breaking news
ishita Sharma
-
Ishita Sharma: మేమే మా ధైర్యం!
ముంబై జూహూ గ్రౌండ్స్‌లో విమెన్స్ డే సందర్భంగా 1500 మంది ఆడపిల్లలు కరాటేలో తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. వీళ్లంతా ఎవరో చదవండి... ‘మన దేశంలో 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. వీరు స్కూల్లో సైన్సు నేర్చుకున్నట్టు లెక్కలు నేర్చుకున్నట్టు ఆత్మరక్షణ ఎందుకు నేర్చుకోరు? ఎందుకు నేర్పించరు?’ అని అడుగుతుంది ఇషితా శర్మ. ముంబైలో డాన్స్ స్కూల్‌ను నడిపే ఇషితా శర్మ ఐదేళ్ల క్రితం ఒకరోజు రాత్రి కారులో వెళుతుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్లు ఆమెను ఫాలో అయ్యారు. ముందామెకు ఏం చేయాలో తోచలేదు. భయపడింది. కాని చివరకు ధైర్యం కూడగట్టుకుని అద్దం దించి పెద్దగా అరిచింది. అంతే. వాళ్లు పారిపోయారు. ‘ఇంత వయసు వచ్చిన నేనే ఇలా భయపడ్డాను. చిన్నపిల్లలు ఎంత భయపడిపోతారో అనే ఆలోచన నాకు వచ్చింది’ అంటుందామె. ఈ ఆలోచన నుంచే ‘ముక్కా మార్’ ఆవిర్భవించింది. 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలకు కరాటే, కుంగ్ ఫూ వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని అనుకుంది ఇషిత. తనకు తెలిసిన ఒక కరాటే మాస్టర్ని సహాయం అడిగింది. అతను అంగీకరించాడు. ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ఐదుమంది ఆడపిల్లలతో 2018లో ‘ముక్కా మార్’ (దెబ్బ కొట్టు) కార్యక్రమం మొదలైంది. అయిదు పది, పది వంద అవడానికి ఎంతో సమయం పట్టలేదు. దేహం, గళం, బుద్ధి ‘ఆడపిల్లలు మగవాళ్ల కంటే బలహీనులు అనే భావనతోనే పెంచుతారు. అబ్బాయిలను మగాడిలా పోరాడు అంటారు. మేము– ఆడపిల్లను ఆడపిల్లలా పోరాడు అని చెబుతాం. ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు అని చెబుతాం. మన పెంపకంలో ఆడపిల్లకు ఏ అన్యాయం జరిగినా ఊరికే ఉండు, సహించు అనే బోధిస్తారు. మేము ఎదిరించు, నీ గళం వినిపించు, బుద్ధిని ఉపయోగించు అని చెబుతాం. ముఖ్యంగా హింసను ఎదిరించాలంటే ఈ మూడు తప్పవు’ అంటుంది ఇషిత. ‘ముక్కా మార్ శిక్షణలో చేరాక ఏదైనా ప్రమాదం వస్తే పెద్దగా అరిచి ప్రతిఘటించాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించి అక్కడి నుంచి బయటపడాలని ఆ రెండూ సాధ్యం కాకపోతే శారీరకంగా తలపడి పోరాడాలని మాకు తెలిసొచ్చింది’ అని ఒక అమ్మాయి అంది. 1100 స్కూళ్లలో ‘ముక్కా మార్’ శిక్షణ అవసరం మహరాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎం.సి.జి.ఎం (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై) పరిధిలోని 1100 పైగా స్కూళ్లలో ‘ముక్కా మార్’ కార్యకర్తలను వారానికి రెండు రోజులు ఆత్మరక్షణ విద్యలు నేర్పేందుకు ప్రోత్సహించింది. 