breaking news
Ittedu Arkanandanadevi
-
ఆత్మావలోకనం
వాజస్రవుని కొడుకు వాజస్రవనుడు. ఇతడే ఉద్దాలకమహర్షి. ఇతని పుత్రుడు నచికేతుడు. ఆదరించి అన్నదానం చేసే వీరి వంశం గౌతమ వంశం. ఉద్దాలక మహర్షి విశ్వజిత్యాగం చేశాడు. ఈ యాగం చేసినవారు ఉన్నదంతా దానం చేసేయాలి. ఆనాడు సంపదంటే గోసంపదే. ఎవరికెన్ని గోవులుంటే వారంతటి సంపన్నులు. ఉద్దాలకుడు కూడా యాగం ఆనందంగా పూర్తయ్యిందనే సంతృప్తితో యాగానికి వచ్చిన వారందరికీ గోవులను దక్షిణగా దానం చేయసాగాడు. నచికేతుని భవిష్యత్తుపై హఠాత్తుగా ఆలోచన రావడంతో మంచి ఆవులను కాక, వయసు అయిపోయిన బక్కచిక్కిన గోవులను దానం చేస్తున్నాడు. యజ్ఞనిర్వహణంతా మొదటినుండీ గమనిస్తున్న నచికేతునికి తండ్రి చేస్తున్న పొరపాటు అర్థమైంది. నచికేతుడు వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు, గుణవంతుడు. యాగదక్షిణగా పనికిరాని గోవులను దానం చేస్తే యాగఫలం దక్కకపోగా మోక్షమనే సద్గతి తన తండ్రికి లభించదనీ, తండ్రికి ఎలాగైనా మంచి చేయాలనీ సంకల్పించాడు నచికేతుడు. ఉద్దాలకుడు దానక్రియలో ఉండగా నచికేతుడు వెళ్ళి ‘‘తండ్రీ! ఈ యాగంలో నీ సమస్తం దానం చేయాలి కదా! నన్నెవరికిస్తావు?’’ అని ప్రశ్నించాడు. ఉద్దాలకుడు అది చిలిపిప్రశ్నగా భావించి, మౌనంగా తన పని చేసుకుంటున్నాడు. నచికేతుడు పదేపదే ‘‘నన్నెవరికిస్తావు తండ్రీ!’’ అని అడుగుతుండడంతో ఉద్దాలకుడు విసుగ్గా ‘యమునికిస్తాను’ అన్నాడు. నచికేతుడు నిజంగానే యమపురికి వెళ్లాడు. ఆ సమయంలో యముడు అక్కడ లేడు. ఆయన రాకకై పట్టుదలతో మూడురోజులపాటు అన్నం నీళ్ళు లేక ఎదురుచూశాడు నచికేతుడు. మూడురోజుల తర్వాత యముడు తన పట్టణం చేరి, తనకై ఎదురుచూస్తున్న అతిథి వివరాలు తన వారి ద్వారా తెలుసుకొని తపించిపోయాడు. అతిథి ఎవరి ఇంటిలో తగిన సత్కారం పొందక పస్తుంటాడో వారి ఆశలూ, ఆకాంక్షలూ, సకల పుణ్యకర్మల ఫలితమూ నశిస్తుందనే శాస్త్రధర్మమే యముని భయానికి కారణం. ధర్మానికి రాజైన యముడు తక్షణం నచికేతుని చేరి ‘‘ఓ అతిథీ! నీవు నా ఇంట్లో నిరాహారివై మూడురోజులు గడిపావు. నిన్నిలా నిరాదరించినందుకు క్షమించు, పరిహారంగా మూడు వరాలు కోరుకో’’ అన్నాడు. యముని ఆదరణతో సంతోషించిన నచికేతుడు ‘‘యమదేవా! నా తండ్రి ఉద్దాలక ఋషి నా గురించి బెంగపడకుండా, నేను నీ దగ్గర నుండి ఇంటికి చేరగానే నాపై కోపాన్ని వదిలి నన్ను ఆదరించాలి’’ అన్నాడు. ‘‘నచికేతా! నా అనుగ్రహంతో నీ తండ్రి చింతలన్నీ పోయి ప్రశాంతంగా నిద్రిస్తాడు. నీవు వెళ్ళగానే ప్రేమగా నన్ను ఆదరిస్తాడు. ఇదిగో నా వరం’’ అన్నాడు. యముడు. ‘‘యమధర్మరాజా! ఆకలిదప్పులు, సుఖదుఃఖాలు వృద్ధాప్యం, భయం అనేవే లేని స్వర్గం అనే లోకాన్ని చేరే అమృతవిద్యను రెండవ వరంగా అనుగ్రహించమని కోరాడు నచికేతుడు. ‘‘స్వర్గాన్ని చేరే అగ్ని విద్యను నీకు చెబుతాను. శ్రద్ధగా విను’’ అంటూ వివరించాడు యముడు. విన్నదానిని విధివిధానంగా తిరిగి యమునికి అప్పచెప్పాడు నచికేతుడు. సంతోషించిన యమధర్మరాజు నచికేతునితో ‘‘నీకు మరో వరం ఇస్తున్నాను. ఇకమీదట ఈ అగ్ని నీ పేరుతో ‘నచికేతాగ్ని’ అని లోకంలో ప్రసిద్ధి పొందుతుంది. ఇదుగో ఈ రత్నమాలనూ తీసుకో’’ అని అనుగ్రహించి, ‘‘ఇక నీ మూడవ వరాన్ని కోరుకో’’ అని యముడు అడగటంతోటే నచికేతుడు ‘‘యమధర్మరాజా! మనిషి చనిపోయాక ఆత్మ అనేదొకటి ఉంటుందని కొందరు, శరీరమే బూడిదయ్యాక ఇక మిగిలేదేమిటని