breaking news
jamnalal bajaj
-
గాంధీజీ వారసులు.. కోటీశ్వరులయ్యారు!
వాళ్లిద్దరూ బాపూజీ వారసులు. బాపూజీ 'ఐదో కొడుకు' మునిమనవలు. ఇద్దరూ కవల పిల్లలు. వాళ్లిప్పుడు తమకు వారసత్వంగా వచ్చిన మోటార్ సైకిళ్ల వ్యాపారంలో కోటీశ్వరులయ్యారు. వాళ్లిద్దరిలో అనురాగ్ జైన్ సొంత సంపద దాదాపు 110 కోట్ల డాలర్లు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఆయన సోదరుడు తరంగ్ జైన్ కూడా అంతే మొత్తంలో ఆస్తిని పొందారు. వీళ్లలో అనురాగ్ కంపెనీ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ మోటారు సైకిళ్ల విడిభాగాలు తయారుచేస్తుంది. ఐపీఓ తర్వాత ఒకేసారి దాని విలువ 74 శాతం పెరిగింది. ఇక తరంగ్ కంపెనీ వారోక్ గ్రూప్ కూడా మోటార్ సైకిళ్లు, కార్ల విడిభాగాలు తయారుచేస్తుంది. ఈ రెండు కంపెనీలకు ఉన్న అతిపెద్ద కస్టమర్.. బజాజ్ ఆటో లిమిటెడ్!! ఎందుకంటే రాహుల్ బజాజ్ (78) వాళ్లకు సమీప బంధువు. వాళ్లు తయారుచేసిన విడిభాగాల్లో ఏదైనా సమస్య వస్తే వాళ్లను గట్టిగా అరిచేది తానేనని ఆయన చెప్పారు. బజాజ్ ఆటో ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తుందని, సరిగ్గా వీళ్లిద్దరూ కూడా అలాగే చేస్తున్నారని, అందుకే వాళ్లు ఎదిగారని తెలిపారు. రాహుల్ బజాజ్ తన చిన్నతనంలో మహాత్మా గాంధీ ఒళ్లో కూర్చుని ఆడుకునేవారు. ఆశ్రమంలోనే ఆయన బాల్యం గడిచింది. చిన్నతనంలో ఎవరైనా పెద్దయ్యాక ఏం చేస్తావని అడిగితే పోలీసు అవుతాననో, పైలట్ అవుతాననో చెబుతారని, తాను మాత్రం పెద్ద వ్యాపారం చేస్తాననే చెప్పేవాడినని ఆయన అంటారు. ఆ తర్వాత భారతీయ స్కూటర్ పరిశ్రమ తీరుతెన్నులను ఆయన గణనీయంగా మార్చేశారు. తద్వారా 420 కోట్ల డాలర్ల సంపద వెనకేసి ప్రపంచంలోని 500 మంది ధనవంతుల్లో 433వ స్థానం పొందారు. బజాజ్ గ్రూపు వ్యవస్థాపకుడైన జమునాలాల్ బజాజ్ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనను గాంధీజీ తన ఐదో కొడుకని చెప్పేవారు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఆశ్రమం నెలకొల్పాలని గాంధీజీని ఆయనే అడిగారు. 1948లో హత్యకు గురయ్యేవరకు ఆయన అక్కడే ఉన్నారు. బజాజ్ కుటుంబం మాత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ముంబై వెళ్లిపోయింది. -
హమారా బజాజ్
మన దిగ్గజాలు తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఆయన ప్రముఖుడు. స్వశక్తితో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కార్యదక్షుడు. నిబద్ధతగల జాతీయవాది. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వాతంత్య్ర సమరం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో మహాత్ముని వెన్నంటి ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడిచినవాడు. మహాత్ముని ఆదరాభిమానాలను చూరగొన్నవాడు. జమ్నాలాల్ బజాజ్‌పై మహాత్మా గాంధీ పుత్రవాత్సల్యం చూపేవారు. అంతేకాదు, జమ్నాలాల్ నా దత్తపుత్రుడు అని మహాత్ముడు బహిరంగంగా ప్రకటించారంటే, వారిద్దరి మధ్య అనుబంధం ఎంతటితో ఊహించాల్సిందే! నిరుపేద నేపథ్యం రాజస్థాన్‌లోని సికార్ సమీపంలో కాశీ కా బాస్ ఒక కుగ్రామం. జమ్నాలాల్ బజాజ్ 1889 నవంబర్ 4న ఆ గ్రామంలో నిరుపేద మార్వాడీ కుటుంబంలో జన్మించారు. కనీరాం, బిర్దీబాయి దంపతులకు జమ్నాలాల్ మూడో సంతానం. ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో కనీరాం దంపతులు జమ్నాలాల్‌ను వార్ధాకు చెందిన వర్తక ప్రముఖుడు సేఠ్ బచ్రాజ్కు పెంపకానికి ఇచ్చేశారు. సేఠ్ బచ్‌రాజ్ పెంపకంలో జమ్నాలాల్ చిన్న వయసులోనే వ్యాపారంలో మెలకువలను తెలుసుకున్నారు. సేఠ్ బచ్‌రాజ్ మరణించడంతో ఆయన వ్యాపారానికి వారసుడైన జమ్నాలాల్ బచ్‌రాజ్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను నెలకొల్పారు. కాలక్రమంలో ఇది విస్తరించి, బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌గా ఎదిగింది. ఈ గ్రూప్‌లో ఇప్పుడు ముప్పయికి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయి. బజాజ్ గ్రూప్ విస్తరిస్తున్న రోజుల్లో కొన్ని దశాబ్దాల పాటు స్కూటర్లు, ఆటోరిక్షాల మార్కెట్లో తిరుగులేని హవా కొనసాగించింది. బ్రిటిష్ హయాంలో బజాజ్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లోని వర్తక, పారిశ్రామిక ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు వారికి గౌరవ పదవులు, బిరుదులు కట్టబెట్టేది. మొదటి ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉదారంగా విరాళం ఇచ్చిన జమ్నాలాల్ బజాజ్‌ను గౌరవ మేజిస్ట్రేట్‌గా నియమించింది. ఆ తర్వాత ‘రాయ్ బహద్దూర్’ బిరుదుతో సత్కరించింది. అయితే, తర్వాతి కాలంలో మహాత్మాగాంధీ ప్రభావంతో జమ్నాలాల్ జాతీయ ఉద్యమం వైపు మొగ్గారు. గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన బిరుదును వెనక్కు ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. నాగపూర్‌లోని అఖిల భారత కాంగ్రెస్ సభలకు రిసెప్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించి, ఆ సభలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గాంధీతో సాన్నిహిత్యం జమ్నాలాల్ సహాయ నిరాకరణ ఉద్యమ కాలం నుంచి గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సబర్మతిని విడిచి ఆశ్రమాన్ని వార్ధాలో ఏర్పాటు చేసుకోమని గాంధీని కోరేవారు. చివరకు ఉప్పు సత్యాగ్రహం తర్వాత 1930లో గాంధీ తన ఆశ్రమాన్ని వార్ధా సమీపంలోని సేవాగ్రామ్‌లో ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఏర్పడిన గాంధీ సేవా సంఘానికి జమ్నాలాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో చురుగ్గా కొనసాగుతూ 1933లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత కాంగ్రెస్ కోశాధికారిగా ఎన్నికయ్యారు, అస్పృశ్యత నివారణ, ఖద్దరు వ్యాప్తి వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే జమ్నాలాల్ తనకు ఐదో కొడుకులాంటి వాడని, తాను ఆయనను దత్తత స్వీకరిస్తున్నానని గాంధీ స్వయంగా ప్రకటించారంటే, వారిద్దరి సాన్నిహిత్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. అయితే, కొన్ని అంశాల్లో ఆయన గాంధీతో విభేదించిన సందర్భాలూ లేకపోలేదు. కేంద్ర శాసనసభకు 1933లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయరాదని భావించారు. అయితే, జమ్నాలాల్‌ను శాంతింపజేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనను హరిపురా సదస్సుకు అధ్యక్షునిగా ఎంపిక చేసింది. గాంధీ కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. జమ్నాలాల్ మాత్రం దీనిని సున్నితంగా తిరస్కరించి, హరిపురా సదస్సుకు అధ్యక్ష బాధ్యతలను సుభాష్‌చంద్ర బోస్‌కు అప్పగించారు. చివరి వరకు స్వాతంత్య్రం కోసం పరితపించిన జమ్నాలాల్ 1942 ఫిబ్రవరి 11న అనారోగ్యంతో వార్ధాలో కన్నుమూశారు. జమ్నాలాల్ మరణం తర్వాత ఆయన వారసులు బజాజ్ వ్యాపార సామ్రాజ్యాన్ని దేశం గర్వించే స్థాయిలో విస్తరించారు. మహాత్మాగాంధీ ప్రభావంతో జమ్నాలాల్ జాతీయ ఉద్యమం వైపు మొగ్గారు. గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన బిరుదును వెనక్కు ఇచ్చేశారు.