breaking news
Kitchen sheds
-
ఆరుబయట వంట .. వానోస్తే తంటా!
వంట గదుల్లేక విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం ► క్లాస్రూంలు, వరండాలు, చెట్ల కిందే వంటావార్పు ► వర్షమొస్తే చాలా పాఠశాలల్లో భోజనం బంద్ సర్కారీ బడుల్లో మధ్యాహ్న భోజనం పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షమొస్తే చాలు వేల పాఠశాలల్లో పిల్లలకు భోజనం వండి పెట్టలేని దుస్థితి నెలకొంది. కిచెన్ షెడ్లు లేకపోవడంతో ఆ స్కూళ్లలోని పిల్లలకు అర్ధాకలి తప్పడం లేదు. రాష్ట్రంలోని 25,531 పాఠశాలల్లో దాదాపు 8 వేల స్కూళ్లలో ఇప్పటికీ కిచెన్ షెడ్లు లేవు. వానొస్తే చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. మరికొన్ని చోట్ల పాలిథిన్ కవర్లు అడ్డుపెట్టి వంటలు చేస్తున్నారు. షెడ్లు లేని కారణంగా ఈ ఒక్క నెలలోనే 585 స్కూళ్లలో ఐదు రోజులపాటు పొయ్యి వెలగలేదు. ఈ లెక్కలు ఏదో ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో తేలినవి కావు. సాక్షాత్తూ విద్యాశాఖ సేకరించిన సమాచారం. ఇవే వివరాలను కేంద్రానికి సైతం తెలియజేసింది! – సాక్షి, హైదరాబాద్ కిచెన్ లేదు.. మెనూ లేదు.. మధ్యాహ్న భోజనం.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పగటి పూట భోజనం అందించడం ద్వారా వారు రెగ్యులర్‌గా బడికి వచ్చేలా చూడడం, డ్రాపౌట్స్‌ను తగ్గించే ఉద్దేశంతో తెచ్చిన పథకమిది. క్షేత్రస్థాయిలో ఈ పథకానికి కిచెన్ షెడ్ల సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. షెడ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తోంది. అంతేకాదు షెడ్లు లేకపోవడంతో ఆహార పదార్థాల్లో చెత్తా చెదారం పడుతుండటంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్న సందర్భాలూ ఉన్నాయి. వర్షాల కారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వండి పెట్టని స్కూళ్లు అనేకం ఉన్నాయి. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ఆగస్టులో ఇప్పటివరకు ఐదు రోజుల పాటు విద్యార్థులకు భోజనం పెట్టని స్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా 585 ఉంటే అందులో నల్లగొండకు చెందినవి 91 పాఠశాలలు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 67, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 53 ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన మెనూ అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. చాలా స్కూళ్లలో సాంబారు, అన్నం మాత్రమే ఇస్తున్నారు. షెడ్లు లేక తిప్పలెన్నో.. 362 స్కూళ్లకు వంట గదుల్లేవు. వీటిలో 55,790 మంది విద్యార్థులు చదువుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం ఉప్పర్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో వంట గదిలేదు. వర్షమొస్తే అంతే సంగతులు. మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 635 మంది విద్యార్థులున్నా మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు వంటగది లేదు. ఆరు బయటే వండుతున్నారు. వానొస్తే ఫ్లెక్సీలు, గాలికి రేకులు అడ్డుగా పెడుతున్నారు. మిర్యాలగూడలోని బకల్వాడ ఉన్నత పాఠశాలలో 984 మంది విద్యార్థులు ఉన్నారు. వంటగది లేక ఆరుబయటే వంట చేస్తున్నారు. వర్షమొస్తే వరండాలో వండుతున్నారు. దాంతో తరగతి గదుల్లోకి పొగ వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కవర్లు, ఫ్లెక్సీలు అడ్డు పెట్టి వంట చేస్తున్నాం... 12 ఏళ్లుగా ఆరు వందల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్నాం. కిచెన్ షెడ్ లేకుండా వంట చేయాలంటే మా గోస కాదు. ఎండకు ఎండుతూ, వాన కు తడుస్తూ వంట చేస్తున్నాం. గాలికి కవర్లు, ఫ్లెక్సీలు అడ్డుగా పెడుతున్నాం. వర్షానికి వంట సామగ్రి తడిసిపోతోంది. – నిమ్మల మాధవి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మహబూబాబాద్ అన్నంలో పురుగులు వస్తున్నాయి... వంటలను చెట్ల కింద వండుతున్నారు. వర్షాలు వచ్చిన సమయంలో అన్నంలో చెట్ల పైనుంచి పురుగులు పడుతున్నాయి. అన్నం తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తింటున్నాం. చారు కూడా నీళ్లలాగా ఉంటోంది. – నాగలక్ష్మి, 10వ తరగతి, బకల్‌వాడీ స్కూల్, మిర్యాలగూడ -
నిధులకు గాలం.. పనులకు తాళం!
