రెస్‌కు ‘మోదీ’ గుబులు
కన్నడ రాజకీయాల్లో కోస్తా ప్రాంతానికున్న ప్రత్యేకతే వేరు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అభివృద్ధి, సామాజిక మార్పు, లింగాయత్‌లకు మతపరమైన రిజర్వేషన్లు ఇవేవీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపవు. ఇక్కడ హిందువులతోపాటు, ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా ఎక్కువ. అడపాదడపా మతపరమైన ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ ఐదేళ్లలో కర్ణాటక వ్యాప్తంగా 25 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవగా.. ఎక్కువ మంది ఈ ప్రాంతంలోనే చనిపోయారు. దీంతో రాజకీయంగా, మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతంగా కోస్తాకు పేరుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ చేపట్టనున్న ర్యాలీలతో కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. మోదీ హవా బలంగా వీస్తే కాంగ్రెస్ కనీస సీట్లను సంపాదించటమూ కష్టమేనని రాజకీయ విశ్లేషకులంటున్. పెరుగుతున్న నేరాలు ఈ ప్రాంతంలో మొత్తం 21 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 5, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉన్న మూడు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. నేరాలు పెరగటం, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం, అటవీ భూములు తగ్గిపోవటం వంటివీ ఈ ప్రాంతంలో తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. కొంతకాలంగా మాదక ద్రవ్యాల సరఫరా ఈ ప్రాంతంలో పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై ఇక్కడి ప్రజల్లో మతాలకు అతీతంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆలోచనలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో తన ప్రభావాన్ని స్పష్టంగా చూపించిన కాంగ్రెస్ ఈసారి పట్టునిలుపుకునేందుకు శ్రమిస్తోంది. డ్రగ్స్ సరఫరా, లవ్ జిహాదీ ఘటనలు పెరగటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోస్తాపై పట్టు నిలుపుకునేందుకు, హిందూ ఓట్లు చీలకుండా ఉండేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ రంగంలోకి దించింది. యోగిని ఎక్కువగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రచారానికే వినియోగించుకుంటోంది. దీనికి తోడు మోదీ కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కొంతకాలంగా తమ ఓట్లు చీలకుండా చేస్తున్న వివిధ ప్రయత్నాలన్నీ ప్రధాని ర్యాలీలతో ప్రభావితం అవుతాయని.. కర్ణాటక మంత్రి, మంగళూరు సిట్టింగ్ ఎమ్మెల్యే యూటీ ఖాదర్ పేర్కొనటం పరిస్థితికి అద్దంపడుతోంది. మోదీ సునామీని తట్టుకునేందుకు ఇంటింటి ప్రచారంపైనే కాంగ్రెస్ అభ్యర్థులు దృష్టిపెట్టారు. అభిమానం ఓటుగా మారేనా? ‘గత ఎన్నికల్లోనూ మోదీ ఇక్కడ పర్యటించారు. కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ప్రస్తుతం ప్రధాని హోదాలో వస్తున్నారు. దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని ఖాదర్ పేర్కొన్నారు. ‘మోదీ హవా ఉందనేది వాస్తవమే. ఈ జిల్లాలో (మంగళూరు) మోదీకి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కానీ ఇది ఓటుగా ఎంతవరకు మార్పుచెందుతుందనేది ఆలోచించాలి. ఏదేమైనా ఇక్కడ నేనే గెలుస్తాను. ఈ నియోజకవర్గంలో 20 శాతం మైనారిటీ ఓట్లున్నాయి’ అని మంగళూరు (నార్త్) కాంగ్రెస్ అభ్యర్థి మొయినొద్దీన్ బావా పేర్కొన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున భరత్ శెట్టి బరిలో ఉన్నారు. మరో సున్నితప్రాంతమైన బంత్వాల్ కాంగ్రెస్ అభ్యర్థి, కన్నడ అటవీ శాఖ మంత్రి రామ్‌నాథ్ పాయ్ మాత్రం.. మోదీ ప్రభావం ఉండదని కొట్టిపడేశారు. వారిని బుజ్జగిస్తే..: విశ్లేషకులు అయితే రాజకీయ విశ్లేషకులు కోస్తా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని.. మోదీ పర్యటన తర్వాత పరిస్థితి బీజేపీకి మరింత సానుకూలంగా మారొచ్చంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలను మోదీ బుజ్జగిస్తే.. పరిస్థితి కమలదళానికి అనుకూలమేనంటున్నారు. ముందే రంగంలోకి యోగి మతపరంగా సున్నితమైన ప్రాంతంలో మోదీ పర్యటన బీజేపీకి అనుకూలంగా మారుతుందని పార్టీ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. విపక్షాల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది. మతపరమైన సున్నిత ప్రాంతం కావటంతో.. ఇక్కడ మెజారిటీ సీట్లను గెలుపొందేందుకు బీజేపీ ముందునుంచే పావులు కదుపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే యోగి ఆదిత్యనాథ్ తరచూ ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటం బీజేపీ వ్యూహంలో భాగమే. – సాక్షి నేషనల్ డెస్క్ -
కన్నీట ముం'చేను'