6,7,8 తరగతులు విద్యార్థినులకు స్కూళ్లలో వారానికి రెండు రోజులు కరాటే, కుంగ్ ఫు, కుస్తీ క్లాసులు నేర్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ద్వారా అంటే వాట్సప్ చాట్‌బోట్ ద్వారా క్లాసులు కొనసాగాయి. ఈ క్లాసులు దేశంలోని ఏ ప్రాంతం ఆడపిల్లలైనా నేర్చుకోవచ్చు. ఇప్పటికి ‘ముక్కా మార్’ ద్వారా 5 వేల మంది ఆడపిల్లలు నేరుగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారు. ఆన్లైన్ ద్వారా 16 వేల మంది అమ్మాయిలు నేర్చుకున్నారు. దాదాపు 300 మంది మహిళా టీచర్లకు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ టీచర్ల ద్వారా 50 వేల మంది ఆడపిల్లల వరకూ నేర్చుకుంటున్నారు. మన సమాజంలో రోజురోజుకూ ఆడపిల్లల మీద హింస, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. అయితే వాటికి భయపడి ఆడపిల్లను ఇంట దాచడం అంటే వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని అంటుంది ఇషితా శర్మ. ‘వారు ధైర్యంగా సమాజంలో తిరగాలి. ప్రమాదం ఎదురైతే ఎదిరించేలా ఉండాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్పడం ద్వారా మాత్రమే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి భయం పోతుంది’ అంటుందామె. నిజంగానే ప్రతి స్కూల్లో మేథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఉన్నట్టుగా ఆడపిల్లల కోసం ఒక కరాటే టీచర్ ఉండాలని ఈ విమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. -
కస్టమర్ నుంచి క్రియేటర్ స్థాయికి..!
షాపింగ్ మోజును..స్టార్టప్‌గా మార్చిన ఇషితా శర్మ - మహిళల ఫ్యాషన్స్‌కు బ్రాండ్‌గా మారిన క్యాండిడ్లీ కౌటూర్... - రూ.5 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. కాకపోతే ఇషితా శర్మకు కాసింత ఎక్కువే ఉంది. ఎంతలా అంటే ఇంటా.. బయటా అందరూ తిట్టేంత. షాపింగ్ వ్యసనం నుంచి బయటపడేందుకామె ఏం చేసిందో తెలుసా..ఆన్లైన్లో దుస్తులను విక్రయించేందుకు క్యాండిడ్లీ కౌటూర్ అనే స్టార్టప్‌ను స్థాపించింది. ఇలాంటి ఆన్లైన్ వేదికలు బోలెడున్నాయిలే అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే క్యాండిడ్లీ కౌటూర్లో ఇషితా శర్మ డిజైన్ చేసిన డ్రెస్సులు మాత్రమే ఉంటాయి మరి. ఆమె డిజైన్స్‌ను సామాన్యులే కాదు బాలీవుడ్ హీరోయిన్లూ ఫాలో అవుతున్నారు కూడా. క్యాండిడ్లీ కౌటూర్ ప్రస్థానం గురించి ఇషితా శర్మ మాటల్లోనే.. చిన్నప్పటి నుంచి షాపింగ్ చేయడమంటే బాగా ఇష్టం. కాసింత ఉన్నోళ్ల కుటుంబం అయ్యేసరికి కాస్త ఎక్కువే ఉండేది. ఫంక్షనుకో.. పార్టీకో తగిన డ్రెస్ దొరక్కపోతే ఎవరికైనా సరే చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకే నాకు నచ్చిన డ్రెస్సులను, డిజైన్స్లను వివరిస్తూ ఓ ఫేస్బుక్ పేజీని ప్రారంభించా. