breaking news
Knee Replacement Surgery
-
కీలు మారాక 'ఫీల్ ఎలా ఉంది'?
చాలా ఏళ్ల కిందట ఇటీవల మోకాలి దగ్గర ఉన్న కీళ్లు అరిగితే... తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. పాత నొప్పులంటూ చెబుతూ జీవితాంతం బాధపడేవారు. కదలడానికి కూడా కష్టపడుతూ, నడవడానికి నానా యాతన పడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా వేగంగా ప్రాచుర్యం పొందడంతో ఈ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఒక ఎత్తైతే... ఆ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ, సూచనలూ మరో ఎత్తు. వీటిని ఎంత సమర్థంగా అమలు చేస్తే... నడక అంత వేగంగానూ అంత మెరుగ్గానూ జరుగుతుంది. మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, పాటించాల్సిన సూచనలపై అవగాహన కోసం ఈ కథనం.మోకాలి కీళ్ల మార్పిడి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా బాధితులకు రెండు రకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మొదటిది పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (కంప్లీట్ నీ– రీప్లేస్మెంట్ సర్జరీ), రెండోది... పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ – రీప్లేస్మెంట్ సర్జరీ). వీటిల్లో పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో కోలుకోవడం అన్నది చాలా త్వరితంగా... అంటే రెండు నుంచి నాలుగు వారాల్లో జరుగుతుంది. అదే పూర్తి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకోడానికి నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి అవసరం. బాధితుల అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఈ రెండింటి ప్రభావాలూ, మన్నిక ఒకేలా ఉంటాయి. పోలికలు వద్దు... పైన పేర్కొన్న కాల వ్యవధులను చాలామంది వ్యక్తులను పరిశీలించి... ఓ సగటు సమయాన్ని పేర్కొనడం కోసం చెప్పేవి మాత్రమే. వారి వారి శరీర తత్త్వాన్ని బట్టీ, అలాగే రోగనిరోధక వ్యవస్థ తాలూకు చురుకుదనం, వారి సాధారణం ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ వీటన్నింటి ఆధారంగా కోలుకునే సమయం ఒకరి నుంచి మరొకరికి మారవచ్చు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి వస్తుండే వ్యవధి కూడా ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉండవచ్చు. అందుకే మోకాలి కీలు మార్పిడి జరిగిన ఇతర వ్యక్తులతో ΄ోల్చుకోవడం సరికాదు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం, దాంతో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడం వల్ల గాయం తగ్గడానికి పట్టే సమయం పెరగవచ్చు. అందుకే మరొకరితో ΄ోల్చుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు. శస్త్రచికిత్సకు ముందున్న స్టిఫ్నెస్ : శస్త్రచికిత్సకు ముందు మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నవారికి ఆ తర్వాత కదలికలు పెరుగుతాయి. అయితే మునుపు అంతగా స్టిఫ్‌గా లేనివారితో పోలిస్తే ఇలా స్టిఫ్‌గా ఉన్నవారిలో కదలికలు అంతగా పెరగకపోవచ్చు. నొప్పి తీవ్రత ఎక్కువ తక్కువలు : నొప్పి తక్కువగా ఉన్నవారు ఫిజియో వ్యాయామాలను సమర్థంగా చేయగలుగుతారు అందుకే వారిలో మెరుగదల గణనీయంగా ఉండవచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నవారిలోనూ, వ్యాయామల సమయంలో నొప్పిని అంతగా భరించలేనివారిలో వ్యాయామాలు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయి నార్మల్ కదలికలు రాకుండా కేవలం పరిమితంగా మాత్రమే మెరుగుదల కనిపించవచ్చు. ఇలా నొప్పి ఎక్కువగా ఉండేవారు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. డాక్టర్‌ను సంప్రదించి నొప్పి వాళ్ల ఆధ్వర్యంలో నివారణ మందులు వాడుతూ వ్యాయామాలు చేస్తూ తాము కోరుకున్న స్థాయి మెరుగుదలను పొందవచ్చు.