breaking news
Irrigation Facilities
-
ఒక్క చుక్కా తరలించలేదు
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ఏపీ నిర్మించి 200 టీఎంసీలు తరలించుకుపోతుంటే మేము మౌనంగా ఉన్నామని మాజీమంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలా ప్రాజెక్టు నిర్మాణమే జరగలేదు. 200 టీఎంసీలు కాదుకదా ఒక్క చుక్కనీరు ఎవరూ తీసుకుపోలేదు’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తే ఆ లేఖను ఆమె కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు పంపించారని వివరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన ఈ అక్రమ ప్రాజెక్టుకు నిధులు కేటాయించొద్దని కోరుతూ తాము నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌కు ఇప్పటికే కౌంటర్ లేఖలు రాశామని స్పష్టం చేశారు. ‘ఈ అంశంపై అఖిలపక్షం పెట్టాలని అడగడానికి వారెవరు ? పిలవాలో లేదో మేము నిర్ణయం తీసుకుంటాం.. అబద్ధాలు మాట్లాడి పిలవమంటే ఎలా?’అని హరీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు కోలుకోలేని నష్టం.. ‘బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్ని విధాలుగా తీవ్రమైన నష్టం జరిగింది’అని ఉత్తమ్ అన్నారు. ఆ నష్టాలను పూడ్చడానికి ప్రయత్నిస్తుంటే ఓర్వలేకనో అధికారం పోయిందనో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉండగా, తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూన్ 18, 19న, అలాగే 2016 జూన్ 21, 22న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశాలకు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ఇచ్చుకోండి అని చెప్పి వచ్చారని తప్పుబట్టారు.అదే ఏడాది సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్‌తోపాటు ఆ తర్వాత జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా కేటాయింపులు జరిపిందని, దీని ఆధారంగా మనకు ఎక్కువ వాటా అడగాల్సింది పోయి తక్కువ వాటా అడిగారన్నారని విమర్శించారు. క్యాచ్మెంట్ ఏరియా, జనాభా, సాగుకు యోగ్యమైన భూములు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణకు కృష్ణా జలాల్లో 70 శాతం, ఏపీకి 30 శాతం కేటాయింపులు జరపాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2, కేఆర్‌ఎంబీతోపాటు సుప్రీం కోర్టులో పోరాడుతున్నామన్నారు. ‘రాయలసీమ’కు బీఆర్ఎస్ సహకారం ఏపీలోని ముచ్చుమర్రి ప్రాజెక్టు సామర్థ్యం బీఆర్ఎస్ హయాంలో 3,850 నుంచి 6,738 క్యూసెక్కులకు పెరిగినా నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ నిశ్శబ్దంగా ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు. నాడు ఏపీ నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు సాఫీగా జరిగేలా, 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరిందని తప్పుబట్టారు. రోజుకు 3 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టమన్నారు. కేసీఆర్ పాలనలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 నుంచి 92,000 క్యూసెక్కులకు పెరిగిందని, హెచ్ఎన్ఎస్ఎస్, మల్యాల, ముచ్చుమర్రి నుంచి గతంలో కంటే ఎక్కువ నీటిని తీసుకెళ్లడం ప్రారంభమైందన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజుకు 4.1 టీఎంసీలను తరలిస్తే గత ప్రభుత్వ హయాంలో 9.69 టీఎంసీకి పెరిగిందని ఆరోపించారు. -
