breaking news
Jorge Luis Borges
-
చదువరి - రాయరి
సత్వం: తన పఠనాన్ని బోర్హెస్ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండుంటే బాగుండేదని తలపోశాడు. బోర్హెస్ను పట్టించే రెండే పదాల్ని చెప్పమంటే, తడుముకోకుండా ఎంచుకోగలిగేవి: చదవడం, రాయడం! చిన్నతనంలోనే వాళ్ల నాన్న తన గ్రంథాలయాన్ని బోర్హెస్కు పరిచయం చేశాడట. ‘అందులో ఏం కావలిస్తే అది చదువుకో’మన్నాడట. ‘కాని ఏదైనా విసిగిస్తే వెంటనే దాన్ని పక్కన పెట్టేయమన్నాడు. అంటే నిర్బంధ పఠనానికి వ్యతిరేకం అన్నమాట. పఠనమంటే ఆనందం కలిగించేదిగా వుండాలి.’ తన పఠనాన్ని బోర్హెస్ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండుంటే బాగుండేదని తలపోశాడు. ముప్పై ఏళ్లవరకూ తనను నిరర్థకమైన జీవిగానే భావించుకున్నాడాయన. గంభీరమైన చరిత్రగల కుటుంబంలో అర్జెంటీనాలో జన్మించిన బోర్హెస్(1899-1986) తాతలు యుద్ధాల్లో పాల్గొన్నవారు! రోజూ పొద్దునే గడ్డం గీసుకోవడానికి ఉపకరించే రెమింగ్టన్ కంపెనీయే తన తాతయ్య మరణానికి కారణమైన రైఫిళ్లను ఉత్పత్తి చేసిందన్న నిజం ఆయనకు చిత్రమైన గగుర్పాటు కలిగించేదట. సాహసాలతో నిండి సుసంపన్నంగా కనిపించే తన పూర్వీకుల జీవితంతో పోల్చుకుంటే ఆయనకు న్యూనత కలిగేదట. కార్యశూరత లేని ‘ఒక పాఠకుని జీవితం, అప్పుడప్పుడు తీవ్రంగా, ఒక పేద జీవితమని అనిపించే’దట. కాని దాన్నుంచి ఆయన బయటపడగలిగాడు. ‘ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఏ జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే’ అని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు. ‘అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదో నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ని,’ అని గర్వంగా చాటుకున్నాడు. తర్వాత ఎన్ని ముద్రణలు వెలువడినప్పటికీ, తను చదివిన ఆ పాత పుస్తకం, దాని అట్ట, అందులోని అక్షరదోషాలు, గీసుకున్న గీతలున్నదే అసలైన ‘డాన్ కిహోటి’గా భావించడం ఆయన వేలాది పఠనానుభవాల్లో ఒకటి! తన మాతృభాష స్పానిష్ సాహిత్యంతో మొదలుకొని, జర్మన్ సాహిత్యం (ఎంతో ఉన్నతమైన సాహిత్యాన్ని అందించిన జర్మన్, ఆ సాహిత్యంకంటే అందమైన భాషంటాడు!), ఫ్రెంచ్ సాహిత్యం (ఎంతో శ్రేష్టమైన సాహిత్యాన్ని అందించిన ఫ్రెంచ్, ఆయనకు వికారంగా తోచిందట!), ఆంగ్ల సాహిత్యం (ఆయన్ని షేక్స్పియర్ ముగ్ధుణ్ని చేయలేదు; ఆంగ్లాన్ని మాత్రం సొంతభాషలా ప్రేమించాడు.), ఇంకా, చరిత్ర, తత్వశాస్త్రం, గణితం, భూగోళం, మతగ్రంథాలు... ఎంత చదవాలో అంత చదివాడు; వాటి గురించి ఎంత రాయాలో అంత రాశాడు. ‘కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు, మేజిక్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు’గా నిలిచాడు. ‘ఫిక్షన్స్’ ‘ది అలెఫ్’ కథాసంకలనాలు ఆయనకు విశ్వవిఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆయన తండ్రి జార్జ్ గిలెర్మో బోర్హెస్ ఒక విఫల రచయిత! తండ్రి