breaking news
iPhone 6plus
-
ఐఫోన్ కాదు.. అది స్పై ఫోన్!
యాపిల్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్6, ఐఫోన్ 6ప్లస్ లాంటివి కొనాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎప్పుడెప్పుడు ఎలా తిరుగుతున్నారో అన్ని విషయాలూ ఎవరికైనా తెలిసినా ఫర్వాలేదనుకుంటే ఆ ఫోన్ కొనేసుకోండి. తెలియద్దనుకుంటే మాత్రం ఒకసారి మళ్లీ ఆలోచించుకోండి. ఎందుకంటే.. యాపిల్ ఫోన్లలో ఉన్న ఓ ఫంక్షన్.. మీ కదలికలన్నింటినీ రికార్డు చేసేస్తుందట. మీరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పనిచేస్తారో, తరచు ఎక్కడికి వెళ్తున్నారో, ఏయే సమయాల్లో ప్రయాణాలు చేస్తారో అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. 'ఫ్రీక్వెంట్ లొకేషన్స్' అనే ఈ ఫీచర్ను దాదాపు ఏడాది క్రితమే ఐఫోన్లలోకి గుట్టుగా ఎక్కించేశారు. కానీ చాలామందికి దీని గురించి ఏమాత్రం తెలియకుండా ఐదు లేయర్ల కింద దీన్ని కప్పిపెట్టేశారు. కేవలం మ్యాపింగ్ సర్వీసులను మెరుగుపరచడానికే ఈ అప్లికేషన్ పెట్టినట్లు యాపిల్ కంపెనీ చెబుతున్నా, దీంతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నది మాత్రం ఒప్పుకోక తప్పని వాస్తవం. ఇది చాలా భయంకరమైనదని, షాకింగ్ న్యూస్ అని బ్రిటన్ కంప్యూటర్ నిపుణుడు ప్రొఫెసర్ నోయెల్ షార్కీ చెప్పారు. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ షాపింగ్ చేస్తున్నామో, ఎక్కడ తాగుతున్నామో అన్నీ రికార్డు అయిపోతాయని, విడాకుల లాయర్లకు దీనివల్ల పని సులభం అవుతుందని ఆయన చెప్పారు. ఐఫోన్ వాడేవాళ్లందరికి సంబంధించిన వివరాలు ఇలా రికార్డు అయిపోతాయని, సామాన్యుల విషయంలో పెద్ద సమస్య కాకపోయినా, వీఐపీలు.. ప్రాణాలకు ప్రమాదం ఉంటుందనుకునే వాళ్ల విషయంలో మాత్రం ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ డేటా ఎవరివద్దకైనా వెళ్తే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. -
ఐఫోన్6 తాకిడితో.. యాపిల్ వెబ్సైట్ క్రాష్
యాపిల్ కంపెనీ వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. అర్ధరాత్రి నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ ఫోన్లకు ఆర్డర్లు ఇవ్వడానికి కస్టమర్లు సైట్ మీద వెల్లువెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. యాపిల్ స్టోర్ సైట్లోకి యూజర్లు అర్ధరాత్రి నుంచి లాగాన్ కావడం మొదలుపెట్టారు. రాత్రిపూట అయితే సర్వర్లు స్పీడుగా ఉంటాయని అప్పటినుంచి ఐఫోన్ల అమ్మకాలను ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఒకేసారి అందరూ వచ్చి పడటంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి. కొన్ని సర్వీసులను మాత్రం దాదాపు అరగంట తర్వాత పునరుద్ధరించారు. కానీ మళ్లీ శనివారం ఉదయం యాపిల్ స్టోర్ చాలామందిక ఓపెన్ కాలేదు. డెస్క్టాప్ సైట్లో ఐఫోన్ దొరకట్లేదని, అయితే కొన్ని క్యారియర్ వెబ్సైట్లు, యాపిల్ స్టోర్ యాప్లో మాత్రం దొరుకుతోందని కొంతమంది చెప్పారు. దీంతో చాలామంది వినియోగదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తెల్లవారుజాము వరకు తమ ఆర్డర్ ఇచ్చేందుకు వాళ్లు వేచి ఉన్నారు. ఐఫోన్ 6 లాంచింగ్ సమయం నుంచే సమస్యలు మొదలయ్యాయి. లాంచింగ్ సమయంలో లైవ్స్ట్రీమ్ దాదాపు 25 నిమిషాల పాటు ఆగిపోయింది. దాంతో చాలామంది చైనా భాషలోనే కామెంట్రీ వినాల్సి వచ్చింది.