కందకాలు తవ్వుదాం.. కదలిరండి
► జల సిరుల కోసం ‘సాక్షి’ ఉద్యమం ► రేపు మదనపల్లె, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు సదస్సులు ► నిపుణులు, అనుభవజ్ఞుల ద్వారా సూచనలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయ క్షేత్రాల్లో జల సిరుల సంరక్షణే లక్ష్యంగా ‘సాక్షి’ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రైతులను సమీకరించి వర్షపు నీటి పరిరక్షణకు దోహదపడే కందకాల తవ్వకాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కలిగిం చి ఆ దిశగా అన్నదాతలను కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మదనపల్లి, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు అవగాహన సదస్సులను నిర్వహించనుంది. వర్షపునీటి సంరక్షణలో అనుభవజ్ఞులు, రిటైర్డ్ ఇంజినీర్లతో రైతులకు తగిన సూచనలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. చిత్తూరు జిల్లాలో సాగు యోగ్యమైన భూమి 7,12,093 ఎకరాలు ఉంది. ఇందులో నీటిపారుద ల సౌకర్యం ఉన్న భూ విస్తీర్ణం 6,35,163 ఎకరా లు. చెరువుల, బోర్లకింద సాగయ్యే పొలాలే ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా సాలీనా సగ టు వర్షపాతం 934 మి.మీ. వర్షం రూపేణా కురిసే నీరు 49515 హెక్టారు మీటర్లు కాగా, ఇందులో 40 శాతం నీరు ఆవిరై పోతుంది. ఏటా భూమిలో ఇంకే నీరు మాత్రం 5447 హెక్టారు మీటర్లేనని జల వనరులు, భూగర్భ జల శాఖల గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో పడమర మండలాలైన మదనపల్లి, తంబళ్లపల్లి ప్రాంతాల్లో టమాట ఇతరత్రా వాణిజ్య, కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. సరైననీటి సదుపాయం లేక, భూగర్భ జలాలు అందుబాటులో లేక రైతులు విలవిల్లాడుతున్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతాలకు సాగునీటి సదుపాయం లభించే వీలుంది. ఈ నేపథ్యంలో దిగాలుపడ్డ రైతున్నల్లో భరోసా నింపి అధిక దిగుబడుల సాధన దిశగా వీరిని ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. జిల్లాలు, మండలాలవారీగా రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి చేను కింద కందకాల ఆవశ్యకతను వివరిస్తోంది. ముందుకొచ్చిన రైతులకు దగ్గరుండి కందకాల తవ్వకంలో సహకారం అందించనుంది. -
వరద కాలువలు అధికంగా ఉన్న నది?
భారత్ వ్యవసాయాధారిత దేశం. కాబట్టి వ్యవసాయానికి సరిపడా నీటి లభ్యత ఉండాలి. మనదేశంలో వ్యవసాయం ప్రధానంగా రుతుపవనాలపై ఆధారపడి ఉంది. విశాల భారతదేశంలో వర్షపాతం, ఉష్ణోగ్రత తదితర వాతావరణ అంశాల్లో ప్రాంతీయ వ్యత్యాసాలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా శీతోష్ణస్థితి పరంగా భారత్.. ఉష్ణమండల దేశం కావడం వల్ల కృత్రిమ పద్ధతుల ద్వారా వివిధ పంటలకు నీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. భారతదేశం - నీటి పారుదల సౌకర్యాలు వర్షపాతంతో సంబంధం లేకుండా పంటలకు అవసరమైన నీటి వసతిని వివిధ మార్గాల ద్వారా కల్పించడాన్ని ‘నీటిపారుదల వసతులు’ (Irrigation Facilities) అంటారు. మనదేశంలో నీటిపారుదల వసతులు పురాతన కాలం నుంచే ఉన్నాయని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో కావేరి నదిపై ఆనకట్ట నిర్మించారు. మొగలుల పాలనా కాలంలో పశ్చిమ యమున కాలువను తవ్వించినట్లు ఆధారాలున్నాయి. దీన్ని క్రీ.