మెరుగుదల ఆధారపడే అంశాలివే... శస్త్రచికిత్స తర్వాత కాలి కదలికలు మామూలుగా మారడం లేదా మోకాలి దగ్గర నార్మల్‌గా ఉండటం అన్నవి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి... శస్త్రచికిత్సలో ఏ టెక్నిక్ వాడారనే అంశం : శస్త్రచికిత్సలో ఏ తరహా టెక్నిక్ వాడారనే అంశంతో పాటు శస్త్రచికిత్స సమయంలోనే లోపల ఉన్న అవరోధాలనూ, వైకల్యాలను, ఇతరత్రా సమస్యలను ఏ మేరకు రిపేర్ చేశారనే అంశాలపై కూడా శస్త్రచికిత్స తర్వాతి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మోకాలు తాలూకు డిజైన్ : కృత్రిమంగా లోపల అమర్చే భాగాన్ని ప్రోస్థెసిస్’ అంటారు. ఈ ప్రోస్థెటిక్ డిజైన్‌ను బట్టి కూడా మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న డిజైన్లు మోకాలి కీళ్ల దగ్గర కదలికలు ఫుల్ రేంజ్లో చాలా ఎక్కువగా (గరిష్ఠంగా) ఉండేలా డిజైన్ చేసినవి అందుబాటులోకి వస్తున్నాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి... శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వకపోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. దాని గురించి ఇతర బాధితుల లేదా శస్త్రచికిత్స జరిగినవారితో మీ భావాలు పంచుకోకుండా కేవలం మీ డాక్టర్‌తో మాట్లాడటమే మంచిది. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతో పాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది.మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత... చేయాల్సినవీ... చేయకూడనివి... మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడం గానీ లేదా మెరుగుదల గానీ, కృత్రిమ కీలు చాలా రోజులు మన్నికతో ఉండటానికి గానీ పాటించాల్సిన సూచనలలో ప్రధానమైవి...చేయాల్సినవి... బరువు అదుపులో ఉంచుకోవడం (స్థూలకాయం వల్ల కృత్రిమ కీలుపై బరువు పడటం వల్ల మన్నిక తగ్గే అవకాశమున్నందున బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం). కృత్రిమ కీలు వద్ద తగినంత కదలికలూ, కీలుకు అవసరమైన బలం సమకూరడంతో పాటు అది చాలాకాలం మన్నికతో ఉండటం కోసం క్వాడ్రసెప్, హ్యామ్‌స్ట్రింగ్ కండరాలకు బలం చేకూరే వ్యాయామాలు చేయడం. క్రమం తప్పకుండా ఈత (స్విమ్మింగ్), సైక్లింగ్, నడక (వాకింగ్) వ్యాయామాలు. ఇక్కడ పేర్కొన్న వ్యాయామాల్లో బాధితులకు అనువుగా ఉన్నవాటిని రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఆరు రోజుల పాటు చేస్తుండాలి.చేయకూడనివి... పరుగు (రన్నింగ్), ఆటలాడటం వంటి వ్యాయామాలు వద్దు. దీనివల్ల అమర్చిన కృత్రిమ కీలుపై భారం ఎక్కువగా పడి అక్కడ గాయం రేగవచ్చు. మోకాళ్లు పూర్తిగా ముడుచుకునేలా గుంజీళ్లు తీయడం వంటి వ్యాయామాలూ, అలాగే గొంతుక్కూర్చోవడం, బాసిపట్లు వేసి కూర్చోవడం వద్దు. కృత్రిమ కీలు ప్రోస్థెసిస్)లోని పాలీ ఇథిలీన్ / ప్లాస్టిక్ స్పేసర్ భాగం కొంత సున్నితమైనది. కాబట్టి నడక, కఠిన వ్యాయామాలు, రఫ్‌గా ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొంత విచక్షణ పాటించి జాగ్రత్తగా చూసుకోవడం మేలు.నరాలకు సంబంధించిన సమస్యలుగానీ లేదా నడకలో నొప్పిగాని ఉంటే వాకర్ లేదా వాకింగ్ స్టిక్ వంటి ఉపకరణాల సహాయం తీసుకోవడం మంచిది. చివరగా... కృత్రిమ కీలు కొత్తగా శరీరంలోకి వచ్చి చేరిన భాగమైనందువల్ల మిగతా అవయవాల లాగే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు జ్వరం, గాయం దగ్గర తీవ్రమైన నొప్పి రావడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే చెవి, గొంతు, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు కనిపించినా వెంటనే డాక్టర్‌ను కలవాలి. అంతే తప్ప సొంత చికిత్స రూపంలో యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. పైన పేర్కొన్న సూచనలతో కృత్రిమ కీలును దాదాపు 15 నుంచి 20 ఏళ్లు మన్నేలా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వక΄ోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతోపాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి,సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