సాధించలేని చోట, తను కృతకృత్యుడవ్వాలన్న నైతిక ఒత్తిడి కూడా ఆయన్ని రాయడానికి పురిగొల్పింది. తొమ్మిదేళ్లప్పుడే ఆస్కార్ వైల్డ్ ‘ద హాపీ ప్రిన్స్’ను స్పానిష్లోకి అనువదించాడు; కానీ అది వాళ్ల నాన్న చేశాడనుకున్నారట. అయితే, తరువాతి రెండు దశాబ్దాలపాటు ఆయన ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, వాటిలో కొన్ని అచ్చువేసినప్పటికీ వాటన్నింటినీ తన ‘ప్రాక్టీస్’గా మాత్రమే పరిగణించాడు. ఆడంబర గుణంలోంచి జనించే ‘మేలిమి రచన’కన్నా, సాఫీగా సాగే మంచి రచనే ఉత్తమమైనదిగా పేర్కొన్నాడు. తొమ్మిదేళ్లపాటు బోర్హెస్ లైబ్రరీలో పనిచేశాడు. గొప్ప పాఠకుడికి తగిన చోటు! మరోవైపు ఆయన సాహిత్య సామ్రాజ్యాన్ని ‘రాయరి’(ప్రభువు)లా ఏలుతున్నాడు. అలాంటి రోజుల్లో ఆయన సహోద్యోగి ఒకరు, ‘జార్జ్ లూయీ బోర్హెస్’ అనే రచయిత పేరూ, ఇతడి పేరూ ఒకటేకావడం; పైగా ఇద్దరికీ ఒకే పుట్టినరోజు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! తనపక్కనుండి బుద్ధిగా పుస్తకాలు సర్దుతుండే ఈ యువకుడే అంతటి కథకుడని ఆ సహోద్యోగి ఎలా నమ్మగలడు! 55 ఏళ్ల వయసులో బోర్హెస్కు చూపు పోయింది. అటు ఎనిమిది లక్షల పుస్తకాల వరాన్నీ ఇచ్చి, ఇటు అంధత్వాన్నీ శాపించిన దేవుణ్ని మొదట నిందించాడు. అయితే, ఒక కళాకారునికి సంభవించే ప్రతిదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకేననీ, తనకు ప్రాప్తించే ప్రతీ వేదననీ మూసలోకి మలిచేందుకు పనికొచ్చే మన్నుగానే భావించాలనీ ఆయన చెప్పినట్టుగానే... క్రూరమైన అంధత్వాన్ని కూడా తన జీవితానికి దక్కిన బహుమతిగానే స్వీకరించాడు. డిక్టేషన్ చెబుతూ రచనలు చేశాడు; అడాల్ఫో బోయ్ కాసరస్ లాంటివారితో జతగానూ రాశాడు; విశ్వవిద్యాలయాల్లో రచన కళ గురించి ఉపన్యసించాడు; పాఠకుడిగానూ, రచయితగానూ రెండు జీవితాల్నీ సంపూర్ణంగా జీవించి నిష్ర్కమించాడు! - ఆగస్టు 24న రచయిత జార్జ్ లూయీ బోర్హెస్ జయంతి -
జోర్జ్ లూయీ బోర్హెస్... మేజిక్ రియలిజంకు ఆద్యుడు
తెలుసుకోవాల్సిన రచయిత: జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) అర్జెంటీనాకు చెందిన కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు. మేజిక్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు. మేజిక్ రియలిజం ప్రక్రియ పట్ల గొప్ప క్రేజ్ కనపరచే తెలుగు సాహిత్యంలో కూడా బోర్హెస్ పేరు విన్నవారూ ఆయన రచనల్ని సాకల్యంగా చదివినవారు ఏమంత ఎక్కువ లేరు. మేజికల్ రియలిజం అంటే బోర్హెస్ చూపించిన ధోరణికి, తక్కిన రచయితలు చూపించిన ధోరణికి చాలా తేడా ఉంది. బోర్హెస్ సత్యమేమిటో తెలుసుకోవాలని తపించి దాన్ని అసత్యం ద్వారా నిరూపించాలని ప్రయత్నించిన కాఫ్కా తరహా కళాకారుడు. బోర్హెస్ రాసిన కథలు చదవడం గొప్ప అనుభవం. కథ అనే ప్రక్రియకి కాలక్రమంలో ఏర్పడ్డ పరిమితులన్నిటినీ అతడు తుంచేశాడు. వ్యాసాన్ని, పుస్తక సమీక్షని, లేని పుస్తకానికి లేని విమర్శకుడి పేరు మీద రాసిన