మరికొందరూ అంటారు. ఆత్మ అనేదొకటి ఉందా? లేదా? ధర్మదేవతైవైననీ ద్వారా ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను’’ అని అర్థించాడు నచికేతుడు. అందుకు సమాధానంగా యముడు... ‘‘శరీరం పుట్టినా ఆత్మ పుట్టదు. శరీరం నశించినా ఆత్మ చావదు. జననమరణాలు లేక, పశుపక్ష్యాది మనుష్యరూపాలను పొందక, జన్మ, వృద్ధి, పరిణతి, అపక్షయ, వ్యాధి, నాశాలనే ఆరు వికారాలు తెలియని ఆత్మ... శరీరాలు నశించినంత మాత్రాన నశించదు. మనోనిగ్రహం లేని జీవి ఆత్మస్వరూపం తెలుసుకోలేక మళ్లీ మళ్లీ సంసార చక్రంలో తిరుగుతున్నాడు. మనోనిగ్రహం కల జీవి పరబ్రహ్మతత్త్వమెరిగి, ఆత్మవిదుడై మోక్షాన్ని పొందుతాడు. ఆత్మ నిత్యం, శాశ్వతం, సనాతనం, అమరం. అదే ఆత్మతత్త్వం’’ అని నచికేతునికి ఆత్మతత్త్వాన్ని ఉపదేశించాడు. -
విశ్వవ్యాపకుడు... భక్తసులభుడు
వైకుంఠం శ్రీమన్నారాయణుని నిత్య నిజనివాసం. శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలంపై విరాజిల్లుతుంది. ఆ తల్లికి చిహ్నంగా శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఆ దేవదేవుని వక్షస్థలాన్ని అలంకరిస్తుంది. విరాట్పురుషునిగా వేదం కొనియాడిన చతుర్మూర్తి విష్ణుభగవానుడు. శంఖ, చక్ర, గదా, పద్మాలు హరి నాలుగు బాహువులనూ అలంకరించి ప్రాణికోటికి ఆ శబ్దస్పర్శరూపరసగంధాలనూ, ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదించే నాలుగు వరాలై అలరారుతున్నాయి. అమృతం నిండిన రెక్కలతో, వాయువేగంతో సంచరించే సుపర్ణుడు గరుడుడు. సప్తలోకాల్లో అమృతం పంచిపెట్టే అమృతహృదయుడైన శ్రీహరి వాహనమే గరుత్మంతుడు. విశ్వవృక్షానికి వేదాలు ఆకులవంటివి. ఈ మహావృక్షంపై రెండు పక్షులుంటాయి. అందులో ఒకటి కమ్మని పండ్లను ఆరగిస్తుంది. మరొక పక్షి అది చూసి ఆనందిస్తుంది. ఆనందాన్ని గ్రోలే పక్షియే సుపర్ణం. అదే ఆ దేవదేవుని దివ్యవాహనం. పంచభూతాలతో కూడిన పార్థివ శరీరమే పాంచజన్యం. అదే పరిసరాలను పావనం చేసే సామర్థ్యం గల పరంధాముడు వినిపించే శంఖధ్వని. లోకాన్నంతా ఆనందనిలయంగా మార్చే దివ్యమైన ఆయుధం నందకం అనే ఖడ్గం. ధర్మసంస్థాపనే ఖడ్గసృష్టికి సార్థకం. ప్రపంచ వలయంలోని చలనాన్ని, గమనాన్ని, అరవింద సుందర సౌందర్యాన్ని, హరి అరచేతిలో చిటికెనవేలి చివరన ఆవిష్కరించగలిగేదే సుదర్శనచక్రం. సంసార చక్రంలోని సారమంతా సుదర్శనచక్రంలో ప్రస్ఫుటమవుతుంది. శారఙ్గం అనే ధనువు ద్వారా బ్రహ్మపదార్థమనే లక్ష్యాన్ని ఆత్మ అనే బాణంతో ఛేదించి ఆత్మానుభూతి కలిగించే మహా ప్రహరీణాయుధుడు గోవిందుడు. పరబ్రహ్మ నోట వెలువడిన వాక్కే కౌమోదకి గద. ప్రపంచంలోని తియ్యని నాదాలకు ఆమోదమై, కువలయానికి మోదమై, పరంధాముని చేతిలో ఒప్పారే దివ్యాయుధం కౌమోదకి. లోకయాత్రకు అనుగుణంగా అనేక రథాలను సృష్టించి రథచక్రాలను తన చేతిలో అట్టిపెట్టుకునే రథాంగపాణి శ్రీమహావిష్ణువు. సంసార గమనాన్ని నిశ్చలంగా నడిపించే సర్వలోకసారథియై వెలిగే పరంజ్యోతి. సమస్తాన్నీ ప్రపంచానికి అందించే జగజ్జేత శ్రీమన్నారాయణునికి ఫలం పత్రం పుష్పం తోయం ఏదైనా భక్తితో సమర్పిస్తే తృప్తిగా స్వీకరించే భక్తసులభుడు. కానీ ఎక్కడ తలచుకుంటే అక్కడ ప్రభవించే విష్ణుదేవుని స్మరిస్తే చాలు... జన్మ సంసారబంధం తొలగిపోతుందట. విశ్వమంతటా వ్యాపించిన విభుడు శ్రీ మహావిష్ణువు దివ్యలీలా ప్రాభవం అవాజ్ఞ్మానస గోచరం. - ఇట్టేడు అర్కనందనాదేవి