మేడ్ ఇన్ ఇండియా రోబోట్.. మోకాలి మార్పిడి ఇక మరింత సులభం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రతి రంగంలోనూ కొత్త ఉత్పత్తులు లేదా అప్డేటెడ్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ గ్లోబల్ మెడికల్ డివైజ్ కంపెనీ 'మెరిల్' అడ్వాన్స్డ్ సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీ 'మిస్సో' (MISSO)ను లాంచ్ చేసింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ రోబోటిక్ సిస్టం (రోబోట్) పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీని ద్వారా మోకాలి మార్పిడికి (Knee Replacement) సంబంధించిన సర్జరీలు మరింత విజయవంతంగా నిర్వహించబడతాయి.ఇప్పటి వరకు భారతదేశంలోని చాలా హాస్పిటల్స్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎక్కువ డబ్బును వెచ్చించి.. విదేశీ రోబోటిక్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. అయితే మిస్సో తమ కొత్త రోబోట్ 66 శాతం తక్కువ ధరకు అందించడానికి సిద్ధమైంది. ఇది ఇతర రోబోటిక్ టెక్నాలజీలకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోబోటిక్ టెక్నాలజీలు కొంత పెద్ద ఆసుపత్రులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ MISSO అనేది చిన్న ఆసుపత్రులకు, టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఆసుపత్రులకు అందుబాటులోకి తీసుకురాగల మొట్టమొదటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోట్.భారతదేశంలో 40 ఏళ్లు పైబడిన 10 మందిలో ముగ్గురు కీళ్ల అరుగుదలతో బాధపడుతున్నారు. దీనికి 'టోటల్ క్నీ రీప్లేస్మెంట్' (TKR) విధానం ద్వారా.. దెబ్బతిన్న లేదా అరిగిపోయిన మోకాలి కీలును మెటల్, అల్ట్రా-హై మాలిక్యులర్ వెయిట్ పాలిథిలిన్‌తో చేసిన కృత్రిమ కీలుతో భర్తీ చేస్తారు. దీనికి సర్జరీ అవసరం. సర్జరీ తరువాత ఎక్కువ నొప్పిని భరించాల్సి ఉంటుందని చాలా మంది భయపడతారు. కానీ సాధారణ సర్జరీతో పోలిస్తే.. రోబోటిక్ సర్జరీ కొంత ఉత్తమమని, దీని ద్వారా సర్జరీ జరిగితే నొప్పి కూడా కొంత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.కీళ్ల అరుగుదల అనేది భారతదేశంలో 22 నుంచి 39 శాతం జనాభాలో ఉన్నట్లు సమాచారం. మనదేశంలో ఏడాదికి 5.5 లక్షల మంది మోకాలి మార్పిడికి గురవుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితంతో పోలిస్తే.. ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న సర్జరీలలో మోకాలి మార్పిడికి సంబంధించిన సర్జరీలు 7 నుంచి 8 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.లేటెస్ట్ మిస్సో రోబోట్ లాంచ్ కార్యక్రమంలో మెరిల్లో మార్కెటింగ్ హెడ్, ఇండియా & గ్లోబల్ 'మనీష్ దేశ్‌ముఖ్', సన్‌షైన్ బోన్ చైర్మన్, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్‌లో జాయింట్ ఇన్స్టిట్యూట్ & మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ 'డాక్టర్ ఏ.వీ గురవ రెడ్డి' పాల్గొన్నారు. ఈ కొత్త రోబోట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. -
ఏ వయసులో మోకాళ్ళ సర్జరీ చేసుకుంటే త్వరగా కోలుకుంటారు ..!
