తెలుగు తమ్ముళ్ల ఎత్తులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు
రేషన్‌షాపులు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల కోసం పోటీ పడుతున్న తెలుగు తమ్ముళ్లు.. అనుభవం లేకపోయినా ఎత్తిపోతల పథకాల నిర్వహణ కమిటీల కోసం ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణ బాధ్యతలపై రైతులు ఆసక్తి చూపలేదు.
కొత్త ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో వాటి నిర్వహణ కమిటీల కోసం గ్రామాల్లోని టీడీపీ సానుభూతిపరులు, నేతలు పోటీపడుతున్నారు.
ఇప్పటివరకు కొనసాగుతున్న కమిటీలకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులపై టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. కాదు కూడదంటే పథకాలకు విద్యుత్ సరఫరా కట్ చేస్తామని, మరమ్మతులకు మంజూరైన నిధు లను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.
ఈ వివాదాలు పథకాల పనితీరుపై ప్రభావాన్ని చూపుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ఇరిగేషన్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాలువ చివరి భూము లు, మెట్ట భూములకు సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి.
కృష్ణా, గుంటూరు జిల్లాలోని సాగర్ కాలువ చివరి భూములు, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని మెట్టభూములకు సాగునీటిని అందించేందుకు 330 ఎత్తిపోతల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయకట్టు పరిధిలోని రైతులు కమిటీలుగా ఏర్పడి వాటిని నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలే ఇప్పటి వరకు వీటిని నిర్వహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సానుభూతిపరులు, గ్రామాల్లోని పెద్ద రైతులకు ఈ కమిటీలపై కన్నుపడింది.
ఈ కమిటీ చైర్మన్‌గా నియమితులైన వారికి గ్రామాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పథకం నిర్వహణ పూర్తిగా చైర్మన్ ఆధీనంలోకి వస్తుంది.
దీని కోసం సేకరించిన నిధులను వారికి అనుకూలంగా వాడుకునే అవకాశం ఉంటుంది. పంట పొలాలకు సాగునీటి సరఫరాపై అధికారాలు వస్తాయి.
వీటిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోని టీడీపీ సానుభూతిపరులు, పెద్ద రైతు లు పాత కమిటీల్లోని సభ్యులను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే అనేక గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు, హత్యాయ త్నాలు జరగడంతోపాటు అనేక మంది హత్యకు గురయ్యారు.
వీటిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ పథకాల కమిటీ సభ్యుల్లో కొంద రు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.
రైతులకు సేవ చేయాలనే భావన కలిగిన కొందరు చైర్మన్లు పదవులకు రాజీనామా చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తుంటే టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి పీఏలు రంగంలోకి దిగి బెదిరిస్తున్నారు.
ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో 30 శాతం మంది సభ్యులు కమిటీలకు రాజీనామా చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
కొందరైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కమిటీలో కొనసాగడంలో అర్థం లేదని, వివాదాల ప్రభావం పథకం నిర్వహణపై పడుతుందనే భావనకు వస్తూ రాజీనామా చేస్తున్నారు.
పాత పథకాల పునరుద్ధరణకు
రూ.141 కోట్లు..
రాష్ట్రంలో మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించడానికి ఇంజినీర్లు రూ.141 కోట్లతో అంచనాలు తయారు చేశారు.
ఒక్క గుంటూరు జిల్లాలోనే 68 పథకాలకు రూ.57.60 కోట్లతో అంచనాలు సిద్ధం చేశా రు. ఈ జిల్లాలో వాణిజ్య పంటల సాగుకు ఎత్తిపోతల పథకాలను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ఈ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తే 1.64 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య పరి ష్కా రం కాగలదని ఇంజినీర్లు చెబుతున్నారు.
తెలుగు తమ్ముళ్లు, విద్యుత్ సరఫరా, ఇరిగేషన్‌శాఖ, Telugu brothers, power supply, irigesansakha