పాతికేళ్లుగా ఇక్కడే షాపింగ్ చేస్తున్నా: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం హైదర్‌గూడలో బట్టలు కొనుగోలు చేశారు. హైదర్‌గూడలోని సాయిఖాదీ భండార్‌లో ఆయన షాపింగ్ చేశారు. క్లాత్ కొనుగోలు చేసిన కేసీఆర్ అక్కడే కొలతలు ఇచ్చి స్టిచింగ్కు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తాను 1990 నుంచి అదే షాపులో బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలిసారిగా బట్టల షాపింగ్ చేశారు.
ఈ సందర్భంగా షాప్ యజమాని మాట్లాడుతూ...సీఎం కేసీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రముఖులు ఇక్కడే షాపింగ్ చేస్తుంటారని, చాలామంది శాసనసభ్యులు తమ ఖాదీ భండార్ నుంచి బట్టలు కొనుగోలు చేస్తుంటారని, అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడికి రావడం ఇదే తొలిసారి అని వివరించాడు.
కాగా అంతకు ముందు హైదరగూడాలోని ఓల్డ్ క్వార్టర్స్ ప్రాంతంలోకి హఠాత్తుగా పోలీసులు పెద్ద ఎత్తున దిగారు. ఆ ప్రాంతానికి దారితీసే కూడళ్లలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. వాహనదారులకు ఏం జరుగుతోందో అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. ఎస్కార్ట్‌తో సహా తెలంగాణ సిఎం కేసిఆర్ దిగారు. ఏ కార్యక్రమం లేదుకదా....సిఎం సార్ ఎందుకు వచ్చారని అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ చూస్తుండగానే రోడ్డుకు ఓ వైపున వున్న శ్రీసాయి ఖాదీ వస్త్రాలయంలోకి కేసీఆర్ వెళ్లి...షాపింగ్ చేసి వెళ్లిపోయారు.