అకాల వర్షాలతో రైతన్నకు అపార నష్టం వరి వర్షార్పణం.. దెబ్బతిన్న మొక్కజొన్న, పసుపు, మిర్చి, సజ్జ తదితర పంటలు 35,910 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం.. యార్డుల్లో ధాన్యం నీటిపాలు 35 మండలాల్లో అతిభారీ, 146 మండలాల్లో భారీ వర్షాలు ,9 మంది మృత్యువాత సహాయక చర్యలకు గవర్నర్ ఆదేశం పంటనష్టంపై అధికారుల కాకిలెక్కలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. వేలాది హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కోతలు పూర్తయి మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల పసుపు, మిర్చి దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో మామిడి నేలరాలింది. అంతేగాకుండా ఈ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఇంతగా నష్టం వాటిల్లుతున్నా.. అధికారులు మాత్రం పంట నష్టాన్ని తక్కువగానే చూపుతుండడం గమనార్హం. పంట నష్టాన్ని అతి తక్కువగా అంచనా వేస్తూ అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 35 మండలాల్లో అతిభారీ, 146 మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వర్షాల కారణంగా నష్టపోయిన జిల్లాల్లో పంటనష్టం అంచనాలను వెంటనే చేపట్టాలని.. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని గవర్నర్ నరసింహన్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పంట నష్టం అంచనాలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల వల్ల ఇళ్లు కూలిపోయి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు మరణించగా.. ప్రకాశం జిల్లాలో ఈదురు గాలులు తట్టుకోలేక ముగ్గురు, వేగంగా వీచిన గాలి కారణంగా పడవ బోల్తాపడి ఒక మత్స్యకారుడు మృతి చెందారు. ఈదురుగాలుల కారణంగానే శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఒకరు మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 8 ఇళ్లు కూలిపోయాయి. మొత్తంగా 42 పశువులు మృతి చెందగా.. ఖమ్మం జిల్లాలో 36, కర్నూల్ జిల్లాలో 4, వరంగల్ జిల్లాలో 4, పశ్చిమగోదావరి జిల్లాలో 2 పశువులు మృతి చెందినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కాగా ఈ భారీ వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, సజ్జ, నువ్వుల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అలాగే 35,910 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మామిడి, కూరగాయలు, అరటి, చింతపండు, మిరప, నిమ్మ, బొప్పాయి, దానిమ్మ పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్ యార్డుల్లో భారీగా ధాన్యం తడిసింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 9.5 సెంటీమీటర్లు, ఖమ్మంలో 9.2, తూర్పుగోదావరిలో 8.4, కృష్ణాలో 8.1, విశాఖపట్నం 5.5, వరంగల్ 5.2, మహబూబ్‌నగర్ 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నీట మునిగిన వరి: వర్షాల కారణంగా నల్లగొండ జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. 1,520 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. రైతాంగానికి సుమారు రూ. 7 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 340 హెక్టార్లలో చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. ఐకేపీ కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నేల రాలిన మామిడి కరీంనగర్ జిల్లాలో వర్షాల వల్ల రూ. 60 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న నీటిపాలు కాగా... మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో పోసిన వరిధాన్యం, మక్కలు, పసుపు తడిసిపోయింది. మామిడికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ నష్టం రూ. 25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ఇంతవరకు పంటనష్టాన్ని అంచనా వేయకపోగా.. జిల్లాలో నష్టం లేదని పేర్కొనడం గమనార్హం. ఖమ్మంలో రూ. 30 కోట్లకు పైగా నష్టం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. రూ. 30 కోట్ల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. కానీ, అధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా కేవలం 1,900 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాల్లో తేల్చిచెప్పడం గమనార్హం. ఖమ్మం, వైరా, పాల్వంచ, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్లలో అమ్మకానికి వచ్చిన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తడిసిపోయాయి. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు నిరాకరించడం, రంగుమారిన మిర్చికి ధర తక్కువగా చెల్లించే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు, మిర్చి నీటి పాలు: వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 100 ఎకరాల్లో మిరప, పసుపు నిల్వలు తడిసిపోయాయి. 3 వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో 5,000 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోయింది. 