శ. 1568లో అక్బర్ మరమ్మతు చేయించినట్లుగా చెబుతున్నారు. 1529లో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీ కృష్ణదేవరాయలు తుంగభద్ర కాలువను తవ్వించారు. భారతదేశంలో వ్యవసాయం చేస్తున్న 141.7 మిలియన్ హెక్టార్ల భూమిలో 139 మిలియన్ హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. 2007 మార్చి చివరి నాటికి 102.77 మిలియన్ హెక్టార్ల భూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. దేశంలో 1950-51 నాటికి 22.6 మిలియన్ హెక్టార్లకు మాత్రమే నీటి పారుదల సౌకర్యం ఉండేది. నీటి పారుదల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి భారతదేశానికి అనేక భౌగోళిక అనుకూలతలున్నాయి. అవి: - జీవనదులు - ఆనకట్టలు నిర్మించడానికి అనువైన స్థలాలు - చెరువుల నిర్మాణానికి అనువైన స్థలాకృతి - తగినంత భూగర్భ జల లభ్యత వర్షపాతం, నదీ వ్యవస్థను ఆధారంగా చేసుకొని దేశంలోని నీటి పారుదల వసతులను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) కాలువలు (26%) 2) బావులు (62%) 3) చెరువులు (3%) వీటితో పాటు ఇతర పద్ధతుల ద్వారా కూడా నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాలువలు ఏడాది పొడవునా ప్రవహించే జీవనదులుఉన్నందువల్ల ఉత్తర భారతదేశ మైదాన ప్రాంతంలో కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉంది. 1950-51లో కాలువల ద్వారా సాగైన నికరభూమి 8.3 మిలియన్ హెక్టార్లు. 2008 నాటికి ఇది 17.30 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. బావుల ద్వారా సాగయ్యే భూ విస్తీర్ణం అధికమవుతున్నందువల్ల దేశం మొత్తం మీద నీటి పారుదల వల్ల సాగయ్యే నికర భూమిలో కాలువల ద్వారా సాగయ్యే భూమి వాటా క్రమంగా తగ్గుతోంది. 1950-51లో ఇది 39.7% ఉండగా 1992-93 నాటికి 34.1 శాతానికి, ప్రస్తుతం 26 శాతానికి తగ్గిపోయింది. కాలువల ద్వారా ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలున్న రాష్ట్రాలు: 1) ఉత్తర ప్రదేశ్ 2) ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) భారతదేశంలో రెండు రకాల కాలువలున్నాయి. అవి: 1. వరద కాలువలు: ఇవి వర్షాకాలంలోని వరద నీటిపై ఆధారపడి ఉంటాయి. పంజాబ్‌లోని ‘సట్లేజ్’ నదికి అధిక సంఖ్యలో వరద కాలువలున్నాయి. 2. జీవ కాలువలు: నదికి అడ్డంగా ఆనకట్టను నిర్మించడం ద్వారా నీటిని నిల్వ చేసి, ఆ నీరు సంవత్సరం పొడవునా ప్రవహించడానికి వీలుగా ఉండే కాలువలను ‘జీవ కాలువలు’ అంటారు. వీటినే ‘నదీ కాలువలు’ అని కూడా అంటారు. భారతదేశంలోని ఉత్తర మైదానాల్లో జీవ కాలువలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పంట కాలువ భారతదేశంలో ఉంది. దీన్నే ‘ఇందిరాగాంధీ కాలువ’ లేదా ‘రాజస్థాన్ కాలువ’ అంటారు. దీని పొడవు సుమారు 468 కి.మీ. ఇది ప్రధానంగా రాజస్థాన్‌లోని బియాస్ నది నుంచి పంజాబ్‌లోని హరికే బ్యారేజీ వద్ద రావి నది వరకూ ఉంది. 