నాన్న.. నేను.. కటౌట్...
ఎవరీ అమ్మాయి? చేతిలో ఈ కార్డ్బోర్డ్ కటౌట్ ఏమిటి? వింతగా ఆ కటౌట్‌తో ఈమె ఫొటోలెందుకు దిగుతోంది? ఇదేగా మీ డౌట్. ఈ అమ్మాయి పేరు జిన్నా యాంగ్(25). న్యూయార్క్‌లో ఉంటోంది. ఇక చేతిలోని కటౌట్ వాళ్ల నాన్నది. ఆయన పేరు జేయాంగ్.. రెండేళ్ల క్రితమే ఉదర కేన్సర్‌తో చనిపోయారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి జిన్నా తీవ్ర ఒత్తిడికి లోనైంది. పెను విచారంలో మునిగిపోయింది. చివరికి జీవించాలనే ఆశే చచ్చిపోయిందట. ఎందుకంటే.. నాన్నంటే ఆమెకు చాలా ఇష్టం. ముఖ్యంగా తమ కోసం.. తమ కుటుంబం కోసం ఐరోపా అంతా పర్యటించాలన్న తన కలలను, గోల్ఫర్గా రాణించాలన్న తన జీవితాశయాన్ని నాన్న త్యాగం చేశాడన్న సంగతి ఆమెకు తెలుసు. తమ కోసం రోజుకు 12 గంటలపాటు వర్జీనియాలోని డ్రైక్లీనింగ్ షాపులో నాన్న పడిన కష్టం ఆమెకు తెలుసు. చివరికి తన కలలను నెరవేర్చుకోకుండానే నాన్న చనిపోయాడు.
ఈ చింతే ఆమెను తినేసేది. ఇదే విచారంలో మునిగి పోయేది. అయితే, ఓ రోజు ఉదయం లేవగానే డిసైడైంది. నాన్న లేకపోతేనేం.. ఆయన ఆత్మ నాతోనే ఉందిగా అని అనుకుని.. జేయాంగ్ కలలను నెరవేర్చడానికి సిద్ధమైంది. తన జీవితంలోనే అతి పెద్ద యాత్రకు సన్నద్ధమైంది. ఓ కార్పొరేట్ కంపెనీలో చేస్తున్న జాబుకు గుడ్‌బై చెప్పింది. తన వద్ద ఉన్న ఖరీదైన సామాన్లలో 80 శాతం వరకూ అమ్మేసింది. నాన్న కటౌట్ పట్టుకుంది. విమానమెక్కింది. ఐరోపాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలన్నిటినీ నాన్నతో కలిసి తిరిగింది. ఆయనకా ప్రదేశాలన్నీ చూపించింది. ఆ ఫొటోలను నెట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.