ఒక నిర్మాణాన్ని మొదలు పెట్టేముందు.. అందుకు సంబంధించి ముడిసరుకు, పని, వ్యయం తదితర అంచనాలు వేసి ఆ తర్వాత పని ప్రారంభిస్తాం. సాధారణంగా అందరూ ఇదే తరహా ప్రణాళికతో రంగంలోకి దిగుతారు. కానీ మన పంచాయతీరాజ్ ఇంజినీర్ల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ముందుగా పనులు మొదలుపెట్టి.. కొంత మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత అంచనాలు వేశారు. నిర్మాణానికి కేటాయించిన మొత్తం చాలడం లేదంటూ చేతులెత్తేశారు. మరిన్ని నిధులిస్తేనే పనులు చేస్తామని మెలిక పెట్టి నిధులను అట్టిపెట్టుకోవడం గమనార్హం. సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం తయారీకిగానూ కిచెన్ షెడ్ల ఏర్పాటుకు సర్కారు సిద్ధ్దమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 1,147 పాఠశాలలకు కిచెన్ షెడ్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించింది. ఈ తంతు జరిగి మూడేళ్ళు కావస్తున్నా.. పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ మూడేళ్ల కాలంలో కేవలం 56 కిచెన్‌షెడ్లను పూర్తి చేసి ఇంజనీర్లు మమ అనిపించడం గమనార్హం. ఎందుకీ జాప్యం.. ఒక్కో కిచెన్ షెడ్డుకు రూ.75వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టవచ్చని ప్రభుత్వం భావించి ఈమేరకు నిధులు విడుదల చేసింది. అయితే జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు మాత్రం ఈ నిధులు చాలడం లేదట. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా రూ.75వేలకో కిచెన్ షెడ్డు నిర్మించడం సాధ్యం కాదని ఇంజినీర్లు తేల్చిచెప్పారు. దీంతో పనులు గ్రౌండ్ చేసిన 205 నిర్మాణాలను ఎక్కడికక్కడ వదిలేశారు. నిర్మాణ వ్యయం రూ.25 వేలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఇంజనీర్లు.. ఆ మొత్తాన్ని ఇస్తేనే పనులు చేస్తామంటూ స్పష్టం చేయడంతో యంత్రాంగం తలపట్టుకుంది. సర్దుకు పోరట.. నిధులు విడుదల చేసి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై ఇటీవల కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిధుల పెంపు అంశాన్ని ఇంజినీర్లు ప్రస్తావించారు. నిధులు పెంచే అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున కొంత సర్దుబాటు చేసి పనులు చేస్తే సరిపోతుందని విద్యాశాఖ సలహా ఇచ్చింది. పాఠశాలలో ఇప్పటికే నిర్మించి ఉన్న ప్రహరీ సపోర్టు తీసుకొని.. స్లాబుకు బదులుగా రేకులు వేసి నిర్మాణాలు పూర్తి చేస్తే మేలు జరుగుతుందని సూచించింది. అయితే ఈ సూచన పంచాయతీరాజ్ ఇంజనీర్లకు రుచించలేదు. దీంతో అలా సర్దుకుపోబోమని స్పష్టం చేసిన ఇంజనీర్లు.. తమ మాటే నెగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద నిర్మాణాలు నిలిచిపోగా మూడేళ్ల పాటు ఖజానాలో రూ.కోట్లు మురుగుతుండడం కొసమెరుపు.