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. నా పోస్ట్‌లను చాలా మంది లైక్ చేసేవారు. బాలేకపోతే కామెంట్లు కూడా వచ్చేవి. అప్పుడే అనిపించింది లైక్ చేసిన డిజైన్స్‌ను కాస్త ఆన్లైన్లో విక్రయిస్తే బాగుంటుంది కదా అని. అనుకున్నదే తడవుగా చేతిలో ఉన్న రూ.3 లక్షల సొమ్ముతో 2014లో క్యాండిడ్లీ కౌటూర్ పేరుతో కంపెనీని ప్రారంభించాను. బాలీవుడ్ హీరోయిన్లూ కస్టమర్లే.. క్యాండిడ్లీ కౌటూర్ రూపొందించిన డిజైన్స్, మోడళ్లకు సామాన్యులే కాదు సెలబ్రిటీలూ కస్టమర్లున్నారు. అక్షయ్ కుమార్‌తో మధురియ తులి నటించిన చిత్రం.. బేబీ ప్రమోషన్లో మధురిమ ధరించిన ఔట్ఫిట్స్ కాండిడ్లీ రూపొందించినవే. ఎంటీవీ వీడియో జాకీ (వీజే), బాలీవుడ్ నటి గాలిన్ మెండిన్కాలు ధరించే డ్రెస్సులు చాలా వరకు ఇక్కడివే. ప్రస్తుతం క్యాండిడ్లీ కస్టమర్ల సంఖ్య 10 వేలు. ఇందులో 30% మంది రిపీటెడ్ కస్టమర్లే. ఇది చాలు క్యాండిడ్లీ రూపొందించే డిజైన్స్ ఎంతబాగుంటాయో చెప్పడానికి. డిజైన్స్, మోడల్స్‌ను బట్టి క్యాండిడ్లీ ధరలుంటాయి. ప్రారంభ ధర రూ.800 నుంచి ఉన్నాయి. విస్తరణ బాటలో క్యాండిడ్లీ.. ప్రస్తుతం మహిళలకు సంబంధించిన హై ఎండ్ డ్రెస్సులు, ఔట్ఫిట్స్, టాప్స్, చీరలను విక్రయిస్తున్న క్యాండిడ్లీ త్వరలోనే బ్యాగులు, షూస్, ఫ్యాన్సీ జ్యువెల్లరీ, మేకప్ సామగ్రి విభాగాలకు విస్తరించనుంది. ఆ తర్వాత పురుషులు, పిల్లల డ్రెస్సులు, యాక్ససరీలను అందుబాటులోకి తీసుకొస్తాం. విస్తరణ ప్రణాళికల నిమిత్తం తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. ఓ ప్రైవేటు కంపెనీ రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తాం. కస్టమర్లకు మరింత దగ్గరవడం కోసం రెండు నెలల్లో క్యాండిడ్లీ కౌటూర్ యాప్‌ను విడుదల చేయనున్నాం. డిస్కౌంట్లుండవ్.. డీల్స్, డిస్కౌంట్లతో కస్టమర్లను చేరుకోవడం క్యాండిడ్లీ కౌటూర్ సిద్ధాంతం కాదు. సరికొత్త డిజైన్స్, హైస్ట్రీట్ ఫ్యాషన్‌తోనే కస్టమర్లను చేరుకోవాలి. అందుకే దేశ, విదేశాల్లోని డిజైన్స్, మోడల్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటాం. వాటిని భారతీయ మహిళ సంప్రదాయాలకు, అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్తగా డిజైన్స్ చేస్తాం. మహిళల వయస్సు, శరీర తీరును బట్టి డిజైన్స్లలో ఎంపిక చేసిస్తాం. కస్టమర్లకు వీలైనంత ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే మా లక్ష్యం. హైదరాబాద్ నుంచి 10-15% ఆర్డ్డర్లు కంపెనీ ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకుండానే రూ.20 లక్షలకు పైగా విక్రయాలు జరిగాయి. అది కూడా ఒక్క రూపాయి మార్కెటింగ్ ఖర్చు లేకుండానే. ప్రతి నెలా వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. మొత్తం ఆర్డర్లలో 35 శాతం ఆర్డర్లు ఢిల్లీ నుంచి వస్తే.. 20% ముంబై నుంచి వస్తున్నవి. ఆ తర్వాతి స్థానం హైదరాబాద్‌దే. ఇక్కడి నుంచి నెలకు 10-15 శాతం ఆర్డర్లొస్తున్నాయి. రెండేళ్లలో హైదరాబాద్‌లో బ్రాంచ్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నాం. దూరాన్ని బట్టి ఆర్డరు చేసిన రోజు నుంచి 2-6 రోజుల్లో డెలివరీ చేస్తాం. ఆన్లైన్ పేమెంట్ గానీ, క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) గానీ రెండూ ఉన్నాయి.