550 ఎకరాల్లో మామిడి నేలరాలినట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. నష్టం రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దెబ్బతిన్న వరి పంట వరంగల్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షంతో రూ. 3.50 కోట్ల పంట నష్టం వాటిల్లింది. 2,337 హెక్టార్లలో కోతకు వచ్చిన వరి నేలపాలైంది. 12 మండలాల పరిధిలోని 82 గ్రామాల్లో 3,600 మంది రైతులు నష్టపోయారు. అమ్మకానికి మార్కెట్‌కు, ఐకేపీ సెంటర్లకు తెచ్చిన ధాన్యం చాలా చోట్ల తడిసిపోయింది. తడిసిన ధాన్యం: నిజామాబాద్ జిల్లాలోని 289 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షాల కారణంగా దాదాపు 60 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయింది. 183 హెక్టార్లలో కోతకు సిద్ధంగా ఉన్న వరి దెబ్బతిన్నది. జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, నందిపేట, మోర్తాడ్, జుక్కల్, బాన్సువాడ, బోధన్ ప్రాంతాలలో అకాల వర్షంతో వరి ధాన్యం, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. నష్టం అంచనా రూ.3 కోట్లు: మూడురోజులుగా కురిసిన వర్షాలకు రూ. 3 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా 1,410 ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో మిర్చి, 16 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నాయి. 2,020 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు.. రంగారెడ్డి జిల్లాలో ఐదురోజులుగా కురిసిన వర్షాలతో 2,020 హెక్టార్లలో పంటలు నీటిపాలయ్యాయి. ఐదు మండలాల్లో 784 హెక్టార్లలో వరి పూర్తిగా దెబ్బతిన్నది. తొమ్మిది మండలాల్లో 1,236 హెక్టార్లలో ఉద్యాన పంటలు పాడయ్యాయి. అయితే, భారీగా నష్టం జరిగినా.. రైతు సాగుచేసిన విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పంట దెబ్బతింటేనే నష్టం జరిగినట్లుగా అధికారులు లెక్క చూపుతున్నారు. 23 ఇళ్లు ధ్వంసం మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా 23 ఇళ్లు దెబ్బతిన్నాయి. 76.7 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటల విలువ సుమారు రూ. 15.52 లక్షల వరకు ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. కోస్తా జిల్లాల్లో భారీగా పంట నష్టం కోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో చేతికొస్తున్న పంటలను శుక్రవారం రాత్రి నుంచీ కురుస్తున్న అకాల వర్షం నీట ముంచేసింది. వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు పక్వానికి వచ్చిన సమయంలో కురిసిన వర్షాలతో నేలవాలి నీటమునిగాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి, జీడిమామిడి, సపోటా, బొప్పాయి, అరటి, తమలపాకు తోటలు భారీగా దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో డెల్టాతో పాటు మెట్టలో సుమారు 70 వేల ఎకరాల్లో వరి పంట వర్షానికి దెబ్బతింది. ఇందులో సుమారు 26 వేల ఎకరాల్లో వరి పనలమీద, ధాన్యం కల్లాల్లో రాశులుగా ఉండగా, మరో 44 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, పది వేల ఎకరాల్లో కాయలు రాలిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 4,500 ఎకరాల్లో వరి, 782 ఎకరాల్లో నిమ్మ, అరటి, మామిడి వంటి ఉద్యాన పంటలు, కోకో, ఆయిల్‌పామ్ తదితర వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 5,763 ఎకరాల్లో కోత కోయాల్సిన వరి నేలవాలింది. మరో 11,310 ఎకరాల్లో కోత కోసి పనలపై ఉన్న వరి, ఇంకో 3,725 ఎకరాల్లో ధాన్యం రాశులు, కుప్పలు తడిచిపోయాయి. వర్షం, గాలుల తాకిడికి 31,250 ఎకరాల్లో మామిడి కాయలు 10 శాతం వరకూ రాలిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో 14,465 ఎకరాల్లో కోసి కల్లాల్లో ఉన్న మొక్కజొన్న తడిసిపోయింది. గుంటూరు జిల్లాలో మామిడి, సపోటా, అరటి, తమలపాకుల తోటలు దెబ్బతిన్నాయి. నడికుడి మార్కెట్‌యార్డులో రైతులు, వ్యాపారులు ఆరబోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. దుగ్గిరాల పసుపు మార్కెట్‌యార్డులో షెడ్ల వెలుపల పట్టాలు కప్పిన బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో సైతం వరి, మామిడి, జీడిమామిడి, అపరాల పంటలకు నష్టం వాటిల్లింది. నౌపడ పరిసర ప్రాంతాల్లో ఉప్పు మడులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన దంపతులు చేల నారాయణరావు (52), లక్ష్మి (48) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. బలహీనపడిన అల్పపీడనం కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు తగ్గుముఖం సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలు తగ్గుముఖంపట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడింది. దక్షిణ కోస్తా నుంచి తమిళనాడు వరకు ఆవరించిన అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని, అయితే అది బలహీనంగానే ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణాలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.