1884లో సట్లేజ్ నదిపై రూపార్ వద్ద ‘సర్హింద్’ కాలువను తవ్వించారు. రాష్ట్రాల వారీగా ముఖ్యమైన కాలువలు ఉత్తరప్రదేశ్: ఎగువ గంగ, ఆగ్రా, దిగువ గంగ, శారద, తూర్పు యమున, బెట్వా, కెన్, గోవిందసాగర్, ఒనగంగా. రాజస్థాన్: రాజస్థాన్ కాలువ (ఇందిరాగాంధీ కాలువ), బనాస్, ఘగ్గర్, పార్వతి భాక్రా. పంజాబ్, హర్యానా: పశ్చిమ యమున, సర్హింద్, ఎగువ భారీ దోయాబ్, నంగల్, బికనీర్. పశ్చిమ బెంగాల్: మయురాక్షి, దామోదర్, మిడ్నాపూర్, కాంగ్ సబాతి. బీహార్: సోన్, కోసి, గండక్, త్రివేణి. గుజరాత్: కాక్రపార, ఉకాయ్, రుద్రమాత, ఓజాత్, తామరి, పానం. ఒడిశా: మహానది కాలువ, సంబల్పూర్, బారాఘర్, ససన్. ఆంధ్రప్రదేశ్: జవహర్లాల్, బకింగ్‌హామ్, భైరవాని తిప్ప, పెన్నార్, కృష్ణా, గోదావరి డెల్టాలోని కాలువలు. తెలంగాణ: లాల్ బహదూర్, కాకతీయ. తమిళనాడు: మెట్టూరు, నెయ్యార్, భవాని, పరాంబికుళం. మహారాష్ట్ర: ప్రవర, గంగాపూర్, ములూ, నీరా, గోదావరి, గిర్నాల్, తపతి కాలువ. కర్ణాటక: తుంగభద్ర, విశ్వేశ్వరయ్య, రాజోలిబండ, మాలప్రభ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్: చంబల్, తండూలా. కేరళ: మలంపూజ బకింగ్ హామ్ కాలువ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉంది. దీన్ని ‘తెలుగు గంగ కాలువ’ అని కూడా అంటారు. దీని ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణానది నీటిని రాయలసీమ సాగునీటి అవసరాలకు, చెన్నై నగరానికి తాగునీటిని అందిస్తున్నారు. బావులు భారతదేశంలో నీటిపారుదల ఎక్కువగా బావుల ద్వారానే ఉంది. డెల్టాయేతర, కాలువలు లేని ప్రాంతాల్లో తక్కువ లోతులో బావుల ద్వారా లభించే భూగర్భ జలాలను వ్యవసాయానికి ఉపయోగించడం మనదేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న ప్రధానమైన ఆచారం. బావుల ద్వారా నీటి వసతి కలిగే నికర భూమి వాటా 1950-51లో 28.7 శాతం ఉండగా 1992-93 నాటికి 52.9 శాతానికి, ప్రస్తుతం 62 శాతానికి పెరిగింది. బావులను సాధారణంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) మాములు బావులు లేదా ఉపరితల బావులు 2) గొట్టపు బావులు బావుల ద్వారా ఎక్కువగా నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తున్న రాష్ట్రాలు: 1) ఉత్తరప్రదేశ్ 2) రాజస్థాన్ 3) మధ్యప్రదేశ్ అత్యధిక శాతం బావులు ఉన్న రాష్ట్రం - గుజరాత్ చెరువులు చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉండటం, ఉపరితలం కఠినమైన శిలలతో నిర్మితమై ఉండటం, నీరు సులభంగా ఇంకిపోని పొరలతో ఏర్పడటం లాంటివి దీనికి ప్రధాన కారణాలు. అందువల్ల ఈ ప్రాంతం చెరువుకట్టలను నిర్మించడానికి, నీటిని నిల్వ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. 1950-51లో మొత్తం నీటిపారుదలలో చెరువుల కింద 17.2% ఉండగా 1997-98 నాటికి 6 శాతానికి, ప్రస్తుతం 3 శాతానికి తగ్గిపోయింది. చెరువుల ద్వారా ఎక్కువగా సాగయ్యే రాష్ట్రాలు: 1) ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ర్టం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) 2) తమిళనాడు తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం - మిషన్ కాకతీయ. అన్ని నీటిపారుదల సౌకర్యాలను కలిపి ఉన్న భూమికి, ఒక ప్రాంతంలో సాగయ్యే మొత్తం భూమికి మధ్య ఉండే నిష్పత్తిని ‘నీటి పారుదల సాంద్రత’ అంటారు. కాంపిటీటివ్ కౌన్సిలింగ్ పోటీ పరీక్షల కోసం ‘భారతదేశం - నీటి పారుదల వసతులు’ టాపిక్‌లో ఏయే అంశాలను చదవాలి? - పి. కృష్ణప్రియ, కాజీపేట. ప్రతి పోటీ పరీక్షలో ఈ పాఠ్యభాగం నుంచి 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజల జీవనాధారం వ్యవసాయం. దీనికి ప్రధానంగా నీటి సౌకర్యాలు కావాలి. వర్షపాతం రుతుపవనాలపై ఆధారపడి ఉండటం వల్ల భారతదేశమంతా నీటి పారుదల సౌకర్యాల్లో వ్యత్యాసాలున్నాయి. అందువల్ల ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వివిధ పంచవర్ష ప్రణాళికల్లోనూ దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల దృష్ట్యా ఈ పాఠ్యభాగం అత్యంత ప్రధానమైంది. నీటి పారుదల రకాలు, అవి ఎక్కువగా కల్పిస్తున్న రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాలువలు, వాటి ప్రత్యేకతలు మొదలైన అంశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. భారతదేశంలోని ప్రధానమైన నదులు, అవి ప్రవహించే రాష్ట్రాలపై ఆధారపడి సాగునీటి కాలువలు, ప్రాజెక్టులు నెలకొని ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇలాంటి అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ఈ పాఠ్యభాగాన్ని చదివితే క్షుణ్నమైన అవగాహన ఏర్పరుచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 8, 9, 10వ తరగతి సాంఘికశాస్త్ర పుస్తకాలతో పాటు ఇంటర్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. గతంలో అడిగిన ప్రశ్నలు 1. కిందివాటిలో ప్రధానంగా బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం? (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్-2013) 1) ఉత్తర కోస్తాంధ్ర 2) దక్షిణ కోస్తాంధ్ర 3) రాయలసీమ 4) తెలంగాణ 2. కాకతీయ కాలువ కింద పేర్కొన్న ఏ నీటి పారుదల ప్రాజెక్టులో భాగం? (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్-2013) 1) నాగార్జునసాగర్ 2) తెలుగు గంగ 3) శ్రీరామ్‌సాగర్ 4) ప్రాణహిత - చేవెళ్ల 3. ఎస్సీ/ఎస్టీల భూముల నీటిపారుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన పథకం పేరేమిటి? (పోలీస్ కానిస్టేబుల్స్-2012) 1) రాజీవ్ జలప్రభ 2) అంబేద్కర్ జలప్రభ 3) ఇందిరా జలప్రభ 4) జవహర్లాల్ నెహ్రూ జలప్రభ 4. బకింగ్ హామ్ కాలువ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? (పోలీస్ కానిస్టేబుల్స్-2009) 1) ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు 2) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక 3) పశ్చిమ బెంగాల్ - బీహార్ 4) కేరళ - కర్ణాటక సమాధానాలు 1) 4; 2) 3; 3) 3; 4) 1. 1. భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది? 1) విశ్వేశ్వరయ్య 2) బంకింగ్ హామ్ 3) ఇందిరాగాంధీ కాలువ 4) లాల్ బహదూర్ శాస్త్రి కాలువ 2. కిందివాటిలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం? 1) మిజోరాం 2) పంజాబ్ 3) ఆంధ్రప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్ 3. ‘మయురాక్షి’ కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? 1) రాజస్థాన్ 2) ఉత్తరప్రదేశ్ 3) పంజాబ్ 4) పశ్చిమ బెంగాల్ 4. శారద కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? 1) ఉత్తరప్రదేశ్ 2) రాజస్థాన్ 3) మహారాష్ర్ట 4) బీహార్ 5. వరద కాలువలు అధికంగా ఉన్న నది? 1) బియాస్ 2) రావి 3) సట్లేజ్ 4) దామోదర్ సమాధానాలు 1) 3; 2) 2; 3) 4; 4) 1; 5) 3. - ముల్కల రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, హరీష్ అకాడమీ, హన్మకొండ.