breaking news
Kohli 19th century
-
ఛేజింగ్ హీరో!
క్రికెట్లో సెకండ్ బ్యాటింగ్ కష్టం. ప్రత్యర్థి తమ ముందుంచిన లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఒత్తిడి బ్యాట్స్‌మెన్ ఉంటుంది. ఒత్తిడితో పాటు తమను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్టు పన్నే వ్యూహాలను ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేయడం కొమ్ములు తిరిగిన ఆటగాడికైనా కష్టమే. అయితే భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లి ఇందుకు పూర్తి మినహాయింపు. ఛేజింగ్ చాలెంజ్‌ను అలవోకగా దాటేస్తుండీ కుర్ర క్రికెటర్. ఒత్తిడి అంటే తెలియనట్టు విరుచుకు పడుతుంటాడు. సెంచరీ బాదడం ఇంత సులువా అన్నట్టుగా ఆడతాడు. లక్ష్య ఛేదనలో విరుచుకుపడడం విరాట్ స్టయిల్. కళ్ల ముందు కొండంత లక్ష్యం ఉన్నా కేర్ చేయడు. కోహ్లి క్రీజ్‌లో ఉన్నాడంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా కరిగిపోవాల్సిందే. ఛేజింగ్‌లో 'శత'క్కొట్టడం అలవాటుగా మారిపోయిందా అనేంతగా బాదేస్తున్నాడీ ఢిల్లీ బాయ్. తాను 'ఛేజింగ్ హీరో'నని కోహ్లి మరోసారి రుజువు చేసుకున్నాడు. తాజాగా ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఛేజింగ్ సెంచరీ కొట్టాడు కోహ్లి. తన శతకంతో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. వన్డ్లేల్లో 19 సెంచరీలు సాధించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా సరసన చేరాడు. లారా 299 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధిస్తే, కోహ్లి కేవలం 131 వన్డేలోనే 19 శతకాలు బాదేశాడు. సారథిగా వచ్చినా 'ఛేజింగ్ స్టార్' బ్యాటింగ్ స్టయిల్ మారలేదు. కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు తీసుకున్నా దంచడంలో తేడా రానీయలేదు. కెప్టెన్‌గా తొమ్మిదో మ్యాచ్ ఆడిన కోహ్లి.. సారథిగా మూడో సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్‌పైనా అతడికిది మూడో శతకం కావడం విశేషం. ఇక ఛేజింగ్‌లో కోహ్లి13 సెంచరీలు కొట్టగా, ఒక్కసారి మాత్రమే టీమిండియా ఓడిపోయింది. దీనిబట్టే అర్థమవుతుంది కోహ్లి ఛేజింగ్ స్టామినా. ఇదే జోరు కొనసాగిస్తే వన్డేల్లో అతడు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. -
వన్డేల్లో 19వ సెంచరీ చేసిన కోహ్లి
ఫతుల్లా: ఛేజింగ్ హీరో విరాట్ కోహ్లి మరోసారి శతకం బాదాడు. లక్ష్య ఛేదనలో చెలరేగి ఆడే అలవాటును కొనసాగించాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లి సెంచరీ సాధించాడు. 95 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 19వ సెంచరీ కావడం విశేషం. 131 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ కూడా సెంచరీ సాధించాడు. రహీమ్ 117 పరుగులు చేశాడు. కోహ్లి విజృంభణతో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. కోహ్లికి అంజిక్య రహానే చక్కటి సహకారం అందించాడు. రహానే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.