సమీక్షని, రేఖామాత్రపు జీవిత చిత్రణని... ఇలా ఎన్నో రకాల ప్రక్రియల్ని ఆయన మనతో కథలుగా ఒప్పిస్తాడు. ఫిక్షన్కీ నాన్ ఫిక్షన్కీ మధ్య హద్దులు చెరిపేసిన బోర్హెస్ కథలు చదవడం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అతడి నాన్ ఫిక్షన్ చదవడం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యదార్థానికి రెండింటి మూలమూ ఒకటే. అది బోర్హెస్ పఠనానుభవం. బహుశా ప్రపంచ రచయితల్లోనే అంత విస్తృత పఠనానుభవం కలిగిన రచయిత మరొకరుండరేమో. బ్యునోస్ ఎయిర్స్లో అర్జెంటీనా జాతీయ గ్రంథాలయానికి డెరైక్టరుగా పని చేసిన బోర్హెస్ తన గ్రంథాలయంలో ఉన్న ప్రతి ఒక్క పుస్తకం చదివేశాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విజ్ఞాన సర్వస్వాలు. మనం మామూలుగా విజ్ఞాన సర్వస్వాల్ని రిఫరెన్సు కోసం వాడుకుంటాం. కాని ఆయన విజ్ఞాన సర్వస్వాల్లో అ నుంచి క్ష దాకా ప్రతి ఒక్క ఎంట్రీ కూడా చదివేశాడు. చరిత్ర, తత్త్వశాస్త్రం, గణితం, భూగోళశాస్త్రం, భౌతిక రసాయనిక శాస్త్రం, సాహిత్యం... ఇలా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఎంత చదవగలడో అంతా చదివేడు. ఎంత చదివేడంటే ఆ అక్షరాగ్నికి అతడి కళ్లు ఆహూతైపోయాయి. యాభై యేళ్లు వచ్చేటప్పటికి అంధుడైపోయాడు. జీవితంలో చివరి ముప్పై నలభయ్యేళ్లు అంధత్వాన్ని మోస్తూనే రచనలు చేశాడు. ప్రసంగాలు చేశాడు. ప్రపంచమంతా పర్యటించేడు. బోర్హెస్ రాసిన వ్యాసాలు చదువుతుంటే సంభ్రమం కలుగుతుంది. ఈర్ష్య జనిస్తుంది. కొంతసేపటికి అది ఆరాధనగా మారుతుంది. మనలో నిద్రాణంగా ఉన్న జిజ్ఞాసని మేల్కొల్పి మనం చూస్తుండగానే తృష్ణగా మార్చేస్తుంది. తన పాఠకుల్లో తాను ఇటువంటి జ్ఞానతృష్ణ మేల్కొల్పుతున్నానని బోర్హెస్కి తెలుసు. అందుకని అతడు తన చివరి రోజుల్లో ప్రపంచసాహిత్యంలో తాను చదివిన సర్వోత్కృష్ణ రచనల్ని అర్జెంటీనా పాఠకులకి పరిచయం చేయడానికి ప్రయత్నించాడు. అతడు పరిచయం చేసిన రచనల పేర్లు చూస్తేనే మనకు అతడి ప్రపంచం ఎంత విస్తృతమో తెలుస్తుంది. జాక్ లండన్, హెన్రీ జేమ్స్, వోల్టేర్, హథార్న్, చెస్టర్ టన్, రాబర్ట్ లూయీ స్టెవెన్సన్, డాస్టవస్కీ, పో, కాఫ్కా, మెల్విల్లీ, గిబ్బన్, మార్కోపోలో, ఫ్లాబే, భగవద్గీత, కిర్క్ గార్డ్, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్... బోర్హెస్ ఒకచోట ఇలా రాస్తాడు: అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదు నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ణి. సున్నిత పాఠకుణ్ణి. చదివిన పుస్తకాల పట్ల సదా కృతజ్ఞుణ్ణి’ బోర్హెస్ని చదివితే ఏమవుతుంది? ఈ ప్రశ్నకి రెండంచెల్లో జవాబివ్వచ్చు. బోర్హెస్ రాసిన ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంతమేరకు మాత్రమే పరిమితం కాదేమో అని అనుమానమొస్తుంది. అతడు రాసిన నాన్-ఫిక్షన్ చదివితే ఈ ప్రపంచం మనం చూస్తున్నంత మేరకే పరిమితం కాదని నిశ్చయంగా తేలిపోతుంది. - వాడ్రేవు చినవీరభద్రుడు