-
గాంధీ వైద్యుల ‘ఆరు’దైన సర్జరీలు
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆరు గంటల వ్యవధిలో ఆరుగురు రోగులకు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరాలు వెల్లడించారు. గాంధీ ఆర్థోపెడిక్ విభాగ ప్రొఫెసర్ వాల్యా నేతృత్వంలో ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, బీహెచ్ఈఎల్ లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, కర్నూలు జిల్లా కొత్తకోట, హైదరాబాద్ జిల్లా అంబర్‌పేట, సూర్యాపేట జిల్లాకు చెందిన నాగమునీంద్ర(63), నాగమణి (40), మంగమ్మ (55), రామాచారి (56), విజయలక్ష్మి (69), పున్నమ్మ (68)లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు చేపట్టారు. ఒకేరోజు ఆరు గంటల్లో ఆరు సర్జరీలు సక్సెస్ కావడం అరుదైన విషయమని డాక్టర్ రాజారావు అన్నారు. మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేయించుకుంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ పథకాల ద్వారా వీటిని ఉచితంగా నిర్వహించామని వివరించారు. సర్జరీల్లో పాల్గొన్న వైద్యులకు డీఎంఈ, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీలు నర్సింహరావునేత, శోభన్‌బాబు అభినందించారు. -
కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్‌తో మోకీళ్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: మోకీళ్ల మార్పిడి చికిత్సకు హైటిబియల్ అస్టియోటొమి (హెచ్‌టీఓ), మెనిస్కస్ రూట్ రిపేర్, కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ ప్రత్యామ్నాయమని సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ఆర్థోస్కోపీ (సీసా) ఆసుపత్రి సీనియర్ షోల్డర్ అండ్ నీ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడు క్రీడల్లో గాయాలు, రోడ్డు ప్రమాదాలతో చిన్న వయసులోనే అనేక మంది మోకీళ్ల నొప్పుల బారిన పడుతున్నారన్నారు. ఇలాంటి వారికి ఇప్పటి వరకు మోకీళ్ల మార్పిడి సంప్రదాయంగా వస్తుందని, ప్రస్తుతం వీటికి ప్రత్యాయ్నాయ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సీసా ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ‘అడ్వాన్స్డ్ నీ కోర్స్–2018’లైవ్ సర్జరీ వర్క్‌షాప్ నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 200 మంది ఆర్థోపెడిక్ వైద్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రాన్స్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ పాస్కల్ క్రిస్టల్ సహా పలువురు వైద్య నిపుణులు.. మోకీలు మార్పిడి చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సలో అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. ఈ సందర్భంగా రఘువీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 55 ఏళ్లలోపు బాధితులకు మోకీలు మార్పిడి చికిత్సలు నష్టం చేకూర్చుతున్నాయని, ఇలాంటి వారికి నొప్పి తక్కువగా ఉండే హెచ్‌టీఓ ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పారు. కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ 15 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ పద్ధతిలో కత్తిగాటుతో పని లేకుండా మోకీళ్లను యథాస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. -
సహజసిద్ధమైన మోకాలుకు ప్రత్యామ్నాయం ‘అట్యూన్’
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: జాయింటు రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలు అవసరమయ్యే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి ‘అట్యూన్’ ద్వారా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో తాడేపల్లి మణిపాల్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి ఒక విప్లవాత్మకమైన విధానానికి నాంది పలికిందని మణిపాల్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణుడు నల్లమోతు జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం మణిపాల్ ఆసుపత్రిలో ‘అట్యూన్’ ఇంప్లాంట్‌ను ఉపయోగించి జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ‘అట్యూన్’ ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన విధానమని, దీని ద్వారా ముఖ్యమైన, సహజసిద్ధమైన ఎముకలోని చాలా భాగాన్ని, లిగ్మెంట్స్, కణజాలాన్ని అందేలా ఉంచడం జరుగుతుందని, దాని వలన ఎముకలు దీర్ఘకాలం ఇబ్బందికి గురికాకుండా ఉంటాయని తెలిపారు. సాధారణ మోకాలు జాయింటు లాగా అట్యూన్ అదనపు ఎముక నష్టం లేకుండా 140 నుంచి 150 డిగ్రీలలో మడవ వచ్చని తెలిపారు. గతంలో మోకాలు శస్త్రచికిత్స కోసం వినియోగించిన ఇంప్లాంట్స్ కేవలం 8 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే పని చేసేవని, కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూపొందించిన అట్యూన్ 30 సంవత్సరాలు పని చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో యువకులు సైతం మోకాలు నొప్పులతో ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన ఆ కంపెనీ 30 సంవత్సరాలపాటు మనగలిగే ఈ అట్యూన్ను రూపొందించిందన్నారు. అట్యూన్ను కేవలం ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులకు మాత్రమే జాన్సన్ కంపెనీ సరఫరా చేస్తుందని, మొదటి దశలో దేశవ్యాప్తంగా కేవలం అట్యూన్ శస్త్ర చికిత్స నిమిత్తం 12 మంది వైద్యులకు మాత్రమే శిక్షణ ఇచ్చారని, వారిలో ఆంధ్రప్రదేశ్ నుండి తాను శిక్షణ పొందినట్టు డాక్టర్ జగదీష్ తెలిపారు.